అదనంగా 1,410 ఇంజనీరింగ్‌ సీట్లు  | Additional 1410 engineering seats | Sakshi
Sakshi News home page

అదనంగా 1,410 ఇంజనీరింగ్‌ సీట్లు 

Published Fri, Aug 18 2023 1:19 AM | Last Updated on Fri, Aug 18 2023 8:59 AM

Additional 1410 engineering seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ విద్యాసంవత్సరం నుంచే మరో 1,410 ఇంజనీరింగ్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఆఖరి నిమిషంలో ఈ సీట్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఎంసెట్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కూడా మార్చారు.  

మహబూబాబాద్, ఖమ్మం జిల్లా పాలేరులో కొత్తగా రెండు ఇంజనీరింగ్‌ కాలేజీలకు ప్రభుత్వం అనుమతించింది. ఇవి జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో నడుస్తాయి. వాస్తవానికి ఈ రెండు కాలేజీల్లో ఒక్కోదాంట్లో 300 వరకూ సీట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది మాత్రం సీఎస్‌ఈ, ఈసీఈ, సీఎస్‌ఈ–ఎంఎల్‌ కోర్సులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో బ్రాంచ్‌లో 60 చొప్పున, ఒక్కో కాలేజీలో 180 సీట్లు అందుబాటులోకి వస్తాయి. రెండు కాలేజీల్లో కలిపి 360 సీట్లు ఉంటాయి.  

ఘట్‌కేసర్‌లోని కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి ఎంబీఏ కాలేజీకి కూడా ఇంజనీరింగ్‌ కోర్సులకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ కాలేజీలో ఆరు బ్రాంచ్‌లకు కలిపి 360 సీట్లు అదనంగా వస్తాయి. 

హైదరాబాద్‌లోని టీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీని అప్‌గ్రేడ్‌ చేశారు. దీంతో 300 సీట్లు అదనంగా రాబోతున్నాయి.  

ఇవి కాకుండా మరో మూడుకాలేజీలకు అదనంగా సీట్లు ఇవ్వడానికి అనుమతి లభించింది. దీనికి జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ గుర్తింపు రావాల్సి ఉంది.  

ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అన్నీ కలిపి 1,410 సీట్లు అదనంగా రాబోతున్నాయని ఉన్నత విద్యామండలి పేర్కొంది. 

పెరిగిన సీట్లూ కంప్యూటర్‌ కోర్సుల్లోనే 
కొత్తగా పెరిగే 1,410 సీట్లల్లో ఎక్కువగా కంప్యూటర్‌ కోర్సులే ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 83,766 సీట్లు కన్వీనర్‌ కోటా కింద ఉంటే, 58 వేల వరకూ కంప్యూటర్‌ సంబంధిత బ్రాంచ్‌ల్లోనే ఉన్నాయి. మూడు విడతలుగా సీట్ల భర్తీ చేపట్టినా, ఇంకా 3,034 సీట్లు కంప్యూటర్‌ కోర్సుల్లో మిగిలాయి. తాజాగా మరో 900 వరకూ కొత్త సీట్లు కలుపుకుంటే, దాదాపు 4 వేల సీట్లు మిగిలే అవకాశం ఉంది.  

ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా.. 
ఆఖరిదశలో అనుమతులు, కొత్త సీట్లు రావడంతో వాటి భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్‌ తేదీలు మార్చారు. వాస్తవానికి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ మొదలు పెట్టి, 23న సీట్ల కేటాయింపు చేపట్టాలని భావించారు. ఈ తేదీల్లో మార్పులు చేస్తూ సాంకేతిక విద్యా శాఖ కొత్త షెడ్యూల్‌ ఇచ్చింది.  

18వ తేదీ    స్లాట్‌ బుకింగ్, రిజిస్ట్రేషన్‌ (కొత్తవారు) 
17–22 తేదీల్లో    ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు 
26న    సీట్ల కేటాయింపు 
26–28 తేదీల్లో    ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 
27–29 తేదీల్లో    కాలేజీలో రిపోరి్టంగ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement