అది నిర్మల్ జిల్లాకేంద్రంలోని సోఫీనగర్‌లో ఓ చిన్న టీకొట్టు. దాన్ని నడిపేది అబ్దుల్ రషీద్, అబీదాబేగం. ఉదయం నాలుగు గంటలకే పెద్దకొడుకు ఫహీమ్ నిద్రలేచి.. తండ్రి కంటే ముందే ఇంటికి దగ్గరలోనే ఉన్న చాయ్‌హోటల్‌కు వెళ్లి తెరుస్తున్నాడు. రషీద్ వచ్చే సరికి సామగ్రిని సర్దిపెట్టేస్తాడు. చిన్నవాడైన నహీమ్ తండ్రితోపాటు హోటల్‌కు వస్తాడు. రషీద్ పొయ్యి వెలిగించి ఇస్తే.. ఫహీమ్ చాయ్ చేయడం మొదలు పెడతాడు. నహీమ్ గ్లాసులు, పాత్రలు శుభ్రం చేయడం, వచ్చిన వాళ్లకు టీ అందించడం తదితర పనులు చేసి పెడుతున్నాడు. ఇక రహీమ్ ఇంటి బాధ్యతను తీసుకున్నాడు. ఇంట్లోకి కావల్సిన వస్తువులను తానే దగ్గరలోని కిరాణ దుకాణానికి వెళ్లి తీసుకువస్తున్నాడు. ఇంటిపట్టునే ఉంటూ ఇల్లును చూసుకోవడమే తన బాధ్యత అని గర్వంగా చెబుతున్నాడు. ఇందులో ప్రత్యేకత ఏముంది అని పెదవి విరుస్తున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే!
ఎందుకంటే రషీద్‌కన్నా ముందే లేచి చాయ్ దుకాణాన్ని తెరిచే ఫహీమ్‌కి కానీ, వచ్చిన వాళ్లకి టీ అందించే నహీమ్‌కి గానీ, ఇంటి దగ్గరే ఉండి ఇల్లు చూసుకుంటూ, ఇంట్లోకి కావలసిన వెచ్చాలు తెచ్చే రహీమ్‌కిగానీ కళ్లు కనిపించవు. అయినా, వాళ్లు ఏ మాత్రం నిరాశ పడటం లేదు. ‘హమ్ అంధే హై.. మగర్ హమ్ భీ బాబాకే సాథ్ కామ్ కర్తే..’ అని చెబుతూ, తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న వాళ్ల ధీమాను చూసి మెచ్చుకోవాలో, వారి అంధత్వాన్ని చూసి బాధపడాలో అర్థం కావడం లేదని స్థానికులు చెప్పుకుంటుంటారు. పెద్దకొడుకు ఫహీమ్‌కి మూడుపదులుండగా... మిగతా ఇద్దరు పిల్లలకూ పాతికేళ్లుంటాయి. కళ్లు బాగున్న రెండవకొడుకు సలీమ్ మాత్రం వేరుగా ఉంటూ తన కుటుంబాన్ని తను పోషించుకుంటున్నాడు. తర్వాత పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు బీడీలు చుడుతూ వేణ్ణీళ్లకు చన్నీళ్లలా తండ్రి, అన్నలు నడిపే చాయ్ దుకాణ ం నుంచి వచ్చే ఆదాయానికి మరికొంత జత చేస్తూ, నడుము, కాళ్లు చచ్చుబడిపోయి పసిపాపలా పాకుతూనే ఇంటిపనులు చేసుకునే తల్లికి తోడుగా ఉంటున్నారు.
అంధులైన వాళ్లకి ప్రభుత్వం ఇచ్చే పింఛను వారి అవసరాలకు ఏ మూలకూ చాలని పరిస్థితి. అద్దె ఇల్లు తప్ప సొంత ఇల్లు కూడా లేని ఆ కుటుంబం తమను ఆదుకునే దాతలకోసం గంపెడంత ఆశతో దీనంగా ఎదురు చూస్తోంది.
నా కన్ను ఇస్తానన్నా...
పెద్దకొడుకు ఫహీమ్ పుట్టిన ప్పుడే మస్తు దవాఖానాలు తిరిగినా. ఆఖరికి హైదరాబాద్‌లోని ఎల్.వి.ప్రసాద్ హాస్పిటల్‌కు తీసుకుపోయిన. అక్కడ అన్ని టెస్టులు చేసి.. మీ కొడుక్కి కళ్లు రావని చెప్పిండ్రు. సార్.. నాకన్ను ఇస్త.. నాకొడుక్కి పెట్టుండ్రి.. అని బతిమిలాడిన. అప్పుడు నాకు సమజయ్యేటట్లు డాక్టర్లు చెప్పిండ్రు. మాది మేనరికం వివాహం కావడం వల్లే పిల్లలకు చూపు రాలేదన్నరు. ఇగ ఏం చేయలేక ఏడుసుకుంట అచ్చిన. కనిపించకున్నా.. అందాజా (అంచనా) కొద్ది హోటల్ పనిలో తోడుంటున్నారు.
– అబ్దుల్ రషీద్, తండ్రి
కళ్లల్ల నీళ్లు ఇంకిపోతున్నయి...
ముగ్గురు కొడుకులూ కళ్లు లేకుండనే పుట్టారు. వాళ్లు పుట్టినప్పుడల్లా ఏడ్చి..ఏడ్చి.. నా కళ్లల నీళ్లు ఇంకిపోతుండే. ‘ఏంజేస్తం.. నీకట్ల రాసిపెట్టుంది.. వాళ్లనే మంచిగ చూసుకో..’ అని అందరూ చెబుతుండేటోళ్లు. అట్లనన్న చూసుకుందామంటే.. నా కాⶠ్లు పని చేయకుండ అయినై. ఇగ నా బిడ్డలే అన్నలను, ఇల్లు చూసుకుంటున్నరు. కన్నబిడ్డలకు ఏం చేయలేకపోతున్నామన్న బాధ మనసుల పట్టనీయట్లేదు.
– అబీదా బేగం, తల్లి
– రాసం శ్రీధర్ సాక్షి, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment