నైపుణ్యాలున్న ఇంజనీర్లు 20% కన్నా తక్కువే
న్యూఢిల్లీ: ఏటా దాదాపు ఆరు లక్షల మంది పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులవుతున్నప్పటికీ.. వీరిలో ఉద్యోగ నైపుణ్యాలున్న వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువగానే ఉంటోంది. కేవలం 18.43 శాతం మంది ఇంజినీర్లే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో చేరడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉంటున్నారు. ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది దేశవ్యాప్తంగా ఉత్తీర్ణులైన ఇంజినీర్లలో 520 కాలేజీలకు చెందిన 1.20 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
వీరిలో 91.82 శాతం మందికి ప్రోగ్రామింగ్.. అల్గోరిథమ్ నైపుణ్యాలు లేవు. 71.23 శాతం మందికి సాఫ్ట్ స్కిల్స్, 60 శాతం మందికి డొమైన్ నైపుణ్యాలు, 73.63 శాతం మందికి ఇంగ్లీషులో మాట్లాడే నైపుణ్యాలు, 57.96 శాతం మందికి విశ్లేషణ సామర్థ్యాలు కొరవడ్డాయి. ఓవైపు విద్యాప్రమాణాలు అంతంత మాత్రంగా ఉండటం మరోవైపు నైపుణ్యాలకు పరిశ్రమలో డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతుండటం వల్ల ఓ మోస్తరు స్కిల్స్ ఉన్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లభించడం కష్టమైపోతోందని సర్వే పేర్కొంది.
పేరున్న కాలేజీలకే కార్పొరేట్ల మొగ్గు..
కంపెనీలు మరీ ఎక్కువ శిక్షణ అవసరం లేకుండా ప్రాథమిక నైపుణ్యాలు ఉన్న వారినే ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటాయని, ఫలితంగా నైపుణ్యాలు లేని వారు ఉద్యోగాల రేసులో వెనుకబడి పోతుంటారని ఆస్పైరింగ్ మైండ్స్ సీఈవో హిమాంశు అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు.. అనుసరిస్తున్న నియామకాల విధానంలోనూ కొన్ని లోపాలను సర్వే ఎత్తి చూపింది. కార్పొరేట్ సంస్థలు ఎక్కువగా పేరొందిన కాలేజీలకే వెళ్లి రిక్రూట్ చేసుకుంటూ ఉండటం వల్ల.. అంతగా పేరులేని కాలేజీల్లో చదివిన వారిలో దాదాపు 70 శాతం మందికి నైపుణ్యాలున్నా ఉద్యోగావకాశాలు దక్కించుకోలేని పరిస్థితి ఉందని సర్వే అధ్యయనంలో వెల్లడైనట్లు వివరించింది.