కై కలూరు: చీకట్లో చిరుదివ్వెలా.. నిశీధిలో కాంతి పుంజంలా.. అసమాన ప్రతిభతో ఆదర్శంగా నిలుస్తున్నారు అంధురాలు బొల్లా జోత్స్న ఫణిజా. విద్య, సంగీతం, రచన, వచన, గానం, అనువాదం, బోధన ఇలా పలు రంగాల్లో రాణిస్తూ దేశ, విదేశాల్లో ప్రశంసలు పొందుతున్నారు. ఆమె గాత్రం ఓ మధురస్వరం.. కంప్యూటర్ కోబోర్డు ఆమె క్లోజ్ ఫ్రెండ్.. మనోనేత్రంతో అక్షర జ్యోతులు వెలిగిస్తున్నారు.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఆమె కవిత చేరడం గర్వించదగిన విషయం.
ఆంగ్ల సాహిత్యంలో రాణిస్తూ..
ఏలూరు జిల్లా కై కలూరుకు చెందిన బొల్లా అభిమన్యుకుమార్, సత్యవతి కుమార్తె జ్యోత్స్న ఫణిజా పుట్టుకతో అంధురాలు. అయినా తల్లిదండ్రులు ఏమాత్రం కుంగిపోలేదు. చిన్నతనం నుంచి ఆమెను అన్నిరకాలుగా ప్రోత్సహించారు. జ్యోత్స్న ప్రాథమిక విద్యాభ్యాసం నరసాపురం అంధుల పాఠశాల, ఇంటర్ కై కలూరు, డిగ్రీ విజయవాడలో పూర్తిచేశారు. ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్‌లో ఎంఏ ఆంగ్ల సాహిత్యం, ఇదే అంశంలో పీహెచ్‌డీ డాక్టరేట్, అడ్వాన్స్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు, ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంటుగా ఇలా చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఫెయిర్ అండ్ లవ్లీ మెరిట్ స్కాలర్‌షిప్‌తో పాటు మిస్ కాలేజీ రన్నరప్‌గానూ ఆమె నిలిచారు.
సంగీతం.. ఆమె ప్రాణం
జ్యోత్స్న ఫణిజా కర్ణాటక, హిందూస్థానీ సంగీతంలో ప్రావీణ్యం పొందారు. కువైట్ తెలుగు కళాసమితి నిర్వహించిన సంగీత స్వరనీరాజనంలో సత్తాచాటారు. ‘సాక్షి టీవీ’ నిర్వహించిన ‘కచేరి’ సంగీత కార్యక్రమంలో ప్రతిభ చూపారు. అలాగే పలు టీవీ చానళ్లు నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లో ప్రతిభ చాటారు. దూరదర్శన్ సప్తగిరి చానల్ ‘ఆలపాన’ కార్యక్రమంలో పలు గీతాలు ఆలపించారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభ, రవీంద్రభారతి వేదికలపై సంగీత కచేరీలు ఇచ్చారు.
కవితల్లో ఘనాపాటి
ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ ఆనర్స్ మూడో సంవత్సర సిలబస్‌లో జ్యోత్స్న రాసిన ‘సీ’ కవితను పాఠ్యాంశంగా చేర్చారు. ఇప్పటివరకూ ఆమె 120 వరకు కవితలు రాశారు. అమెరికా, లండన్, మలేషి యా, కెనడా, ఇంగ్లిష్ మేగజైన్లలో ఆమె ప్రచురితమయ్యాయి. ప్రముఖ కవి మోపూరు పెంచుల నరసింహం తెలుగులో రచించిన రెండు కవితా సంపుటాలను క్రింసన్ లేంప్, స్టోండ్ సాంగ్ పేరుతో ఆమె అనువదించారు. ఆమె రాసిన ‘నేడు కురిసినవాన’ కవితకు నాటా (నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) కవితా పురస్కారం దక్కింది. పెన్నా రచయిత సంఘం ఉగాది పురస్కారం, సత్యశ్రీ సాహితీ పురస్కారం, రాధేయ ఉత్తమ పురస్కారం, పాతూరి మాణిక్యమ్మ స్మారక పురస్కారం వంటివి ఆమె అందుకున్నారు.
25 ఏళ్లకే పీహెచ్‌డీ : ఫారెన్ లాంగ్వేజెస్ అంశంపై 25 ఏళ్లకే ఆమె పీహెచ్‌డీ సాధించి 2017లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ఆమె రాసిన సిరామిక్ ఈవ్‌నింగ్ పుస్తకాన్ని చదివిన ప్రధాని మోదీ అభినందన లేఖను పంపారు. వరల్డ్ ఐ రైట్ ఇన్ పుస్తకానికి ఎడిటర్‌గా ఆమె కూడా పనిచేశారు. 2009లో దగ్గర బంధువు రాధాకృష్ణను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు హరిచందన్ ఆదిత్య చిన్నతనం నుంచే కవితా రచనలో ఆసక్తి చూపుతున్నాడు. అతడు రాసిన జాస్మిన్ బడ్స్ అనే కవిత డిఫరెంట్ ట్రూట్స్ అనే మేగజైన్‌లో ప్రచురితమయ్యింది.
అవార్డుల పరంపర : ఆమె వక్తృత్వం, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో 100 వరకు బహుమతులు సాధించారు. రెటీనా ఇండియా అవార్డు, బాలా మెమోరియల్ అ వార్డు, సంఘ మిత్ర అసోసియేన్ అంతర్జాతీయ వికలాంగ దినోత్సవ అవార్డు, స్వరం ఓ వరం సంగీత సన్మానం, ఏలూరు వెల్ఫేర్ సొసైటీ మహిళా దినోత్సవ సన్మానం, సరిగమ సంగీత పరిషత్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రతిభా పురస్కారం, ధీరూబాయ్ అంబానీ స్కాలర్‌షిప్, ఫెయిర్ అండ్ లవ్లీ ప్రతిభ పురస్కారం పొందారు. ఆత్మరాం సనాతన్ ధర్మా కాలేజీ, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 2015లో అసిస్టెంట్ ప్రొ ఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె ఇంగ్లిష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంటుగా యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ సెట్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
మహిళా శక్తి ఎంతో గొప్పది
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. విద్యార్థులకు మాతృభాషలో సాహితీ విలువలను నేర్పించాలి. సమాజంలో మహిళలపై వివక్ష చూపరాదు. మనం సంపాదించిన డబ్బుతో ఒకరి ఆకలి తీర్చండి, తెలిసిన విద్యను నేర్పించి ఉపాధి మార్గం చూపండి. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించవచ్చు. ప్రతిఒక్కరూ లక్ష్యంతో ముందుకు సాగాలి. – జ్యోత్స్న ఫణిజా, సాహితీవేత్త, కై కలూరు
Comments
Please login to add a commentAdd a comment