
దేశం తరపున క్రికెట్ ఆడటం గర్వకారణం
– క్రికెటర్ ప్రేమ్‌కుమార్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి
– వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపు
పత్తికొండ టౌన్: పత్తికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి జి.ప్రేమ్‌కుమార్ అలియాస్ కాశీవిశ్వనాథ్ అంతర్జాతీయ అంధుల టీ–20 వరల్డ్‌కప్‌లో ఇండియా తరపున ఆడటం గర్వకారణమని వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్.రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో యువస్పందన ఆధ్వర్యంలో క్రికెటర్ ప్రేమ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు.
అతిథిగా హాజరైన రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... సామాన్య పేద కుటుంబంలో అంధుడిగా పుట్టిన ప్రేమ్‌కుమార్ ఎన్నో ఇబ్బందులను అధిగమించి, ఇండియా అంధుల క్రికెట్ జట్టుకు ఎంపికకావడం, స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థులు అతడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చిన్నప్పటి నుంచే చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రికెటర్ ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ అంధుల టీ–20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన ఇండియా టీంలో సభ్యుడిగా ఉండటం ఆనందంగా ఉందన్నారు.
పత్తికొండ పాఠశాలలో చదివేటప్పుడు తనను ఉపాధ్యాయులు, మిత్రులు ఎంతగానో ప్రోత్సహించి, ఆదరించారని గుర్తుచేసుకున్నారు. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లిదండ్రులను, మాతృభాషను మరువరాదన్నారు. ఈ సందర్భంగా మాతృభాష గొప్పదనం గురించి పాటపాడి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. అనంతరం యువస్పందన సభ్యులు, ఉపాధ్యాయ సిబ్బంది, పీఈటీలు, పూర్వవిద్యార్థులు, బంధువులు, స్థానికులు ప్రేమకుమార్‌ను పూలమాలలు వేసి సన్మానించారు.
పాఠశాల నుంచి ప్రధాన వీధులగుండా పాతబస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్‌గేమ్స్ మాజీ సెక్రెటరీ జి.పవన్‌కుమార్, ఎంఈఓ కబీర్, ప్రధానోపాధ్యాయుడు జయంతి చంద్రశేఖర్, పీడీ సురేష్‌బాబు, పీఈటీ రాజేష్, ఏపీఎస్పీ ఎస్‌ఐ నారాయణ, యువస్పందన సొసైటీ అధ్యక్షుడు సురేంద్ర, ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.