పరిశోధన ఫలితాలు లాభసాటిగా ఉండాలి
నూజివీడు: మామిడి పరిశోధన ఫలితాలు రైతులకు లాభసాటిగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడు మామిడి పరిశోధ నస్థానం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో కిసాన్ మేళా, వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ముందుగా స్టాల్స్ సందర్శించారు. అనంతరం రైతులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలనుద్ధేశించి మాట్లాడుతూ నూజివీడు మామిడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇటీవల నాణ్యమైన మామిడి దిగుబడి రాకపోవడంతో రైతులు ఎంతగానో నష్టపోతున్నారన్నారు. ప్రస్తుతం మామిడికి నల్ల తామర పురుగులు ప్రధాన సమస్యగా తయారయ్యాయని మామిడి శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు తోటల్లో జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నివారించుకోవాలి తప్ప పురుగుమందులతో నివారించలేమన్నారు. సమావేశంలో వైఎస్సార్ హార్టీకల్చర్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే గోపాల్, అపేడా రీజనల్ హెడ్ ఆర్‌పీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


