సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండోదశ కౌన్సెలింగ్‌పై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదటి కౌన్సెలింగ్ నుంచి ఎంత మంది తప్పుకొంటారు, ఎన్నిసీట్లు మిగులుతాయి, కోరుకున్న బ్రాంచ్‌లో సీటు వస్తుందా అన్న అంచనాలు వేసుకుంటున్నారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లను రద్దు చేసుకునే గడువును ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఉన్నత విద్యా మండలి పొడిగించింది. ఈ నెల 15వ తేదీనే జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు వెలువడనున్నాయి. అందులో మంచి ర్యాంకు సాధించే విద్యార్థులు.. ఇప్పటికే ఎంసెట్ తొలి కౌన్సెలింగ్‌లో పొందిన సీట్లను వదులుకునే అవకాశం ఉంది. అలా ఖాళీ అయ్యే సీట్లు తమకు కలిసొస్తాయని రెండో కౌన్సెలింగ్ కోసం చూస్తున్న విద్యార్థులు ఆశిస్తున్నారు. గత ఏడాది సీట్ల కేటాయింపు, ఈ ఏడాది పరిస్థితి ఆధారంగా అంచనాలు వేసుకుంటున్నారు. 8 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు.. మంచి కాలేజీల్లోని కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో సీట్లు రావచ్చని నిపుణులు అంటున్నారు.
20 తర్వాతే రెండో విడత..
తొలిదశలో సీట్ల రద్దు గడువును ఈ నెల 20 వరకు పొడిగించిన నేపథ్యంలో.. ఆ తర్వాత వీలైనంత త్వరగా మలివిడత కౌన్సెలింగ్ చేపట్టే అవకాశం ఉంది. ఆ తేదీనాటికల్లా కాలేజీల్లో సీట్ల ఖాళీలపై స్పష్టత రావచ్చని విద్యార్థులు ఆశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ బ్రాంచీల్లో కలిపి లక్ష వరకు సీట్లు ఉన్నాయి. అందులో 71,853 కన్వీనర్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మిగతా సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీచేస్తారు. తొలి కౌన్సెలింగ్‌లో సీట్లుదక్కిన వారిలో 59,143 మంది కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
పోటీ అంతా కంప్యూటర్స్ గ్రూపులకే..
ఎంసెట్ అర్హుల్లో ఎక్కువ భాగం కంప్యూటర్, కంప్యూటర్ అనుబంధ గ్రూపులకే ప్రాధాన్యమిచ్చారు. ఆ బ్రాంచీల్లో ఎక్కువ శాతం సీట్లు భర్తీ అయ్యాయి. టాప్ కాలేజీల నుంచి సాధారణ కాలేజీల వరకు అన్నిచోట్లా ఈ సీట్లకే పోటీ నెలకొంది. కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో మిగిలిన కొద్దిసీట్లు కూడా మారుమూల ప్రాంతాల్లోని కాలేజీల్లోనే ఉండటం గమనార్హం. కొత్తగా వచ్చిన ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ తదితర కోర్సులను ప్రధానంగా ఎంచుకున్నారు. సీఎస్సీలో 18,614 సీట్లకుగాను 53 సీట్లే మిగిలాయి. సీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 5,884 సీట్లకు 455, ఐటీలో 5,262 సీట్లకు 39, సీఎస్సీ డేటా సైన్స్‌లో 3,528 సీట్లకు 299, సీఎస్సీ సైబర్ సెక్యూరిటీలో 583 సీట్లకు 43 సీట్లు మాత్రమే మిగిలాయి.
జేఈఈ ఫలితాల తర్వాత..
జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులు ఈ నెల 15న వెలువడతాయి. మరుసటి రోజు నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కటాఫ్‌ను బట్టి ఏయే ర్యాంకులకు ఐఐటీ, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు దక్కుతాయో ఓ అంచనాకు వచ్చే వీలుంది. ఎంసెట్ తొలిదశ కౌన్సెలింగ్‌లో జనరల్ కేటగిరీలో టాప్ టెన్ కాలేజీల్లో 5 వేల ర్యాంకు వరకూ సాధించిన విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో సీట్లు దక్కాయి. వారిలో సుమారు 1,500 మంది నిట్, ఐఐటీ కాలేజీల్లో సీట్లు పొందే అర్హత సంపాదించే అవకాశం ఉంది. వీరిలో కోరుకున్న బ్రాంచ్ రానివారు రాష్ట్రంలోనే కొనసాగినా.. మరో వెయ్యి మంది వరకు జాతీయ కాలేజీల్లో చేరుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు హైకోర్టు ఆదేశా ల మేరకు.. రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్, అనుబంధ బ్రాంచీల్లో మరో 4 వేల సీట్ల వరకూ వచ్చే వీలుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసు కుంటే 8 వేలలోపు ర్యాంకు వరకు సాధించిన వి ద్యార్థులకు టాప్ కాలేజీల్లోని కంప్యూటర్ కోర్సు ల్లో సీట్లు లభించే వీలుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment