మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం
జైపాల్
♦ జీఎస్టీపై గుడ్డిగా సంతకాలు.. తర్వాత గగ్గోలు..
♦ కరీంనగర్‌కు మెడికల్ కళాశాల ఇవ్వాల్సిందే
సాక్షి, కరీంనగర్: సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీతో చీకటి ఒప్పందం ఉందని, ప్రధానికి ఏనాడో కేసీఆర్ సరెండర్ అయ్యారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆరోపిం చారు. మోదీ అడగ్గానే ఏం ఆలోచించకుండా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రానికి మద్దతుగా ఓట్లు వేశారని, ప్రజాప్రయోజ నాలను ఆలోచించకుండానే జీఎస్టీకి, నోట్ల రద్దుకు గుడ్డిగా మద్దతు పలకడం వంటి పనులు ఉత్సాహంగా చేసి, ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
కరీంనగర్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాల సాధనకు ఈనెల 5 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు సంఘీభావం తెలపడానికి బుధవారం ఆయన కరీంనగర్‌కు వచ్చారు. ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుసుకున్న ఆయన ప్రభాకర్‌ను ఒప్పించి ఆమరణదీక్ష విరమింపజేశారు. అనంతరం జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేసిన నాడు, గుడ్డిగా సపోర్టు చేసిన నాడు ఇబ్బందులు కేసీఆర్‌కు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి నాటకాలాడితే ఎవరూ నమ్మరన్నారు. అంతా అయిపోయాక అరిచి లాభం లేదని హితవు పలికారు. కరీంనగర్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మూడు నెలల్లోగా ప్రభుత్వ మెడికల్ కళాశాలపై స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెడికల్ కాలేజీపై సీఎం కేసీఆర్ మాట ఇచ్చి తీర్చకపోవడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు బొమ్మ వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌రెడ్డి, సుద్దాల దేవయ్య, కోడూరి సత్యనారాయణగౌడ్, మాజీ జెడ్పీ చైర్మన్ అడ్డూరి లక్ష్మణ్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు మత్యుంజయం తదితరులు పాల్గొన్నారు.