లీసా ఇర్వింగ్, ఆమె పెంపుడు శునకం బెర్నీ
డబ్బు లేకపోవడం మాత్రమే పేదరికం కాదు. పేదరికం అనేక రూపాల్లో, స్వరూపాల్లో ఉంటుంది. చదువు లేకపోవడం, ఆలోచన లేకపోవడం, ఒకరిపై ఆధారపడటం.. ఇవన్నీ పేదరికాలే. శారీరక వైకల్యం కూడా ఒక విధమైన పేదరికమే. దృష్టి, మాట, వినికిడి.. వంటివి లేకపోవడం భౌతిక పేదరికాలు. పేదరికంలో ఉన్నవాళ్లు పోరాటం చేయలేరు. చేసినా వారికి న్యాయం జరిగితే బాగుండన్న ఆశైతే ఉంటుంది తప్ప న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉండదు. ‘పేదవాడి కోపం పెదవికి చేటు’ అనే నానుడి ఇందుకే వచ్చి ఉండాలి. అయితే లీసా ఇర్వింగ్ అనే మహిళ ఈ నానుడిని తుడిచేశారు. ఆమెకు కోపం వచ్చింది కానీ ఆ కోపం ఆమెకు చేటు అవలేదు. తనను పద్నాలుగుసార్లు క్యాబ్ ఎక్కించుకోకుండా నిరాకరించిన ఉబర్ కంపెనీ మీద కోపంతో ఆమె వేసిన కేసులో ఇప్పుడు ఆమెకు రాబోతున్న నష్టపరిహారం 1.1 మిలియన్ డాలర్లు. అంటే 8 కోట్ల రూపాయలు! ఆమె పేదరికం.. కంటి చూపు లేకపోవడం.
లీసా అంధురాలు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉంటారు. ఇంట్లో తనొక్కరే ఉంటారు లీసా. ఆ మాట పూర్తిగా నిజం కాదనాలి. ఆమెతో పాటు ఆమె పెంపుడు శునకం బెర్నీ కూడా ఆమెతో ఉంటుంది. లీసా ఓ ప్రేవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఇప్పుడు చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే.. ఆమె అనేకసార్లు ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లారు. ఎందుకు అలస్యంగా వెళ్లారు అంటే క్యాబ్‌లు ఏవీ ఆమెను ఎక్కించుకోలేదు. ఉబర్ క్యాబ్‌లైతే ఆమెను పద్నాలుగుసార్లు క్యాబ్ ఎక్కించుకోడానికి నిరాకరించాయి. ఆమె అంధురాలు అవడం ఒక కారణం అయితే, ఆమె వెంట బెర్నీ ఉండటం ఇంకొక కారణం. ‘‘కుక్క ఉంటే ఎక్కించుకోం’’ అని క్యాబ్‌లు.. దగ్గరి వరకు వచ్చి కూడా లీసా పక్కన బెర్నీని చూసి వెళ్లిపోయిన సందర్భాలు ఆమె జీవితంలో చాలానే ఉన్నాయి. కానీ పక్కన బెర్నీ లేకుంటే ఆమెకు జీవితమే లేదు. ఇంట్లో లీసాకు సహాయం చేసేదీ, ఆఫీస్‌కు రోడ్డు దాటించేదీ, క్యాబ్‌లు ‘మాట్లాడిపెట్టి’ (అరుపులతో క్యాబ్‌లను ఆపి) ఇంటికి, ఆఫీస్‌కు ఆమె పక్కన ఉండి మరీ తీసుకెళ్లి తీసుకొచ్చేదీ బెర్నీనే! లీసాకు ఉద్యోగం కంటే కూడా బెర్నీ ముఖ్యం.
అందుకే ఉద్యోగం పోతే ఆమెకు పెద్దగా మనసు కష్టం అనిపించలేదు కానీ.. బెర్నీని, తనను క్యాబ్‌లో ఎక్కించుకోడానికి క్యాబ్ డ్రైవర్‌లు అయిష్టం చూపడం ఆమెను బాధించింది. కొందరు ఎక్కించుకున్నా కూడా.. దారి పొడవునా.. బెర్నీని ఏదో ఒకటి అనడం కూడా ఆమె హృదయాన్ని మరింతగా గాయపరిచింది. తన నిస్సహాయతను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆమెకు ఆవేదనగా ఉండేది. కోపం ఆమెను ఊపేసేది. చివరికి లీసా ఉబర్‌పై కోర్టుకు వెళ్లారు. ఆమె కేసు వేసింది 2018లో. మొన్న గురువారం తీర్పు వెలువడింది. ఉబర్ ఆమెకు 8 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆర్డర్! ఉబర్ తన వాదనను వినిపించకుండా ఉంటుందా? తమ డ్రైవర్‌లు కాంట్రాక్ట్ మీద చేరినవారు కనుక వారు చూపిన నిర్లక్ష్యానికి కంపెనీ తరఫున తాము నష్టపరిహారాన్ని చెల్లించే అవసరం లేదని వాదించినా కోర్టు లీసా వైపే నిలబడింది. ‘‘మానవత్వం మరచి, అంధురాలిపై వివక్ష కనబరుస్తూ లీసాకు రైడ్ ఇవ్వడకుండా నిరాకరించినందుకు, ఇచ్చికూడా ఆమెను, ఆమె శునకాన్ని తృణీకారంగా మాట్లాడినందుకు నష్టపరిహారం చెల్లించవలసిందేనని అంతిమంగా తీర్పు చెప్పింది.
లీసా ఇర్వింగ్ అప్పట్లో చేస్తూ ఉన్నది పెద్ద ఉద్యోగం కాదు. పెద్ద ఉద్యోగం కాదంటే.. పెద్ద జీతం వచ్చే ఉద్యోగం కాదు. కనుక ఆమె సొంతంగా క్యాబ్‌లో వెళ్లలేరు. రైడ్ షేరింగ్ క్యాబ్‌ను మాట్లాడుకోవలసిందే. యాప్‌తో రైడ్ షేరింగ్‌ని బుక్ చేయడం కూడా ఆమెకు కష్టమే. అలాంటప్పుడు క్యాబ్ డ్రైవర్‌లే ఆపి, ఆమెకు రైడ్ షేరింగ్ ఇవ్వడం వారి కనీస ధర్మం. పైగా అమెరికాలోని ‘డిజెబిలిటీస్ యాక్ట్’ ప్రకారం అంధులకు ‘గైడ్’ గా ఉన్న డాగ్‌కు ఛార్జి తీసుకోకూడదు. షేర్ రైడింగ్ కనుక డాగ్‌కి కూడా చోటు కల్పించడం కష్టం అనీ, డాగ్ ఉన్నప్పుడు మరొకరు షేరింగ్‌కు రారని క్యాబ్ డ్రైవర్‌లు అంధుల విషయంలో ఉదాసీనతను ప్రదర్శిస్తుంటారు.
నిజానికి క్యాబ్ డ్రైవర్‌లు ఒకసారి క్యాబ్‌లో ఎక్కిన అంధుడు / అంధురాలి ఫోన్ నెంబర్ తీసుకుని వారు కనుక ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో ప్రయాణించే ఉద్యోగులు అయితే మర్నాడు మళ్లీ అదే సమయానికి వారికి కాల్ చేసి అందుబాటులోకి క్యాబ్‌ని తెస్తారు. అయితే లీసాకు చేదు అనుభవాలే ఎక్కువగా ఉన్నాయి. ఆమె దాదాపుగా పీడకల వంటి ఒక పెద్ద మానసిక క్షోభనే అనుభవించారు. ఆ క్షోభకే ఇప్పుడు ఈ నగదు పరిహారం. ఉబర్ చెల్లిస్తుందా, పైకోర్టుకు వెళుతుందా చూడాలి. ఏమైనా లీసా చేసిన న్యాయపోరాటం వల్ల ‘పేదవారికి’ కూడా పోరాడగలం అనే ధైర్యం వచ్చింది. పోరాడాలి అన్న స్పహ కూడా.
Comments
Please login to add a commentAdd a comment