ప్రముఖ అమెరికన్ మల్టీ నేషనల్ రవాణా సంస్థ ఉబెర్‌పై నెదర్లాండ్స్ కొరడా ఝుళిపించింది. యూరోపియన్ డ్రైవర్ల వ్యక్తిగత డేటాను అమెరికా సర్వర్‌లకు చేరవేయడంపై డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (డీటీఏ) 290 మిలియన్ యూరోలు (సుమారు రూ. 2,718 కోట్లు) భారీ జరిమానా విధించింది.
డ్రైవర్ సమాచారాన్ని రక్షించడంలో ఉబెర్ విఫలమైందని, ఇలా డ్రైవర్ల సమాచారాన్ని చేరవేయడం యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) ప్రకారం "తీవ్రమైన ఉల్లంఘన" అని డీటీఏ పేర్కొంది. "యూఎస్‌కు డేటా బదిలీకి సంబంధించి ఉబెర్ జీడీపీఆర్ నిబంధనలు పాటించలేదు. ఇది చాలా తీవ్రమైనది" అని డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఛైర్మన్ అలీడ్ వోల్ఫ్‌సెన్ ఒక ప్రకటనలో తెలిపారు.
యూరోపియన్ డ్రైవర్లకు సంబంధించిన టాక్సీ లైసెన్స్‌లు, లొకేషన్ డేటా, ఫోటోలు, చెల్లింపు వివరాలు, గుర్తింపు పత్రాలతోపాటు కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల క్రిమినల్, మెడికల్ డేటాను సైతం ఉబెర్ సేకరించిందని డీపీఏ తెలిపింది. సరైన నిబంధనలు పాటించకుండా రెండేళ్ల వ్యవధిలో ఉబెర్ ఈ సమాచారాన్ని తమ యూఎస్ ప్రధాన కార్యాలయానికి చేరవేసిందని ఆరోపించింది. అయితే ఈ జరిమానాపై అప్పీల్ చేస్తామని ఉబెర్ తెలిపింది. "ఇది లోపభూయిష్ట నిర్ణయం. అసాధారణ జరిమానా పూర్తిగా అన్యాయమైనది" అని ఉబెర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment