న్యూయార్క్: అక్రమాలకు పాల్పడుతున్న 49 ఏళ్ల భారతీయ అమెరికన్‌కు అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. అతను అక్రమంగా భారతీయ పౌరులను ఉబెర్ సాయంతో కెనడా నుంచి అమెరికా సరిహద్దులలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పించడం, అలాగే వారిని మిడ్‌వెస్ట్, అక్కడి కన్నా ముందుకు తీసుకురావడం చేస్తున్నాడన్న ఆరోపణలతో అతనికి మూడేళ్లకు పైబడిన జైలు శిక్ష విధించింది.
మనీలాండరింగ్‌కు పాల్పడుతూ..
కాలిఫోర్నియాకు చెందిన ఎల్మ్‌గ్రోవ్ నివాసి రాజిందర్ పాల్ సింగ్ ఉరఫ్ జస్పాల్ గిల్ మనీలాండరింగ్‌కు పాల్పడుతూ విదేశీయులను అక్రమంగా రవాణా చేయడం, వారికి ఆశ్రయం కల్పించడం చేస్తున్నాడన్న ఆరోపణలు రుజువు కావడంతో సియెటల్ జిల్లా కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. అక్రమంగా సరిహద్దులలోకి ప్రజలను తరలించేందుకు ఉబెర్‌ను ఉపయోగించిన స్మగ్లింగ్ రింగ్‌లో కీలక సభ్యుడైన రాజిందర్ సింగ్ తాను అర మిలియన్ డాలర్లకు పైగా మొత్తాన్ని అందుకున్నట్లు గత ఫిబ్రవరిలో నేరాన్ని అంగీకరించాడు.
సరిహద్దులు దాటించేందుకు ఉబెర్..
తీర్పు సందర్భంగా యూఎస్ తాత్కాలిక అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ మాట్లాడుతూ ‘నాలుగేళ్ల వ్యవధిలో సింగ్ 800 మందికి పైగా ప్రజలను ఉత్తర సరిహద్దుల గుండా యునైటెడ్ స్టేట్స్‌లోని వాషింగ్టన్ రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించేలా అవకాశం కల్పించాడన్నారు. 2018 జూలై ప్రారంభంలో సింగ్, అతని సహచరులు కెనడా నుండి సియెటల్ ప్రాంతానికి ప్రజలను అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు ఉబెర్‌ను ఉపయోగించారని’ తెలిపారు.
2018 నుండి 2022 మే మధ్యకాలంలో భారతీయ పౌరులను యునైటెడ్ స్టేట్స్‌కు అక్రమంగా పంపేందుకు సింగ్ 600 ఉబెర్ ట్రిప్పులను ఏర్పాటు చేశాడు. ఇలా వారిని యూఎస్‌లోకి అక్రమంగా తరలించిన తర్వాత సింగ్ తన సహచరుల సాయంతో వాషింగ్టన్ రాష్ట్రం వెలుపలి నుంచి వారిని గమ్యస్థానాలకు తరలించేందుకు ప్లాన్ చేసిన మార్గాలకు ఒక్కొక్కటి చొప్పున పలు వాహనాలను అద్దెకు తీసుకున్నాడు. సింగ్, అతని సహచరులు నల్ల ధనాన్ని వైట్‌గా మార్చేందుకు అధునాతన పద్ధతులను ఉపయోగించారని రుజువయ్యింది.
మహమ్మారి తర్వాత వేగవంతం..
వీరి అక్రమ రవాణా వ్యవహారాలు 2018 నుండి కొనసాగుతున్నాయని న్యాయవాద కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మహమ్మారి సమయంలో వీరి అక్రమ కార్యకలాపాలు మందగించాయి. మహమ్మారి పరిమితులు ఎత్తివేసిన తరువాత వారు తిరిగి తమ అక్రమ కార్యకలాపాలను వేగవంతం చేశారు. జూలై 2018- ఏప్రిల్ 2022 మధ్య ఈ స్మగ్లింగ్ రింగ్‌తో లింక్ అయిన 17 ఉబెర్ ఖాతాల ద్వారా $80,000కు పైగా మొత్తాన్ని ఖర్చు చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది.
ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి..
Comments
Please login to add a commentAdd a comment