Corporate bodies
-
బాపట్ల బిడ్డ కృష్ణ చివుకుల.. ఐఐటీ మద్రాసుకు 220 కోట్ల భారీ విరాళ ప్రకటన!
అమెరికా, బెంగళూరుల్లో కార్పొరేట్ సంస్థలు నెలకొల్పి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు తేజం కృష్ణ చివుకుల తన ఉదారతను చాటుకున్నారు. అమెరికాలో స్థిరపడ్డప్పటికీ, మాతృదేశంపై మమకారంతో ఇక్కడి పేద పిల్లలకు విద్యాదానం చేయడంలో ఆది నుంచీ ముందున్నారాయన. తాజాగా తాను ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన ఐఐటీ మద్రాస్‌కు రూ. 228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలిచ్చే దాతలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 6న క్యాంపస్‌లో జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణ చివుకుల ప్రత్యేకంగా అమెరికా నుంచి చెన్నైకి వస్తున్నారు. బాపట్ల నుంచి ప్రస్థానం : ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన డాక్టర్ కృష్ణ చివుకుల మధ్య తరగతి విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు.ఆయన ఐఐటీ బాంబేలో బీటెక్ చదివాక, ఐఐటీ మద్రాస్‌లో 1970 నాటికి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ అందుకున్నారు. తుముకూర్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. యూఎస్‌లోని ప్రముఖ హాఫ్మన్ ఇండస్ట్రీస్‌కి తొలి భారతీయ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈవోగా సేవలందించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 37 ఏళ్లు. ఆ కంపెనీ నుంచి బయటకొచ్చి న్యూయార్క్ కేంద్రంగా ‘శివ టెక్నాలజీస్'ను నెలకొల్పారు.మాస్ స్పెక్ట్రోస్కోపిక్ సాంకేతికతను అందించడంలో ఈ సంస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. ఇదే కంపెనీని బెంగళూరులోనూ ఏర్పాటు చేశారు. 1997లో భారత్‌లో తొలిసారిగా మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ (MIM) సాంకేతికతను పరిచయం చేసింది కృష్ణానే. ఆ తర్వాత ‘ఇండో ఎంఐఎం సంస్థను బెంగళూరులో ప్రారంభించారు. ప్రస్తుతం ‘ఇండో యూఎస్ ఎంఐఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నెలకొల్పిన సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో వీరి టర్నోవర్ రూ.వెయ్యి కోట్లకు పైనే. 2009లో ఆయన తిరుపతి జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను స్థాపించారు.దాతృత్వంలో మేటి..కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఐఐటీ మద్రాస్‌పై కృష్ణ ఎంతో దాతృత్వం చూపిస్తున్నారు. 60 ఏళ్ల నాటి హాస్టళ్లను ఆధునికీకరించడానికి రూ.5.5 కోట్లు వెచ్చించారు. 2014లో ఐఐటీ-ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల సాయాన్ని అందించారు. క్యాంపస్‌లో స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అడ్మిషన్ ప్రోగ్రాం’ పేరుతో విరాళాలు అందిస్తున్నారాయన. కృష్ణ సేవలకు గుర్తింపుగా 2015లో ఐఐటీ మద్రాస్, 2016లో ఐఐటీ బాంబే ప్రతిష్ఠాత్మక అలుమ్నస్ అవార్డు అందజేశాయి.బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సమకూరుస్తున్నారు. బెంగళూరులో బాప్టిస్ట్ ఆసుపత్రిని మెరుగుపరిచి పేద పిల్లల వైద్యానికి సహకారం అందిస్తున్నారు. మైసూర్ సమీపంలోని చామరాజనగర్‌లో కృష్ణ దత్తత తీసుకున్న పాఠశాలలో 380 మంది పేద, అనాథ పిల్లలు చదువుకుంటున్నారు. ఐఐటీ మద్రాస్‌లో పరిశోధన వసతుల పెంపునకు తాజాగా ఆయన ప్రకటించిన భారీ విరాళం ఆ విద్యాసంస్థకు వరంగా మారనుంది. -
నివారింపదగిన అంధత్వంపై అవగాహన అవసరం
భారత్‌లోని అనేక నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల్లో ‘నివారించగలిగిన అంధత్వం’ గురించి అవగాహన పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నారు ‘ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్’ అనే స్వచ్ఛంద సంస్థ సీఈవో వినోద్ డేనియల్. ఇక్కడే చైన్నెలో పుట్టి ఐఐటీ ఢిల్లీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఈయన వృత్తిరీత్యా అంతర్జాతీయంగా ఎన్నో మ్యూజియంలలో పురాతన వారసత్వ సంపదను పరిరక్షించే పనిచేస్తుంటారు. అయితే భారత్‌లోని ప్రజల్లో చాలామంది కేవలం అవగాహన లేమితో చాలా తేలిగ్గా నివారించదగిన అంధత్వం బారిన పడి నాణ్యమైన జీవితం గడపలేని వారి కళ్లలో వెలుగులు నింపే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటున్న వినోద్ డేనియల్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పిన వివరాలివి... ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్తో కంటి సేవల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? వినోద్: గ్లోబల్ ఎస్టిమేట్స్ ఆఫ్ విజువల్ ఇంపెయిర్మెంట్ అధ్యయనాల ప్రకారం ప్రపంచంలోని అంధుల్లో 20.5% మంది భారత్‌లో ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలోనూ 88.2% మంది అంధత్వాన్ని తేలిగ్గా నివారించవచ్చు. మన దేశంలో 13.3 కోట్ల మందికి కేవలం కళ్లజోడు సమకూర్చడం లాంటి చిన్న చిన్న సహాయాలతోనే వారి అంధత్వాన్ని నివారించవచ్చుననీ, అలాగే 1.10 కోట్ల మంది పిల్లలదీ అదే పరిస్థితి అని ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఐ కేర్ ఎడ్యుకేషన్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ... ఢిల్లీ అప్టోమెట్రీ అండ్ బ్లైండ్నెస్ ప్రివెన్షన్ అనే కార్యక్రమంలో వెల్లడించిది. అయితే ఇంత తేలిగ్గా నివారింపదగ్గ అంధత్వాన్ని కూడా వారు దూరం చేసుకోలేకపోతున్నారు. కళ్లజోడు సమకూర్చడం లాంటి చిన్న కారణాలతో అంధత్వాన్ని నివారించగలిగితే మన ప్రజల్లోని ఉత్పాదకత 34% ఎక్కువవుతుంది. వాళ్ల ఆదారంలో కనీసం 20% పెరుగుదల ఉంటుంది. ఇలా పెద్దల్లోనే కాదు... మన దేశంలోని 8% నుంచి 10% మంది పిల్లలకు కళ్లజోళ్లు అవసరం. ఈశాన్యరాష్ట్రాల్లో అయితే కళ్లజోళ్ల ద్వారా కంటిచూపు మెరుగు చేయగల పిల్లల సంఖ్య దాదాపు 20% వరకు ఉంది. ఇంత చిన్న కారణాలతో వాళ్ల కంటిచూపు మెరుగ్గా లేని కారణంగా పెద్దలు ప్రమాదాలకు గురికావడం, పిల్లల్లో చదువు లేక నేరాల వైపునకు మళ్లడం, తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచుకోలేక, జీవననాణ్యత లోపించిన బతుకులు గడుపుతున్నారు. ఇలాంటి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్ ప్రయత్నిస్తోంది. ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్ సంస్థæ కార్యకలాపాలేమిటి? వినోద్: మా సంస్థ రెండు రకాలుగా పనిచేస్తోంది. మొదటిది తేలిగ్గా నివారింపదగిన అంధత్వాన్ని రూపుమాపేందుకు అవసరమైన కళ్లజోళ్లు లాంటి మౌలికమైన వస్తువులు అందిస్తోంది. సాధారణంగా పెద్ద ఎత్తున కొనుగోలు చేసినప్పుడు ఒక కళ్లజోడు ధర కేవలం రూ. 50లకే వచ్చేస్తుంటుంది. ఇక్కడ ప్రశ్న దాని ధర లేదా అదెంత ఖరీదైనది అని కాదు. దాదాపు మన ప్రజల్లో కేవలం కళ్లజోడు లాంటి చిన్న ఉపకరణంతోనే మన బతుకులో గణనీయమైన మార్పువస్తుందనే అవగాహనా తక్కువే. అందుకే ఒకవైపున మా సంస్థ ప్రజల్లో ఈ అవగాహన కల్పిస్తోంది. మరోవైపున కళ్లజోళ్లు అవసరమైన వారికి కావాల్సిన అద్దాల పవర్ ఎంతో తెలుసుకునే ఆప్టోమెట్రీషియన్ల సంఖ్య చాలా చాలా తక్కువ. ఉదాహరణకు మన దేశ అవసరాల కోసం 1,25,000 ఆప్టోమెట్రీషియన్లు కావాలి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఆప్టోమెట్రీషియన్ల సంఖ్య 40,000 మాత్రమే. మా సంస్థ ఒకవైపు ప్రజలకు అవసరమైన మౌలిక కంటి పరీక్షలైన స్క్రీనింగ్ నిర్వహించి కళ్లజోళ్ల వంటివి సరఫరా చేస్తుండటమే కాకుండా... అంతగా నైపుణ్యం లేని అప్టోమెట్రీషియన్ల, ఐ కేర్ రంగంలో ఉన్న వృత్తినిపుణుల (ఐ కేర్ ప్రొఫెషనల్స్) నైపుణ్యాలను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా రెండంచెల్లో మా సంస్థ కృషి చేస్తూ ప్రజల్లో అంధత్వాన్ని నివారించడానికి కృషిచేస్తోంది. ఈ కార్యక్రమంలో మీకు ఎవరైనా సహాయపడుతున్నారా? వినోద్: బ్రియాన్ హాల్డెన్ అనే ఆస్ట్రేలియన్ ఇటీవలే చనిపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన బ్రియాన్ హాల్డెన్ విజన్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ, హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ సంస్థలతో కలిసి (జాయింటి ఇనిషియేటివ్ ప్రాతిపదికన) మా సంస్థ పనిచేస్తోంది. అంతేగాక... చాలా కార్పొరేట్ సంస్థలు సేవాభావంతో మాకు సహకరిస్తున్నాయ. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంస్థ ఫౌండర్ చైర్మన్ అయిన డాక్టర్ జీ.ఎన్.రావు మా సంస్థ ట్రస్టీలలో ఒకరు. మన దేశంలో మీరు అందిస్తున్న సేవల గురించి సంక్షిప్తంగా... వినోద్: మన దేశంలో ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, గుజరాత్, ఒరిస్సా, అస్సాంలతోపాటు మిజోరాం, మేఘాలయా వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కలుపుకొని దాదాపు 18 రాష్ట్రాల్లోని ప్రజలకు మా సంస్థ సేవలందిస్తోంది. అలాగే ఇక్కడి పలు రాష్ట్రాల్లో ప్రజలకు కళ్లజోడు పవర్ నిర్ధారణ చేయగల నిపుణుల సంఖ్య చాలా తక్కువ. అందుకోసం ఆ నిపుణుల వృత్తి నైపుణ్యాలను పెంచేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక స్కూల్ పిల్లల విషయానికి వస్తే వారు మూడోతరగతిలో ఉన్నప్పుడు ఒకసారి; ఎనిమిది లేదా తొమ్మిదోతరగతిలో ఉన్న సమయంలో ఒకసారి కంటిపరీక్షలు నిర్వహిస్తే... ఆ సమయంలో ఏవైనా కంటిలోపాలు ఉన్నట్లు తెలుసుకుంటే అది చాలా మంచిదనీ, అది వారి మంచి భవిష్యత్తునకు సోపానమవుతుందనే భావన ఉంది. ప్రతి ఏటా ఈ మేరకు స్క్రీనింగ్స్ జరిగి, అవసరమైన వారికి సహాయం అందేలా మా సంస్థ కృషి చేస్తుంది. అలాగే అనేక రాష్ట్రాల్లోని బీడీ కార్మికులు, బాణాసంచా తయారుచేసే రంగాల్లోని కార్మికులు, (జిప్సీ వంటి) సంచార జాతుల్లోని అణగారిన వర్గాల ప్రజలకు అవసరమైన కళ్లజోళ్లు సరఫరా చేస్తోంది. ఇప్పటివరకూ ఏడాదికి 1,50,000 మందికి మా సంస్థ ద్వారా సహాయం అందుతోంది. మా ద్వారా సహాయమందే వారిలో పెద్దలూ, పిల్లలూ 65 : 35 నిష్పత్తిలో ఉంటున్నారు. ప్రస్తుతానికి 1.50 లక్షలమందికి సహాయం అందుతున్నా... మేం మెరుగుపరచుకుంటున్న కార్యకలాపాల వల్ల ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మేం పనిచేసే ప్రతిచోటా స్థానికంగా అక్కడ పనిచేస్తున్న ఐ–కేర్ ప్రొఫెషనల్స్‌తో కలిసి అక్కడి స్థానికులకు మా సేవలందేలా కార్యకలాపాలు చేపడుతున్నాం. మీరు చేపడుతున్న వినూత్న కార్యకలాపాల గురించి... వినోద్: అవును... కొన్ని వినూత్న కార్యకాలాపాలు సైతం నిర్వహిస్తున్నాం. నివారించదగిన అంధత్వాలను రూపుమాపడానికి ప్రజల్లో అవగాహన పెంచేందుకు మా సంస్థ కొన్ని వినూత్న కార్యక్రమల్ని చేపడుతోంది. హైదరాబాద సహా బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై వంటి నగరల్లో ‘‘వాక్ విత్ ద డార్క్’’ పేరిట ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాక్ విత్ ద డార్క్‌లో పూర్తిగా అంధులైన వారు కొంతమంది సెలిబ్రిటీలతో కలిసి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సెలిబ్రిటీల కళ్లకు పట్టీలు కడతారు. అంధులు ఆ సెలిబ్రిటీల చేతి తమ చేతిలోకి తీసుకొని, వారి కార్యకలాపాల కోసం వారికి అన్ని విధాలా సహాయపడతారు. ఈ కార్యక్రమం ద్వారా అంధత్వం ఎంత దుర్భరంగా ఉంటుందనేది లోకానికి తెలియజెప్పడంతో పాటు, తగినంత చేయూత లభిస్తే అంధులు సైతం మిగతావారిలాగే ఎన్నో కార్యకలాపాలు చేయగలరనే సందేశం వెళ్తోంది. అలాగే నివారింపదగిన అంధత్వాన్ని తేలిగా రూపమాపడం మంచిదన్న సందేశమూ ఇస్తాం. ఇది అన్ని వర్గాల వారికీ చేరువై నివారింపదగిన అంధత్వంపై అవగాహన పెరగడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. గత కొన్ని నెలల కిందట హైదరాబాద్‌లోని నెక్లెస్రోడ్డులోనూ ఈ తరహా కార్యక్రమాన్ని మేం చేపట్టాం. చాలా చోట్ల చేపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో చాలామంది ప్రజలు తేలిగ్గా నివారించదగ్గ అంధత్వానికి దూరమై, వారి జీవననాణ్యత పెరిగితే ప్రభుత్వాల మీద కూడా చాలా భారాలు తొలగిపోతాయి. -
డెల్టా గుండెల్లో గునపం!
70వేల గ్యాస్ బావులు తవ్వేందుకు కార్పొరేట్ సంస్థల పథకం - ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ విధానంలో కేజీ బేసిన్లో గ్యాస్, చమురు వెలికితీత - పశ్చిమగోదావరి, కృష్ణాలో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం ఏడు లక్షల ఎకరాలు సాగుకు దూరం - ఇంకా లక్షలాది ఎకరాలపై తీవ్ర ప్రభావం వాయు, జల, భూకాలుష్యం తీవ్రమయ్యే ప్రమాదం - జనజీవనంపై విషమ ప్రభావం అంటున్న పరిశోధనలు అమెరికా, పలు దేశాల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై నిషేధం - ఇక్కడ అదే ముద్దంటోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు చేపట్టే గ్రామాలకు కనీస సమాచారం లేదు - భీమవరంలో రేపు ప్రజాభిప్రాయ సేకరణ (ఆలమూరు రామ్‌గోపాల్‌రెడ్డి) దేశానికి ధాన్యాగారంగా భాసిల్లుతోన్న గోదావరి, కృష్ణా డెల్టాల్లో వరి సాగు కనుమరుగు కానుందా..? నలుగురికి అన్నం పెట్టిన రైతన్న ఇక ఉపాధి వెతుక్కుంటూ వలసపోవాల్సిన దుస్థితి దాపురించనున్నదా? అన్నపూర్ణగా విరాజిల్లుతోన్న డెల్టాల్లో పట్టెడన్నం కోసం ప్రజలు అలమటించాల్సిన పరిస్థితులు పొంచి ఉన్నాయా..? పచ్చని పైర్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో కనిపించే డెల్టాలు ఇక జన జీవనానికి పనికి రాకుండా పోతాయా..? అనే ప్రశ్నలకు అవుననే అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. గ్యాస్, చమురు ఉత్పత్తిలో కార్పొరేట్ సంస్థలకు సహజవనరులను దోచిపెడుతోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మరో అడుగు ముందుకేసి సాంప్రదాయేతర ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ పద్ధతిలో షేల్ గ్యాస్, చమురును వెలికితీయడానికి ఆమోదముద్ర వేశాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీ(ఆరుుల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్)ని ముందుపెట్టి పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి మండలం కాళ్ల, భీమవరం మండలం వీరవాసరం, కృష్ణా జిల్లాలో మండవల్లిలో తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాళ్ల, వీరవాసరం, మండవల్లి ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. ప్రాజెక్టు చేపట్టే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చట్టాలు చెబుతున్నా ఆ గ్రామాలను వదిలేసి భీమవరంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నారు. మూడు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా 17 బావుల ద్వారా హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్కి ఓఎన్జీసీ తెరతీసింది. ఆ తర్వాత కృష్ణా, గోదావరి డెల్టాల్లో 70 వేల బావులను తవ్వి ద్వారా గ్యాస్, చమురు ఉత్పత్తి చేయడానికి కేంద్రం టెండర్లు పిలవనుంది. భూమిని, నీటిని అధికంగా వినియోగించుకునే ఈ విధానం వల్ల ఎన్నో ఉపద్రవాలు పొంచి ఉన్నారుు. అనేక దేశాలు ఈ విధానానికి గుడ్‌బై చెప్పాయి. ఎక్కడా వద్దన్నది ఇక్కడ ముద్దు.. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో తవ్వకాల వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చాలాకాలం కిందటే గుర్తించారు. అందుకే ఈ విధానంపై అనేక దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఫ్రాన్స, బల్గేరియా, రుమేనియా, జర్మనీ, స్కాట్లాండ్ వంటి దేశాల్లో ఇప్పటికే ఆ విధానాన్ని నిషేధించారు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై నిషేధం అంశాన్ని ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ఇరు పక్షాలు ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. అమెరికాలోని న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ను నిషేధించారు. కానీ.. మన దేశంలో మాత్రం ఆ విధానాన్ని అమలుచేయడానికి శ్రీకారం చుట్టడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఉపద్రవాలు.. భయానక వాస్తవాలు.. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్ల కృష్ణా, గోదావరి డెల్టాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ► ఒక్కో బావికి కనీసం పది ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ లెక్కన. 70 వేల బావులకు ఏడు లక్షల ఎకరాల భూమి అవసరం అవుతుంది. బావులకు సమాంతరంగా భూగర్భంలో సొరంగాలు తవ్వడం వల్ల లక్షలాది ఎకరాల భూమిపై పరోక్షంగా ప్రభావం చూపుతుంది. దీని వల్ల పచ్చని పంట పొలాలు మాయం కావడం ఖాయం. దేశానికి అన్నపూర్ణగా భాసిల్లుతోన్న డెల్టాల్లో పట్టెడన్నం కోసం అలమటించాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ► హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్తోభూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కో బావికి సగటున ఆరు కోట్ల లీటర్ల నీళ్లు అవసరం అవుతారుు. 70 వేల బావులకు అవసరమైన నీటిని పరిగణనలోకి తీసుకుంటే.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో భూగర్భం ఒట్టిపోవడం ఖాయం. ► అమెరికాకు చెందిన పర్యావరణ పరిరక్షణ సంస్థ(ఈపీఏ), నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అంచనాల ప్రకారం గ్యాస్, చమురు ఉత్పత్తి సమయంలో మిథేన్ లీకవుతూనే ఉంటుంది. సెకనుకు 0.6 గ్రాముల కార్బన్ లీకవుతుంది. దీని భూతాపాన్ని తీవ్రం చేస్తుంది. ఇది పంటల దిగుబడిని 80 శాతం మేర తగ్గించి వేస్తుంది. ► భూగర్భంలో అత్యధిక పీడనంతో అవశేష శిలలను ఛిద్రం చేయడం, భూగర్భ జలాలను లాగేయడం వల్ల భూకంపాలు వస్తాయని ఈపీఏ తేల్చింది. అమెరికాలోని టెక్సాస్‌లో రిక్టర్ స్కేలుపై 5.1, ఓక్లహోమాలో 3.0 తీవ్రత కలిగిన భూకంపాలు నమోదయ్యారుు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్ల అమెరికాలో 2013లో 109, 2014లో 585, 2015లో 907, 2016లో 611(అక్టోబరు వరకూ) భూకంపాలు నమోదవడం గమనార్హం. ► హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ పద్ధతిలో గ్యాస్, చమురును వెలికితీయడం వల్ల వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూకాలుష్యం పెరిగిపోతుంది. అత్యంత ప్రమాదకరమైన అణుధార్మిక లక్షణాలున్న రాడాన్ వాయువు వెలువడుతుంది. గర్భస్థ శిశువులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్వాసకోస వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతారుు. ► అమెరికాలో 2012లో బంబెర్గర్, ఆస్వాల్డ్‌లు నిర్వహించిన పరిశోధనల్లో ఒళ్లుగగుర్పొడిచే వాస్తవాలు వెలుగు చూశారుు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ చేసిన బావులకు కిలోమీటరు వ్యాసార్థంలో ఆవులు, దూడలు మరణించినట్లు తేలింది. గర్భస్రావాలు అధికమైనట్లు వెల్లడైంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగినట్లు తేలింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ చేసిన పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నిర్వహించిన రక్తపరీక్షల్లో అత్యంత ప్రమాదకరమైన ఆర్శనిక్, బెంజీన్ అవశేషం ఫినాల్లో ఉన్నట్లు వెల్లడైంది. ఇది జనజీవనాన్ని ఛిద్రం చేసింది. అమెరికాలో ఉద్యమాలు రావడంతో టెక్సాస్, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని నిషేధించారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే.. కేజీ బేసిన్లో ఇప్పటికే డీ-6 గ్యాస్ క్షేత్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్న రిలయన్స సంస్థ అక్రమంగా గ్యాస్‌ను తరలించి రూ.12,136 కోట్ల మేర కొల్లగొట్టినట్లు జస్టిస్ ఏపీ షా కమిషన్ తేల్చింది. ఆ మేరకు రిలయన్స నుంచి ఆ నిధులను వసూలు చేయాలని షా కమిషన్ చేసిన సూచనను కేంద్రం బుట్టదాఖలు చేసింది. అమెరికాలో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ పద్ధతిలో గ్యాస్, చమురు ఉత్పత్తిలో ప్రధాన వాటా రిలయన్సదే. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నిషేధం విధించడం.. రానున్న రోజుల్లో పూర్తి స్థారుులో నిషేధం విధించనున్న నేపథ్యంలో రిలయన్‌సకు భారీ దెబ్బ తగలనుంది. దాన్ని పూడ్చుకునేందుకే కేజీ బేసిన్‌పై కన్నేసిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇదేం ప్రజాభిప్రాయ సేకరణ..? ప్రాజెక్టులు చేపట్టే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించాలని భూసేకరణ చట్టం-2013 స్పష్టీకరిస్తోంది. ఎన్జీటీ తీర్పులు ఇదే అంశాన్ని తేల్చిచెబుతున్నారుు. కానీ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆ చట్టాలను బుట్టదాఖలు చేస్తున్నారుు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల, వీరవాసరం, కృష్ణా జిల్లా మండవల్లిల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై మంగళవారం భీమవరంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నియంత్రణ మండలి ఓ ప్రకటన జారీ చేసింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించి.. దీనిపై అభిప్రాయ సేకరణ చేయాల్సిన ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరిస్తోండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల జీవితాలతో చెలగాటమా? హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో గ్యాస్, చము రు తవ్వకాలు జరపడమంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడటమే. దేశానికి అన్నం పెడుతోన్న కృష్ణా, గోదావరి డెల్టాలు నాశనమౌతారుు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో భూగర్భజలాలను తోడేస్తే సముద్రం నుంచి ఉప్పునీళ్లు ఎగదన్నడం ఖాయం. ప్రపంచంలో జర్మనీ, స్కాట్లాండ్, రుమేనియా, బల్గేరియా, ఫ్రాన్స వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానాన్ని నిషేధించారు. - కలపాల బాబూరావు, పర్యావరణవేత్త విధ్వంసం చేయడం అభివృద్ధా? జన జీవనాన్ని విధ్వంసం చేయడం అభివృద్ధా? మానవ జీవనాన్ని ప్రశ్నార్థకం చేసే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అవసరమా? కార్పొరేట్ శక్తులకు సహజ వనరులను దోచిపెట్టేందుకే ఈ విధానం అమలుకు పూనుకోవడం అన్యాయం. - రామకృష్ణంరాజు, కో-ఆర్డినేటర్, నేషనల్ అలయన్సఆఫ్పీపుల్స్ మూవ్మెంట్స్(ఎన్ఏపీఎం) కేజీ బేసిన్లో భారీ గ్యాస్, చమురు నిల్వలు.. భారతదేశంలో పశ్చిమ, తూర్పు, అండమాన్ సముద్ర తీరాల్లో కలిపి 1,894 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు ఉన్నట్లు ఓఎన్జీసీ గుర్తించింది. దేశంలో గ్యాస్హెడ్రేట్ సామర్థ్యాలను అన్వేషించటానికి, ప్రయోగాత్మకంగా ఉత్పత్తి పరీక్షల కోసం 2014లో అమెరికాకు చెందిన యూఎన్‌జీఎస్, జపాన్‌కు చెందిన జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఓఎన్జీసీ, యూఎన్‌జీఎస్, జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో గోదావరి-కృష్ణా బేసిన్లో 982, డీ-3, డీ-6, డీ-9 బ్లాకుల్లో 4320 చదరపు మైళ్ల విస్తీర్ణంలో అత్యంత సాంద్రత గల ఇసుక రిజర్వాయర్లలో 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్, ఆరుుల్ నిక్షిప్తమైనట్లు తేలింది. దీని విలువ రూ.33 లక్షల కోట్లుగా ఓఎన్జీసీ అంచనా వేసింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అంటే.. భూ ఉపరితలానికి సుమారు నాలుగు వేల మీటర్ల లోతులో కఠినమైన అవశేష శిలావరణం కింద ఏర్పడిన ఇసుక రిజర్వాయర్లలో షేల్, గ్యాస్ హైడ్రేట్ల రూపంలో ఉండే గ్యాస్, చమురును బోరు బావులు తవ్వడం వంటి సాంప్రదాయ పద్ధతుల్లో వెలికితీయడం సాధ్యం కాదు.. ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ విధానంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ విధానంలో ఏం చేస్తారంటే.. కఠినమైన అవశేష శిలలు ఉండే వరకూ అంటే కనీసం నాలుగు వేల మీటర్ల లోతుకు భారీ బోరు బావి తవ్వుతారు. అవశేష శిల పొరకు సమాంతరంగా సొరంగం తవ్వుతారు. ఆ సొరంగంలో రంధ్రాలున్న గొట్టాలను అమర్చుతారు. ఈ గొట్టాల ద్వారా నీళ్లు, ఇసుక, 700 రకాల రసాయనాల మిశ్రమాన్ని 550 అట్మాస్పియర్లకుపైగా పీడనంతో పంపి.. అవశేష శిల పొరను ధ్వంసం చేస్తారు. తద్వారా శిల పొరల్లో ఏర్పడే చీలికల నుంచి గ్యాస్, చమురును వెలికితీస్తారు. -
కార్పొరేట్ తొత్తులుగా సర్కార్లు
ధ్వజమెత్తిన వామపక్షాలు - ‘బషీర్‌బాగ్’ విద్యుత్ అమరులకు నివాళులు సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాల అణచివేతకు పూనుకుంటున్నాయని పలువురు వామపక్ష నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని స్తూపం వద్ద విద్యుత్ అమరవీరులకు 10 వామపక్ష పార్టీల నేతలు నివాళులర్పించారు. విద్యుత్ ఉద్యమంలో విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ అసువులుబాసి 15 సంవత్సరాలు పూర్తై సందర్భంగా వామపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా స్తూపం వద్దకు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. విద్యుత్ అమరవీరుల పోరాటస్ఫూర్తిని కొనసాగిస్తామంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ‘ప్రజా ఉద్యమాలు- ప్రభుత్వాల అణచివేత’ అంశంపై నిర్వహించిన సదస్సులో సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు ప్రయోజనాల కోసం 2000 ఆగస్టులో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందని, అందుకు నిరసనగా వామపక్ష పార్టీలు చేసిన ఉద్యమంపై బాబు దమనకాండ కు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఉద్యమకారులను గుర్రాలతో తొక్కించి, తుపాకులతో కాల్చి హత్యలకు కూడా పూనుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు కూడా దేశాన్ని, రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులు తమ చేతుల్లోకి తీసుకునే విధంగా ఉన్నాయని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులు, వరల్డ్ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయని, నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లిందని విమర్శించారు. దేశంలో అమలవుతున్న ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ మోదీ తిరంగా యాత్ర పేరుతో దేశాన్ని తిరోగమనం పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేయాలని చూస్తే, చివరికి ఆ ఉద్యమాలే ప్రభుత్వాలకు ఉరితాళ్లు అవుతాయని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే విద్యుత్‌చార్జీలు పెంచి ప్రజలపై రూ.1600 కోట్లు భారం మోపిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే చార్జీలను అధికంగా పెంచి చంద్రబాబుకు తానేమీ తీసిపోనట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తీవ్రమైన నిర్బంధం: సీపీఎం విద్యుత్‌చార్జీల పెంపునకు నిరసనగా చేస్తున్న ఉద్యమంలో నాడు చంద్రబాబు ప్రభుత్వం ముగ్గురిని పొట్టనబెట్టుకున్నదని, అప్పటి ఉద్యమంలో కలసి వచ్చిన కేసీఆర్ నేడు అవే కార్పొరేట్‌శక్తులకు వంత పాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తెలంగాణలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్బంధం అమలవుతోందని, దీనికి మల్లన్నసాగర్ ఉదాహరణ అని, 144 సెక్షన్‌ను విధించి గ్రామాల చుట్టూ ముళ్లకంచెలను వేసి ప్రజలకు ఇబ్బం దులు కలగ చేశారని అన్నారు. అమరులకు నివాళులర్పించినవారిలో సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ నాయకులు రమ, గోవర్ధన్ , విజయ్‌కుమార్, ఎంసీపీఐ నేత తాండ్ర కుమార్, ఎస్‌యూసీఐ (మురారి), జానకిరాములు (ఆర్ఎస్పీ), సంధ్య(పీవోడబ్ల్యూ), సీపీఐ (ఎంఎల్) నాయకుడు భూతం వీరన్న తదితరులున్నారు. -
నైపుణ్యాలున్న ఇంజనీర్లు 20% కన్నా తక్కువే
న్యూఢిల్లీ: ఏటా దాదాపు ఆరు లక్షల మంది పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులవుతున్నప్పటికీ.. వీరిలో ఉద్యోగ నైపుణ్యాలున్న వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువగానే ఉంటోంది. కేవలం 18.43 శాతం మంది ఇంజినీర్లే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉంటున్నారు. ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది దేశవ్యాప్తంగా ఉత్తీర్ణులైన ఇంజినీర్లలో 520 కాలేజీలకు చెందిన 1.20 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 91.82 శాతం మందికి ప్రోగ్రామింగ్.. అల్గోరిథమ్ నైపుణ్యాలు లేవు. 71.23 శాతం మందికి సాఫ్ట్ స్కిల్స్, 60 శాతం మందికి డొమైన్ నైపుణ్యాలు, 73.63 శాతం మందికి ఇంగ్లీషులో మాట్లాడే నైపుణ్యాలు, 57.96 శాతం మందికి విశ్లేషణ సామర్థ్యాలు కొరవడ్డాయి. ఓవైపు విద్యాప్రమాణాలు అంతంత మాత్రంగా ఉండటం మరోవైపు నైపుణ్యాలకు పరిశ్రమలో డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతుండటం వల్ల ఓ మోస్తరు స్కిల్స్ ఉన్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లభించడం కష్టమైపోతోందని సర్వే పేర్కొంది. పేరున్న కాలేజీలకే కార్పొరేట్ల మొగ్గు.. కంపెనీలు మరీ ఎక్కువ శిక్షణ అవసరం లేకుండా ప్రాథమిక నైపుణ్యాలు ఉన్న వారినే ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటాయని, ఫలితంగా నైపుణ్యాలు లేని వారు ఉద్యోగాల రేసులో వెనుకబడి పోతుంటారని ఆస్పైరింగ్ మైండ్స్ సీఈవో హిమాంశు అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు.. అనుసరిస్తున్న నియామకాల విధానంలోనూ కొన్ని లోపాలను సర్వే ఎత్తి చూపింది. కార్పొరేట్ సంస్థలు ఎక్కువగా పేరొందిన కాలేజీలకే వెళ్లి రిక్రూట్ చేసుకుంటూ ఉండటం వల్ల.. అంతగా పేరులేని కాలేజీల్లో చదివిన వారిలో దాదాపు 70 శాతం మందికి నైపుణ్యాలున్నా ఉద్యోగావకాశాలు దక్కించుకోలేని పరిస్థితి ఉందని సర్వే అధ్యయనంలో వెల్లడైనట్లు వివరించింది.