
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడినిఒక జంతువుతో పోల్చడమా?అది కూడా అన్ని అవలక్షణాలు ఉన్నదానితోనా? ఎందుకబ్బా అన్న సందేహం వస్తోందా? అయితే ఇందులో ఓ లుక్కేయండి..
బాగా డబ్బున్న వాడని చెప్పాలంటే బిల్‌గేట్స్ అని.. మహాభయంకరమైన క్రూరుడు అనాలని అనుకుంటే అడాల్ఫ్ హిట్లర్‌తోనూ పోలుస్తుంటారు!మరి.. కాళ్లు, చేతుల్లేని.. కళ్లు కూడా కనిపించని.. మట్టిలో తలదూర్చి బతుకీడ్చే ఓ జీవిని ఎవరితో పోలిస్తే బాగుంటుంది? ‘‘డెర్మోఫిస్ డొనాల్డ్ ట్రంపీ’’ అనేద్దాం అంటోంది ఎన్విరోబిల్డ్! రెండు అమెరికాలను కలిపే ప్రాంతంలో పనామా అని ఓ బుల్లి దేశం ఉంటుంది. కొన్నేళ్ల క్రితం శాస్త్రవేత్తలు అక్కడో విచిత్ర జంతువును గుర్తించారు. దీనికేమో కళ్లు కనపడవు. కీళ్ల వంటివి లేకపోవడం తో అటు ఇటు కదల్లేదు. ఒక్కోటి పది సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అన్నింటి కంటే ముఖ్యమైంది ఇదో ఉభయచరం. జంతుశాస్త్ర పరిభాషలో ఈ జంతువు కెసీలియన్ జాతికి చెందినది. కొంచెం సులువుగా చెప్పుకోవాలంటే గుడ్డిదైన పాముల జాతి అని అర్థం. చివరగా.. వాతావరణ మార్పుల వల్లే ఈ జీవి త్వరలోనే అంతరించిపోనుంది. కెసీలియన్ ఉభయచరాన్ని గుర్తించింది మొదలు శాస్త్రవేత్తలు దీనికేం పేరు పెట్టాలబ్బా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఎటూ తేల్చుకోలేక.. పేరు పెట్టే హక్కులను వేలం వేశారు. ఇలా వచ్చిన డబ్బును అడవుల సంరక్షణకు వాడాలన్నది వారి ఆలోచన. చివరకు దాదాపు 25 వేల డాలర్లు అంటే రూ. 17 లక్షలు పెట్టి ఎన్విరోబిల్డ్ సీఈవో ఐడన్ బెల్ ఈ హక్కులను చేజిక్కించుకున్నారు. అన్ని రకాలుగా ఆలోచించి.. ఆ జంతువుకు ‘డెర్మోఫిస్ డొనాల్డ్ ట్రంపీ’ అనే పేరు పెడతా అని ప్రకటించాడు.
ఆ ఉభయచరానికి.. డొనాల్డ్ ట్రంప్‌కూ ఏంటోయ్ సంబంధం? అని బోలెడంత మంది గద్దిస్తే బెల్ మాత్రం అదే కరెక్ట్ పేరని నొక్కి వక్కాణిస్తున్నాడు! వాతావరణ మార్పుల ప్రభావం అందరికీ కనపడుతున్నా ట్రంప్ అలాంటిదేమీ లేదంటున్నారు. కళ్లున్నా చూడలేకపోతున్నారు కాబట్టి కెసీలియన్ పాము జాతి జంతువులానే ప్రవర్తిస్తున్నారని వివరించాడు. అధ్యక్షుడయ్యాక.. భూతాపోన్నతిని నియంత్రించేందుకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకునేలా చేశారు. అంతేనా.. మనిషి చర్యల వల్లే భూమి ఉష్ణోగ్రత పెరిగిపోతోందన్న శాస్త్రవేత్తల మాటలను వినిపించకుండా ఉండేలా మట్టిలో తలదూర్చుకుని ఉంటున్నారు. ఇవన్నీ సరిపోవా ఆయనగారి పేరును ఈ ఉభయచరానికి పెట్టేందుకు? అని బెల్ ప్రశ్నిస్తున్నాడు. పోలికలు అచ్చుగుద్దినట్లు సరిపోయాయి.. ఇంకేముంది ఆ పేరు ఖాయం చేసేద్దాం అనుకుంటున్నారా? అంత ఈజీ కాదులెండి! శాస్త్రవేత్తల బృందం ఒకటి ఓకే చెబితేనే ‘డెర్మోఫిస్ డొనాల్డ్ ట్రంపీ’పేరు రూఢీ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment