దారిచూపుతున్నారు
రెండు నిమిషాలు కళ్లు మూసుకుంటే.. మన ముందు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతాం.. అలాంటిది బతుకంతా చీకటైతే.. జీవిత ప్రయాణం ఎంత అంధకారం. అటువంటి దృష్టిలోపం ఉన్న వారికి బతుకుదారి ‘చూపు’తోంది నేత్ర విద్యాలయం. శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులో శ్రీరామనగరంలో ఉన్న జీవా ప్రాంగణంలో చినజీయర్ స్వామి
పర్యవేక్షణలో 2007-08 విద్యా సంవత్సరంలో 55 మంది విద్యార్థులతో ఏర్పాటైందీ సంస్థ. ఇందులో అంధ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాప్‌ట్యాప్‌లపై బోధిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, డిగ్రీలో 116 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.
- శంషాబాద్ రూరల్
దృష్టిలోపం వారి ప్రతిభకు అడ్డుకారాదు.. వైకల్యాన్ని అధిగమించడమే కాకుండా అంధుల ఉజ్వల భవిష్యతుకు బాటలు వేయాలనే సంకల్పంతో.. దేశంలోనే మొదటిసారిగా అంధ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాప్‌ట్యాప్‌లపై విద్యాబోధన, పరీక్షలు నిర్వహిస్తూ ఖ్యాతి గడించింది ‘నేత్ర విద్యాలయం’. శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులో శ్రీరామనగరంలో ఉన్న జీవా ప్రాంగణంలో శ్రీ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 2007-08 విద్యా సంవత్సరంలో 55 మంది విద్యార్థులతో ఇంటర్మీడియట్ బోధనకు శ్రీకారం చుట్టారు. ఇంటర్‌లో హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూపులు ఉండగా..
2010-11లో బీఏ, బీకాం కోర్సులతో డిగ్రీ బోధనను ప్రారంభించారు. కో-ఎడ్యూకేషన్ విధానంతో అంధ విద్యార్థులకు ఈ నేత్ర విద్యాలయంలో ఉచిత బోధన, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంటర్, డిగ్రీలో ప్రస్తుతం 116 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 మంది విద్యార్థులు బీఏ, బీకాం పూర్తి చేసుకున్నారు. వీరిలో చాలా వరకు ఉద్యోగాలు సంపాదిం చారు. నిష్ణాతులైన అధ్యాపక బృందం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడి అంధ విద్యార్థులు సాధారణ విద్యా ర్థులకు ఏరకంగా తీసిపోకుండా చదువులో రాణిస్తున్నారు.
వినూత్న రీతిలో బోధన..
అంధ విద్యార్థులు సాధారణంగా బ్రెయిలీ లిపి ద్వారా బోధన సాగిస్తుంటారు. దీని కారణంగా వారు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. పరీక్షల సమయంలో సహాయకుల మీద ఆధారపడక తప్పదు. వీటంన్నిటినీ అధిగమించేలా నేత్ర విద్యాలయంలో వినూత్న బోధనకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు పూర్తిగా ల్యాప్‌ట్యాప్‌లపై అభ్యాసం చేయడంతో పాటు పరీక్షలు రాయడం ఇక్కడి ప్రత్యేకత. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘జాస్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈ నేత్ర విద్యాలయంలో తెలుగు రాష్ట్రాల్లోని కరీంనగర్, గుంటూరు, విజయనగరం, అనంతపురం, తిరుపతి ప్రాంతాల వారితో పాటు జార్ఖండ్ విద్యార్థులు ఉన్నారు.
దినచర్య ఇలా ..
ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో అభ్యాసం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా సంగీత, నృత్యం, క్రీడల్లో తర్ఫీదునిస్తున్నారు.
భవిష్యత్‌కు బాటలు..
ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న వారిలో చాలా మంది విద్యార్థులు బ్యాంకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, కార్యాలయాల్లో ఉద్యోగాలు సాధించారు.
ఐఏఎస్ కావాలన్నదే జీవితాశయం..
ఈ కళాశాలలో చదువుతో పాటు జీవిత లక్ష్యంపై అవగాహన కలిగింది. పదో తరగతి వరకు అంధ పాఠశాలలో చదువుకుని ఇంటర్మీడియట్‌లో ఇక్కడ చేరాను. ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం. ఐఏఎస్ కావాలన్నది నా జీవితాశయం. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం కోచింగ్ తీసుకుంటాను.
జీవితంలో గొప్ప మలుపు..
ఈ కళాశాలలో చదువుకోవడం నా జీవితంలో గొప్ప మలుపు. ఇక్కడ 2015లో డిగ్రీలో చేరాను. నాన్న, అక్క సాయంతో ఇంటర్ వరకు పూర్తి చేశాను. బెంగళూరులో కంప్యూటర్ కోర్సులో చేరినపుడు.. అక్కడ ఈ కళాశాల పూర్వ విద్యార్థి ద్వారా తెలుసుకుని వచ్చాను. పొలిటికల్ సైన్స్ టీచర్ కావాలన్నది నా ఆశయం. - అంకిత్, జార్ఖండ్, బీఏ, రెండో సంవత్సరం