భారత్‌లోని అనేక నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల్లో ‘నివారించగలిగిన అంధత్వం’ గురించి అవగాహన పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నారు ‘ఇండియా విజన్ ఇన్‌స్టిట్యూట్’ అనే స్వచ్ఛంద సంస్థ సీఈవో వినోద్ డేనియల్. ఇక్కడే చైన్నెలో పుట్టి ఐఐటీ ఢిల్లీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఈయన వృత్తిరీత్యా అంతర్జాతీయంగా ఎన్నో మ్యూజియంలలో పురాతన వారసత్వ సంపదను పరిరక్షించే పనిచేస్తుంటారు.
అయితే భారత్‌లోని ప్రజల్లో చాలామంది కేవలం అవగాహన లేమితో చాలా తేలిగ్గా నివారించదగిన అంధత్వం బారిన పడి నాణ్యమైన జీవితం గడపలేని వారి కళ్లలో వెలుగులు నింపే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటున్న వినోద్ డేనియల్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పిన వివరాలివి...
ఇండియా విజన్ ఇన్‌స్టిట్యూట్‌తో కంటి సేవల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది?
వినోద్: గ్లోబల్ ఎస్టిమేట్స్ ఆఫ్ విజువల్ ఇంపెయిర్‌మెంట్ అధ్యయనాల ప్రకారం ప్రపంచంలోని అంధుల్లో 20.5% మంది భారత్‌లో ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలోనూ 88.2% మంది అంధత్వాన్ని తేలిగ్గా నివారించవచ్చు. మన దేశంలో 13.3 కోట్ల మందికి కేవలం కళ్లజోడు సమకూర్చడం లాంటి చిన్న చిన్న సహాయాలతోనే వారి అంధత్వాన్ని నివారించవచ్చుననీ, అలాగే 1.10 కోట్ల మంది పిల్లలదీ అదే పరిస్థితి అని ‘ఇంటర్‌నేషనల్ సెంటర్ ఫర్ ఐ కేర్ ఎడ్యుకేషన్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ... ఢిల్లీ అప్టోమెట్రీ అండ్ బ్లైండ్‌నెస్ ప్రివెన్షన్ అనే కార్యక్రమంలో వెల్లడించిది. అయితే ఇంత తేలిగ్గా నివారింపదగ్గ అంధత్వాన్ని కూడా వారు దూరం చేసుకోలేకపోతున్నారు.
కళ్లజోడు సమకూర్చడం లాంటి చిన్న కారణాలతో అంధత్వాన్ని నివారించగలిగితే మన ప్రజల్లోని ఉత్పాదకత 34% ఎక్కువవుతుంది. వాళ్ల ఆదారంలో కనీసం 20% పెరుగుదల ఉంటుంది. ఇలా పెద్దల్లోనే కాదు... మన దేశంలోని 8% నుంచి 10% మంది పిల్లలకు కళ్లజోళ్లు అవసరం. ఈశాన్యరాష్ట్రాల్లో అయితే కళ్లజోళ్ల ద్వారా కంటిచూపు మెరుగు చేయగల పిల్లల సంఖ్య దాదాపు 20% వరకు ఉంది. ఇంత చిన్న కారణాలతో వాళ్ల కంటిచూపు మెరుగ్గా లేని కారణంగా పెద్దలు ప్రమాదాలకు గురికావడం, పిల్లల్లో చదువు లేక నేరాల వైపునకు మళ్లడం, తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచుకోలేక, జీవననాణ్యత లోపించిన బతుకులు గడుపుతున్నారు. ఇలాంటి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఇండియా విజన్ ఇన్‌స్టిట్యూట్ ప్రయత్నిస్తోంది.
ఇండియా విజన్ ఇన్‌స్టిట్యూట్ సంస్థæ కార్యకలాపాలేమిటి?
వినోద్: మా సంస్థ రెండు రకాలుగా పనిచేస్తోంది. మొదటిది తేలిగ్గా నివారింపదగిన అంధత్వాన్ని రూపుమాపేందుకు అవసరమైన కళ్లజోళ్లు లాంటి మౌలికమైన వస్తువులు అందిస్తోంది. సాధారణంగా పెద్ద ఎత్తున కొనుగోలు చేసినప్పుడు ఒక కళ్లజోడు ధర కేవలం రూ. 50లకే వచ్చేస్తుంటుంది. ఇక్కడ ప్రశ్న దాని ధర లేదా అదెంత ఖరీదైనది అని కాదు. దాదాపు మన ప్రజల్లో కేవలం కళ్లజోడు లాంటి చిన్న ఉపకరణంతోనే మన బతుకులో గణనీయమైన మార్పువస్తుందనే అవగాహనా తక్కువే. అందుకే ఒకవైపున మా సంస్థ ప్రజల్లో ఈ అవగాహన కల్పిస్తోంది. మరోవైపున కళ్లజోళ్లు అవసరమైన వారికి కావాల్సిన అద్దాల పవర్ ఎంతో తెలుసుకునే ఆప్టోమెట్రీషియన్‌ల సంఖ్య చాలా చాలా తక్కువ.
ఉదాహరణకు మన దేశ అవసరాల కోసం 1,25,000 ఆప్టోమెట్రీషియన్లు కావాలి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఆప్టోమెట్రీషియన్ల సంఖ్య 40,000 మాత్రమే. మా సంస్థ ఒకవైపు ప్రజలకు అవసరమైన మౌలిక కంటి పరీక్షలైన స్క్రీనింగ్ నిర్వహించి కళ్లజోళ్ల వంటివి సరఫరా చేస్తుండటమే కాకుండా... అంతగా నైపుణ్యం లేని అప్టోమెట్రీషియన్ల, ఐ కేర్ రంగంలో ఉన్న వృత్తినిపుణుల (ఐ కేర్ ప్రొఫెషనల్స్) నైపుణ్యాలను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా రెండంచెల్లో మా సంస్థ కృషి చేస్తూ ప్రజల్లో అంధత్వాన్ని నివారించడానికి కృషిచేస్తోంది.
ఈ కార్యక్రమంలో మీకు ఎవరైనా సహాయపడుతున్నారా?
వినోద్: బ్రియాన్ హాల్డెన్ అనే ఆస్ట్రేలియన్ ఇటీవలే చనిపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన బ్రియాన్ హాల్డెన్ విజన్ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థ, హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ సంస్థలతో కలిసి (జాయింటి ఇనిషియేటివ్ ప్రాతిపదికన) మా సంస్థ పనిచేస్తోంది. అంతేగాక... చాలా కార్పొరేట్ సంస్థలు సేవాభావంతో మాకు సహకరిస్తున్నాయ. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సంస్థ ఫౌండర్ చైర్మన్ అయిన డాక్టర్ జీ.ఎన్.రావు మా సంస్థ ట్రస్టీలలో ఒకరు.
మన దేశంలో మీరు అందిస్తున్న సేవల గురించి సంక్షిప్తంగా...
వినోద్: మన దేశంలో ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, గుజరాత్, ఒరిస్సా, అస్సాంలతోపాటు మిజోరాం, మేఘాలయా వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కలుపుకొని దాదాపు 18 రాష్ట్రాల్లోని ప్రజలకు మా సంస్థ సేవలందిస్తోంది. అలాగే ఇక్కడి పలు రాష్ట్రాల్లో ప్రజలకు కళ్లజోడు పవర్ నిర్ధారణ చేయగల నిపుణుల సంఖ్య చాలా తక్కువ. అందుకోసం ఆ నిపుణుల వృత్తి నైపుణ్యాలను పెంచేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక స్కూల్ పిల్లల విషయానికి వస్తే వారు మూడోతరగతిలో ఉన్నప్పుడు ఒకసారి; ఎనిమిది లేదా తొమ్మిదోతరగతిలో ఉన్న సమయంలో ఒకసారి కంటిపరీక్షలు నిర్వహిస్తే... ఆ సమయంలో ఏవైనా కంటిలోపాలు ఉన్నట్లు తెలుసుకుంటే అది చాలా మంచిదనీ, అది వారి మంచి భవిష్యత్తునకు సోపానమవుతుందనే భావన ఉంది.
ప్రతి ఏటా ఈ మేరకు స్క్రీనింగ్స్ జరిగి, అవసరమైన వారికి సహాయం అందేలా మా సంస్థ కృషి చేస్తుంది. అలాగే అనేక రాష్ట్రాల్లోని బీడీ కార్మికులు, బాణాసంచా తయారుచేసే రంగాల్లోని కార్మికులు, (జిప్సీ వంటి) సంచార జాతుల్లోని అణగారిన వర్గాల ప్రజలకు అవసరమైన కళ్లజోళ్లు సరఫరా చేస్తోంది. ఇప్పటివరకూ ఏడాదికి 1,50,000 మందికి మా సంస్థ ద్వారా సహాయం అందుతోంది. మా ద్వారా సహాయమందే వారిలో పెద్దలూ, పిల్లలూ 65 : 35 నిష్పత్తిలో ఉంటున్నారు. ప్రస్తుతానికి 1.50 లక్షలమందికి సహాయం అందుతున్నా... మేం మెరుగుపరచుకుంటున్న కార్యకలాపాల వల్ల ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మేం పనిచేసే ప్రతిచోటా స్థానికంగా అక్కడ పనిచేస్తున్న ఐ–కేర్ ప్రొఫెషనల్స్‌తో కలిసి అక్కడి స్థానికులకు మా సేవలందేలా కార్యకలాపాలు చేపడుతున్నాం.
మీరు చేపడుతున్న వినూత్న కార్యకలాపాల గురించి...
వినోద్: అవును... కొన్ని వినూత్న కార్యకాలాపాలు సైతం నిర్వహిస్తున్నాం. నివారించదగిన అంధత్వాలను రూపుమాపడానికి ప్రజల్లో అవగాహన పెంచేందుకు మా సంస్థ కొన్ని వినూత్న కార్యక్రమల్ని చేపడుతోంది. హైదరాబాద సహా బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై వంటి నగరల్లో ‘‘వాక్ విత్ ద డార్క్’’ పేరిట ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాక్ విత్ ద డార్క్‌లో పూర్తిగా అంధులైన వారు కొంతమంది సెలిబ్రిటీలతో కలిసి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సెలిబ్రిటీల కళ్లకు పట్టీలు కడతారు. అంధులు ఆ సెలిబ్రిటీల చేతి తమ చేతిలోకి తీసుకొని, వారి కార్యకలాపాల కోసం వారికి అన్ని విధాలా సహాయపడతారు.
ఈ కార్యక్రమం ద్వారా అంధత్వం ఎంత దుర్భరంగా ఉంటుందనేది లోకానికి తెలియజెప్పడంతో పాటు, తగినంత చేయూత లభిస్తే అంధులు సైతం మిగతావారిలాగే ఎన్నో కార్యకలాపాలు చేయగలరనే సందేశం వెళ్తోంది. అలాగే నివారింపదగిన అంధత్వాన్ని తేలిగా రూపమాపడం మంచిదన్న సందేశమూ ఇస్తాం. ఇది అన్ని వర్గాల వారికీ చేరువై నివారింపదగిన అంధత్వంపై అవగాహన పెరగడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. గత కొన్ని నెలల కిందట హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులోనూ ఈ తరహా కార్యక్రమాన్ని మేం చేపట్టాం. చాలా చోట్ల చేపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో చాలామంది ప్రజలు తేలిగ్గా నివారించదగ్గ అంధత్వానికి దూరమై, వారి జీవననాణ్యత పెరిగితే ప్రభుత్వాల మీద కూడా చాలా భారాలు తొలగిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment