భార్య షబానా, కుమారుడు అహిల్‌తో..
ప్రతిభకు అంధత్వం అడ్డుకాదని నిరూపించారు ఐరాలకు చెందిన షాకీర్ అహ్మద్. పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించారు. అందరి చేత శెభాష్ అనిపించుకుంటూ షాకీర్ ది గ్రేట్ అని మన్ననలందుకుంటున్నారు.
చిత్తూరు, రొంపిచెర్ల : ఐరాలకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్, రహిమాబేగంలకు నలుగురు కుమారులు. వీరి నాలుగో సంతానం షాకీర్ అహ్మ ద్ పుట్టుకతోనే అంధుడు. కంటిచూపు కోసం కంటిచూపు కోసం ఎంతోమంది నేత్ర వైద్యులను కలసినా ఫలితం లేకపోయింది. అంధత్వం అనే లోపం ఉందని విచారిస్తూ కూర్చోక స్వయంకృషి, ఆత్మస్థైర్యంతో రికార్డులు సృష్టిస్తూ, అవార్డులను సొంతం చేసుకుంటున్నారు షాకీర్. తన కంటికి దక్కని వెలుగును ప్రస్తుతం ఇతరుల జీవితాల్లోనూ నింపుతున్నారు.
విద్యాభ్యాసం..
షాకీర్ ఐదో తరగతి వరకు చెన్నై లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్‌లో, ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు నెల్లూరులోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లిషు మీడియం హైస్కూల్ (అంధేతరుల పాఠశాల)లో చదువుకున్నారు. అలాగే ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ తిరుపతిలోని ఎస్వీ ఆర్డ్స్ కాలేజి, ఎస్వీ యూనివర్సిటీలో చదువుకుని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు.
ఉద్యోగ ప్రస్థానం..
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎంబీఏ చదివిన మొట్టమొదటి అంధత్వ విద్యార్థిగా షాకీర్ నిలిచారు. కొద్దిరోజులు నెల్లూరులోని ఏవీఎస్ కాలేజి, విజయవాడలోని నిమ్రా కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సమాజంలో తన స్వశక్తితో నిలబడాలనే ఉద్దేశంతో హైదరాబాదులో ఎంపవర్ ట్రైనింగ్ సొల్యూషన్స్ అనే సంస్థను స్థాపించారు. దేశమంతటా పర్యటిస్తూ మేనేజ్‌మెంట్ ట్రైనర్‌గా శిక్షణ ఇస్తూ సక్సెస్ కోచ్‌గా గుర్తింపు పొందారు. అంతర్జాతీయ సంస్థలైన మిట్సుబుషి, ఎసెండాస్, బజాజ్ అలయెంజ్, మెట్ లైఫ్ ఇస్సూరెన్స్ లాంటి సంస్థల్లోని ఉద్యోగులకు గోల్ సెట్టింగ్, టైం మేనేజ్‌మెంట్, లీడర్ షిప్, టీం బిల్డింగ్ మొదలైన అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. జ్ఞాపకశక్తిని ఎలా పెంపొందించుకోవాలో తెలియజెప్పడంలోను, విద్యార్థులు, ఉద్యోగులు తమ ఆశయాలను ఎలా నేరవేర్చుకోవాలో వివరిస్తూ ఉత్తేజభరితమైన ప్రసంగాలు ఇవ్వడంలోనూ షాకీర్ సిద్ధహస్తుడు.
కుటుంబం..
షాకీర్ అహ్మద్ రొంపిచెర్లకు చెందిన హజీరా కుమారై షబానాను నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు అహిల్(2) ఉన్నాడు. అతని తల్లిదండ్రులు తిరుపతిలో ఉండగా, వీరు ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.
సాధించిన అవార్డులు
♦ 2001 జనవరిలో ఖురాన్ గ్రంథాన్ని బ్రెయిలీ లిపిలో రాయడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.
♦ 2007 ఫిబ్రవరి 1న లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు.
♦ 2008లో జూన్ 27న ఆంధ్రామేధావి అవార్డును తెనాలి విజ్ణానవేదిక వారు అందజేశారు.
♦ 2011 సెప్టెంబరు 30న లతారాజా ఫౌండేషన్ నుంచి గార్డియన్ ఆఫ్ గుడ్‌విల్ అవార్డు పొందారు.
♦ 2017 డిసెంబరు 9న పశ్చిమగోదావరి జిల్లా వేలూరులో అక్కినేని అంతర్జాతీయ వినూత్నరత్న అవార్డును అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment