సాక్షి, హైదరాబాద్: మనిషికి జ్ఞానాన్నిచ్చే అవయవాల్లో కళ్లది క్రియాశీల పాత్ర. చూపులేకుంటే జీవితమంతా అంధకారమే. అలాంటి కళ్ల పనితీరు, దృష్టి లోపాలపై చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. కంటి పనితీరుకు ఊతమిచ్చే ఆహార పదార్థాలు తినడంలో తాత్సారంతో ఏటా వేలాది మంది అంధకారంలో పడిపోతున్నారు. 2015–19 మధ్య కాలంలో ర్యాపిడ్ అసిసెట్‌మెంట్ ఆఫ్ అవైడబుల్ బ్లైండ్‌నెస్ విధానం ద్వారా దేశంలో అంధత్వం, దృష్టి లోపాలపై కేంద్రఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎయిమ్స్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజి కల్ సైన్సెస్, అఖిల భారత ఆయుర్విజ్ఞాన సంస్థ సంయుక్తంగా సర్వే చేశాయి. దీని వివరాలను కేంద్రం విడుదల చేసింది. యాభై ఏళ్లలోపు వయసున్న వారిలో ఏటా 1.99 శాతం మంది అంధత్వానికి గురవుతున్నట్లు వెల్లడి కావడం గమనార్హం. చదవండి: వారి కళ్లు మళ్లీ చూడబోతున్నాయ్!
సర్వే సాగిందిలా...
ఆర్‌ఏఏబీని లండన్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఐహెల్త్(ఐసీఈహెచ్) అభివృద్ధి చేసింది. దీని ప్రకారం 50 ఏళ్లలోపున్న వారిని నిర్ణీత పద్ధతిలో సర్వే చేశారు. దేశవ్యాప్తంగా 31 జిల్లాలను ర్యాండమ్‌గా ఎంపిక చేశారు. రాష్ట్రం నుంచి వరంగల్ జిల్లాను ఎంచుకున్నారు. ప్రతి జిల్లా నుంచి 3వేల నమూనాల చొప్పున మొత్తం 93 వేల నమూనాలను ఎంచుకుని సర్వే చేసి ఫలితాలను క్రోడీకరించారు. సర్వే చేసిన వారిలో 1.99 శాతం అంధత్వంతో ఉండగా, 1.96 శాతం తీవ్రమైన దృష్టి లోపంతో ఉన్నట్లు గుర్తించారు. మరో 9.81 శాతం మధ్యస్త దృష్టి లోపంతో ఉండగా, 12.92 శాతం మంది త్వరలో ఏర్పడే దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు నిర్ధారిం చారు. మరో 11.77 శాతం అతి తీవ్రతతో కూడిన దృష్టిలోపం, 13.76 శాతం మందిలో సాధారణ దృష్టిలోపం ఉన్నట్లు అంచనావేశారు. సాధారణ పనులు చేసుకునేందుకు ఇబ్బంది పడే దృష్టిలోపంతో 1.03 శాతం మంది ఉన్నారు.చదవండి: ‘ప్రైవేటు’గా సమాచార సేకరణ!
రెండో స్థానంలో వరంగల్...
వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో అంధత్వంతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది.జాతీయ సగటు 1.99 శాతం ఉండగా.. వరంగల్ 3.47 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా (3.67శాతం) ఉంది.
కాటరాక్ట్ సమస్యతోనే...
66.2 శాతం మందిలో అంధత్వానికి, 80.7శాతం మందిలో తీవ్రమైన దృష్టి లోపం రావడానికి, 70.2శాతం మందిలో మధ్యతరహా దృష్టి లోపానికి కాటరాక్ట్ కారణమని తెలింది. 2001 వరకూ వక్రీభవన లోపాలు దృష్టి లోపానికి రెండో అతి పెద్ద కారణమైతే, కార్నియా కారణంగా ఏర్పడే దృష్టి లోపాలు ఇప్పుడు మరో అతిపెద్ద సమస్యగా మారింది. అలాగే కాటరాక్టు సర్జరీలో వచ్చే సమస్యల కారణంగా కూడా దృష్టి కోల్పోవడం ఎక్కువగా జరుగుతోందని సర్వే అంచనా వేసింది.
► అంధత్వంతో బాధపడుతున్నవారు: 1.99%
► అతి తీవ్ర దృష్టిలోపమున్నవారు: 11.77%
► తీవ్ర దృష్టి లోపమున్నవారు: 1.96%
► మధ్యస్తంగా ఉన్న వారు: 9.81%
►త్వరలో చూపు సమస్యలు ఏర్పడేవారు: 12.92%
Comments
Please login to add a commentAdd a comment