Visual impairment
-
కళాకాంతులు.. వారి హృదయానికి కళ్లున్నాయి..
వెండితెర, బుల్లితెరపై అంధపాత్రలు ధరించి ఎంతోమంది నటీనటులు ప్రేక్షకుల ప్రశంసలు పొందడం మనకు తెలిసిందే! మరి ఏ భావోద్వేగాలు పలికించలేరనుకునే అంధులే నటిస్తే... ‘అలాంటి వారు కూడా ఉన్నారా!’ అనే ఆశ్చర్యానికి సమాధానంగా బబిత, హేమేంద్రలు అంధ కళాకారులుగా రాణిస్తున్నారు. ప్రపంచంలో అందమైన దృశ్యాన్ని చూడటానికి వారికి కళ్లు లేవు. అయితేనేం, వారి కళా నైపుణ్యం కారణంగా ప్రపంచమే ఇప్పుడు వారివైపు చూస్తోంది. అంధులైనప్పటికీ రంగుల తెరపై తమదైన ముద్ర వేస్తున్న వీరి నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే! నా దారిని నేను వెతుక్కోగలను.. ముంబైలో ఉంటున్న 24 ఏళ్ల బబిత సరోజ్ మరాఠీ ఫీచర్ ఫిల్మ్ ‘ద్రిశాంత్’లో నటిస్తోంది. దుఃఖం, గాంభీర్యం, కోపం.. ఈ భావాలను పలికించడానికి భయం అక్కర్లేదు. ఏదైనా చేయాలనే తపన, క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టు వీడకుండా ప్రతి ఒక్కరూ తమ కలలను నెరవేర్చుకోగలరనే నమ్మకం ఉంటే చాలని తాను ఎన్నుకున్న దారి ద్వారా సమాధానం చెబుతుంది బబిత. ‘ఇదెలా సాధ్యం..?’ అని అడిగిన వారిపై ‘అంధులు తమంతట తాముగా ఏమీ చేయలేరని, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేరని అనుకుంటారు. ఆలోచించే మెదడు, మాట్లాడే నాలుక ఉన్నప్పుడు ఎవరి సాయం లేకుండానే నడవగలను. నా ఆలోచనా శక్తితో నా దారిని నేను వెతుక్కోగలను. అలాంటప్పుడు నేను ఎందుకు నటించలేను’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. త్వరలో విడుదల కానున్న దృష్ట్ సినిమా షూటింగ్ సన్నివేశంలో బబిత బబిత తన గురించి మరిన్ని వివరాలు చెబుతూ –‘2009లో అనారోగ్యం కారణంగా నా కంటి చూపును కోల్పోయాను. కానీ, నటనపై ఉన్న ఇష్టం నా మనస్సులో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత మూడేళ్లకు నా జీవితానికి ఆధారమైన నాన్న దూరమయ్యారు. దీంతో నా చిన్న అవసరాలు కూడా తీర్చుకోవడానికి చాలా కష్టపడేదాన్ని. రోజుల తరబడి ఏడుస్తూనే కూర్చున్నాను. కానీ, ఒక రోజు నా పనులన్నీ నేనే చేసుకోవాలి, ఇలా దుఃఖిస్తూ కూర్చుంటే బతకలేను అని అర్ధమైంది. ఈ ఆలోచన నా మార్గం నన్ను చూసుకునేలా చేసింది. స్నేహితులు, తెలిసిన వారి ద్వారా చాలా టీవీ సీరియల్స్, సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాను. రోజూ స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. చివరికి ఓ రోజు నా కష్టానికి ఫలితం దక్కింది. మరాఠీ బుల్లితెరపై నడిచే సీరియల్, షార్ట్ ఫిల్మ్‌లో హీరోయిన్గా అవకాశం వచ్చింది. షూటింగ్ సమయంలో అడుగుల లెక్కింపుతో కెమెరాను సమన్వయం చేసుకుంటాను. ఇది కష్టమైనప్పటికీ కొన్ని రోజుల సాధనతో సాధించగలిగాను. దర్శకుడు చెప్పిన దాని ప్రకారం నా పని నేను పూర్తి చేస్తాను. సెట్స్‌లో అంధురాలిగా అస్సలు భావించను. ఎలాంటి పాత్ర చేసినా ముందుగా నన్ను నేను సిద్ధం చేసుకుంటాను. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుంది. దానిని దాచడం వల్ల ప్రయోజనం లేదు, దానిని బహిర్గతం చేసి అధిగమించడమే మనముందున్న సవాల్. నాకు కావల్సింది నేను పొందాలనుకున్నప్పుడు వెనుకంజ వేసేది లేదు అని ఆత్మవిశ్వాసంతో చెప్పే బబిత న టించిన ‘దృష్ట్’ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది. చీకటిని తొలగించే మార్గం... వారణాసిలో ఉంటున్న 25 ఏళ్ల హేమేంద్ర తన మనసులోని చీకటిని తొలగించే మార్గాన్ని కనుక్కొన్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఓటీటీ ఫిల్మ్ ‘మిస్టరీ థ్రిల్లర్ బ్రీత్ ఇన్ టు ది షాడోస్’ మూడవ సీజన్లో హేమేంద్ర సైబర్ క్రైమ్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ‘అంధాధున్’ సినిమా సమయం లో నటుడు ఆయుష్మాన్ ఖురానాకు దృష్టిలోపం ఉన్నవారు ఎలా జీవిస్తారో హేమేంద్ర స్వయంగా నేర్పించాడు. అదే సమయంలో ‘శుభో బిజోయ్’ చిత్రానికి నటుడు గుర్మీత్చౌదరి అంధుడి పాత్రకు హేమేంద్ర నుంచే శిక్షణ తీసుకున్నాడు. 17 ఏళ్ల వయసులో ఆప్టిక్ న్యూరైటిస్ అనే వ్యాధి కారణంగా కంటి చూపు కోల్పోయిన హేమేంద్ర ‘ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. అయితే, నేను ఎందుకు రాణించలేను అని నాకు నేను ప్రశ్న వేసుకుని ఆ తర్వాత నిరంతర సాధనతో ఈ స్థాయికి చేరుకోగలిగా’’ అని తెలియజేస్తాడు. ‘చూపు కోల్పోవడంతో నా కలలన్నీ కల్లలయ్యాయి. ఈ షాక్‌ని భరించడం చాలా కష్టమైంది. కానీ, నా కుటుంబ సభ్యులు మాత్రం నాలో ధైర్యాన్ని నింపారు. నా భవిష్యత్తును నేను ప్రకాశవంతం చేసుకోవాలనుకున్నాను. అందుకోసం కష్టపడటం మొదలుపెê్టను. ఈ ప్రయత్నంలో భాగంగా ముంబైలో దృష్టిలోపం ఉన్నవారికోసం పనిచేస్తున్న ఒక సంస్థను కలిశాను. అక్కడ అంధులైన పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. అటు తర్వాత పరిచయమైనవారి ద్వారా కళారంగంవైపుగా అడుగులు వేశాను. షూటింగ్ సమయంలో కెమరాను ఫేస్ చేయడం చాలా కష్టం. అయితే, యాక్టింగ్, ఎమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కొన్నిసార్లు అడవి, సముద్రం వంటి ప్రదేశాల్లోనూ షూటింగ్స్ జరుగుతాయి. అలాంటి చోట అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో నేను నా చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని, దానిలోపలే ఉంటూ పని పూర్తిచేస్తుంటాను’ అని వివరిస్తాడు హేమేంద్ర. సాధించాలనే తపనకు అవయవలోపం అడ్డంకి కానేకాదు అని నిరూపిస్తున్న ఈ యువ కళాకారులు ‘మేమూ సాధించగలం’ అనే స్ఫూర్తిని తమలాంటి వారెందరిలోనూ నింపుతున్నారు. -
అంధత్వం; దేశంలోనే వరంగల్ రెండో స్థానం..
సాక్షి, హైదరాబాద్: మనిషికి జ్ఞానాన్నిచ్చే అవయవాల్లో కళ్లది క్రియాశీల పాత్ర. చూపులేకుంటే జీవితమంతా అంధకారమే. అలాంటి కళ్ల పనితీరు, దృష్టి లోపాలపై చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. కంటి పనితీరుకు ఊతమిచ్చే ఆహార పదార్థాలు తినడంలో తాత్సారంతో ఏటా వేలాది మంది అంధకారంలో పడిపోతున్నారు. 2015–19 మధ్య కాలంలో ర్యాపిడ్ అసిసెట్మెంట్ ఆఫ్ అవైడబుల్ బ్లైండ్నెస్ విధానం ద్వారా దేశంలో అంధత్వం, దృష్టి లోపాలపై కేంద్రఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎయిమ్స్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజి కల్ సైన్సెస్, అఖిల భారత ఆయుర్విజ్ఞాన సంస్థ సంయుక్తంగా సర్వే చేశాయి. దీని వివరాలను కేంద్రం విడుదల చేసింది. యాభై ఏళ్లలోపు వయసున్న వారిలో ఏటా 1.99 శాతం మంది అంధత్వానికి గురవుతున్నట్లు వెల్లడి కావడం గమనార్హం. చదవండి: వారి కళ్లు మళ్లీ చూడబోతున్నాయ్! సర్వే సాగిందిలా... ఆర్ఏఏబీని లండన్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఐహెల్త్(ఐసీఈహెచ్) అభివృద్ధి చేసింది. దీని ప్రకారం 50 ఏళ్లలోపున్న వారిని నిర్ణీత పద్ధతిలో సర్వే చేశారు. దేశవ్యాప్తంగా 31 జిల్లాలను ర్యాండమ్‌గా ఎంపిక చేశారు. రాష్ట్రం నుంచి వరంగల్ జిల్లాను ఎంచుకున్నారు. ప్రతి జిల్లా నుంచి 3వేల నమూనాల చొప్పున మొత్తం 93 వేల నమూనాలను ఎంచుకుని సర్వే చేసి ఫలితాలను క్రోడీకరించారు. సర్వే చేసిన వారిలో 1.99 శాతం అంధత్వంతో ఉండగా, 1.96 శాతం తీవ్రమైన దృష్టి లోపంతో ఉన్నట్లు గుర్తించారు. మరో 9.81 శాతం మధ్యస్త దృష్టి లోపంతో ఉండగా, 12.92 శాతం మంది త్వరలో ఏర్పడే దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు నిర్ధారిం చారు. మరో 11.77 శాతం అతి తీవ్రతతో కూడిన దృష్టిలోపం, 13.76 శాతం మందిలో సాధారణ దృష్టిలోపం ఉన్నట్లు అంచనావేశారు. సాధారణ పనులు చేసుకునేందుకు ఇబ్బంది పడే దృష్టిలోపంతో 1.03 శాతం మంది ఉన్నారు.చదవండి: ‘ప్రైవేటు’గా సమాచార సేకరణ! రెండో స్థానంలో వరంగల్... వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో అంధత్వంతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది.జాతీయ సగటు 1.99 శాతం ఉండగా.. వరంగల్ 3.47 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా (3.67శాతం) ఉంది. కాటరాక్ట్ సమస్యతోనే... 66.2 శాతం మందిలో అంధత్వానికి, 80.7శాతం మందిలో తీవ్రమైన దృష్టి లోపం రావడానికి, 70.2శాతం మందిలో మధ్యతరహా దృష్టి లోపానికి కాటరాక్ట్ కారణమని తెలింది. 2001 వరకూ వక్రీభవన లోపాలు దృష్టి లోపానికి రెండో అతి పెద్ద కారణమైతే, కార్నియా కారణంగా ఏర్పడే దృష్టి లోపాలు ఇప్పుడు మరో అతిపెద్ద సమస్యగా మారింది. అలాగే కాటరాక్టు సర్జరీలో వచ్చే సమస్యల కారణంగా కూడా దృష్టి కోల్పోవడం ఎక్కువగా జరుగుతోందని సర్వే అంచనా వేసింది. ► అంధత్వంతో బాధపడుతున్నవారు: 1.99% ► అతి తీవ్ర దృష్టిలోపమున్నవారు: 11.77% ► తీవ్ర దృష్టి లోపమున్నవారు: 1.96% ► మధ్యస్తంగా ఉన్న వారు: 9.81% ►త్వరలో చూపు సమస్యలు ఏర్పడేవారు: 12.92% -
దారిచూపుతున్నారు
రెండు నిమిషాలు కళ్లు మూసుకుంటే.. మన ముందు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతాం.. అలాంటిది బతుకంతా చీకటైతే.. జీవిత ప్రయాణం ఎంత అంధకారం. అటువంటి దృష్టిలోపం ఉన్న వారికి బతుకుదారి ‘చూపు’తోంది నేత్ర విద్యాలయం. శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులో శ్రీరామనగరంలో ఉన్న జీవా ప్రాంగణంలో చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 2007-08 విద్యా సంవత్సరంలో 55 మంది విద్యార్థులతో ఏర్పాటైందీ సంస్థ. ఇందులో అంధ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాప్‌ట్యాప్‌లపై బోధిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, డిగ్రీలో 116 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. - శంషాబాద్ రూరల్ దృష్టిలోపం వారి ప్రతిభకు అడ్డుకారాదు.. వైకల్యాన్ని అధిగమించడమే కాకుండా అంధుల ఉజ్వల భవిష్యతుకు బాటలు వేయాలనే సంకల్పంతో.. దేశంలోనే మొదటిసారిగా అంధ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాప్‌ట్యాప్‌లపై విద్యాబోధన, పరీక్షలు నిర్వహిస్తూ ఖ్యాతి గడించింది ‘నేత్ర విద్యాలయం’. శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులో శ్రీరామనగరంలో ఉన్న జీవా ప్రాంగణంలో శ్రీ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 2007-08 విద్యా సంవత్సరంలో 55 మంది విద్యార్థులతో ఇంటర్మీడియట్ బోధనకు శ్రీకారం చుట్టారు. ఇంటర్లో హెచ్ఈసీ, సీఈసీ గ్రూపులు ఉండగా.. 2010-11లో బీఏ, బీకాం కోర్సులతో డిగ్రీ బోధనను ప్రారంభించారు. కో-ఎడ్యూకేషన్ విధానంతో అంధ విద్యార్థులకు ఈ నేత్ర విద్యాలయంలో ఉచిత బోధన, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంటర్, డిగ్రీలో ప్రస్తుతం 116 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 మంది విద్యార్థులు బీఏ, బీకాం పూర్తి చేసుకున్నారు. వీరిలో చాలా వరకు ఉద్యోగాలు సంపాదిం చారు. నిష్ణాతులైన అధ్యాపక బృందం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడి అంధ విద్యార్థులు సాధారణ విద్యా ర్థులకు ఏరకంగా తీసిపోకుండా చదువులో రాణిస్తున్నారు. వినూత్న రీతిలో బోధన.. అంధ విద్యార్థులు సాధారణంగా బ్రెయిలీ లిపి ద్వారా బోధన సాగిస్తుంటారు. దీని కారణంగా వారు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. పరీక్షల సమయంలో సహాయకుల మీద ఆధారపడక తప్పదు. వీటంన్నిటినీ అధిగమించేలా నేత్ర విద్యాలయంలో వినూత్న బోధనకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు పూర్తిగా ల్యాప్‌ట్యాప్‌లపై అభ్యాసం చేయడంతో పాటు పరీక్షలు రాయడం ఇక్కడి ప్రత్యేకత. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘జాస్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈ నేత్ర విద్యాలయంలో తెలుగు రాష్ట్రాల్లోని కరీంనగర్, గుంటూరు, విజయనగరం, అనంతపురం, తిరుపతి ప్రాంతాల వారితో పాటు జార్ఖండ్ విద్యార్థులు ఉన్నారు. దినచర్య ఇలా .. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో అభ్యాసం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా సంగీత, నృత్యం, క్రీడల్లో తర్ఫీదునిస్తున్నారు. భవిష్యత్‌కు బాటలు.. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న వారిలో చాలా మంది విద్యార్థులు బ్యాంకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, కార్యాలయాల్లో ఉద్యోగాలు సాధించారు. ఐఏఎస్ కావాలన్నదే జీవితాశయం.. ఈ కళాశాలలో చదువుతో పాటు జీవిత లక్ష్యంపై అవగాహన కలిగింది. పదో తరగతి వరకు అంధ పాఠశాలలో చదువుకుని ఇంటర్మీడియట్లో ఇక్కడ చేరాను. ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం. ఐఏఎస్ కావాలన్నది నా జీవితాశయం. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం కోచింగ్ తీసుకుంటాను. జీవితంలో గొప్ప మలుపు.. ఈ కళాశాలలో చదువుకోవడం నా జీవితంలో గొప్ప మలుపు. ఇక్కడ 2015లో డిగ్రీలో చేరాను. నాన్న, అక్క సాయంతో ఇంటర్ వరకు పూర్తి చేశాను. బెంగళూరులో కంప్యూటర్ కోర్సులో చేరినపుడు.. అక్కడ ఈ కళాశాల పూర్వ విద్యార్థి ద్వారా తెలుసుకుని వచ్చాను. పొలిటికల్ సైన్స్ టీచర్ కావాలన్నది నా ఆశయం. - అంకిత్, జార్ఖండ్, బీఏ, రెండో సంవత్సరం -
దృష్టిలోపం ఉన్నవారికి కంప్యూటర్ విద్య
విశాఖపట్నం : హనుమంతవాక సమీపంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో దృష్టి లోపం ఉన్నవారి కోసం గురువారం ప్రత్యేక కంప్యూటర్ శిక్షణను ఆస్పత్రి చైర్మన్ గుళ్లపల్లి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్, ఎంప్లాయి గివింగ్ క్యాంపస్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. దృష్టి లోపంగల విద్యార్థులు విద్య, ఉద్యోగ అవకాశాల కోసం కంప్యూటర్ శిక్షణ పొందేందుకు ఈ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. మూడు నెలల ఈ శిక్షణలో అసిస్టివ్ టెక్నాలజీ, స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్‌లో భాగమైన జాస్, మాజిక్, విండోస్ ఐస్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌లో భాగమైన వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్, టాలీ, స్టావేర్ లాంగ్వేజెస్, సి, సి ప్లస్ ప్లస్, జావా, హెచ్‌టీఎంఎల్, ఎస్‌క్యూఎల్ తదితర అంశాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తారని వివరించారు. పూర్తిగా అంధత్వం ఉన్న 32 మందికి, పాక్షిక అంధత్వ కలిగిన 96 మందికి శిక్షణ ఇస్తారన్నారు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ మోహన్‌కుమార్, మైక్రోసాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ సెంటర్ మేనేజింగ్ డెరైక్టర్ అనిల్ భన్సాలీ, ఎల్వీపీ కంటి వైద్యుడు డాక్టర్ అవినాష్ పతంగే పాల్గొన్నారు.