councilling
-
8వేల లోపు ర్యాంకొస్తే.. కంప్యూటర్స్ కోర్సుల్లో సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండోదశ కౌన్సెలింగ్‌పై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదటి కౌన్సెలింగ్ నుంచి ఎంత మంది తప్పుకొంటారు, ఎన్నిసీట్లు మిగులుతాయి, కోరుకున్న బ్రాంచ్‌లో సీటు వస్తుందా అన్న అంచనాలు వేసుకుంటున్నారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లను రద్దు చేసుకునే గడువును ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఉన్నత విద్యా మండలి పొడిగించింది. ఈ నెల 15వ తేదీనే జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు వెలువడనున్నాయి. అందులో మంచి ర్యాంకు సాధించే విద్యార్థులు.. ఇప్పటికే ఎంసెట్ తొలి కౌన్సెలింగ్‌లో పొందిన సీట్లను వదులుకునే అవకాశం ఉంది. అలా ఖాళీ అయ్యే సీట్లు తమకు కలిసొస్తాయని రెండో కౌన్సెలింగ్ కోసం చూస్తున్న విద్యార్థులు ఆశిస్తున్నారు. గత ఏడాది సీట్ల కేటాయింపు, ఈ ఏడాది పరిస్థితి ఆధారంగా అంచనాలు వేసుకుంటున్నారు. 8 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు.. మంచి కాలేజీల్లోని కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో సీట్లు రావచ్చని నిపుణులు అంటున్నారు. 20 తర్వాతే రెండో విడత.. తొలిదశలో సీట్ల రద్దు గడువును ఈ నెల 20 వరకు పొడిగించిన నేపథ్యంలో.. ఆ తర్వాత వీలైనంత త్వరగా మలివిడత కౌన్సెలింగ్ చేపట్టే అవకాశం ఉంది. ఆ తేదీనాటికల్లా కాలేజీల్లో సీట్ల ఖాళీలపై స్పష్టత రావచ్చని విద్యార్థులు ఆశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ బ్రాంచీల్లో కలిపి లక్ష వరకు సీట్లు ఉన్నాయి. అందులో 71,853 కన్వీనర్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మిగతా సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీచేస్తారు. తొలి కౌన్సెలింగ్‌లో సీట్లుదక్కిన వారిలో 59,143 మంది కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు అధికారులు తెలిపారు. పోటీ అంతా కంప్యూటర్స్ గ్రూపులకే.. ఎంసెట్ అర్హుల్లో ఎక్కువ భాగం కంప్యూటర్, కంప్యూటర్ అనుబంధ గ్రూపులకే ప్రాధాన్యమిచ్చారు. ఆ బ్రాంచీల్లో ఎక్కువ శాతం సీట్లు భర్తీ అయ్యాయి. టాప్ కాలేజీల నుంచి సాధారణ కాలేజీల వరకు అన్నిచోట్లా ఈ సీట్లకే పోటీ నెలకొంది. కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో మిగిలిన కొద్దిసీట్లు కూడా మారుమూల ప్రాంతాల్లోని కాలేజీల్లోనే ఉండటం గమనార్హం. కొత్తగా వచ్చిన ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ తదితర కోర్సులను ప్రధానంగా ఎంచుకున్నారు. సీఎస్సీలో 18,614 సీట్లకుగాను 53 సీట్లే మిగిలాయి. సీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 5,884 సీట్లకు 455, ఐటీలో 5,262 సీట్లకు 39, సీఎస్సీ డేటా సైన్స్‌లో 3,528 సీట్లకు 299, సీఎస్సీ సైబర్ సెక్యూరిటీలో 583 సీట్లకు 43 సీట్లు మాత్రమే మిగిలాయి. జేఈఈ ఫలితాల తర్వాత.. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు ఈ నెల 15న వెలువడతాయి. మరుసటి రోజు నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కటాఫ్‌ను బట్టి ఏయే ర్యాంకులకు ఐఐటీ, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు దక్కుతాయో ఓ అంచనాకు వచ్చే వీలుంది. ఎంసెట్ తొలిదశ కౌన్సెలింగ్‌లో జనరల్ కేటగిరీలో టాప్ టెన్ కాలేజీల్లో 5 వేల ర్యాంకు వరకూ సాధించిన విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో సీట్లు దక్కాయి. వారిలో సుమారు 1,500 మంది నిట్, ఐఐటీ కాలేజీల్లో సీట్లు పొందే అర్హత సంపాదించే అవకాశం ఉంది. వీరిలో కోరుకున్న బ్రాంచ్ రానివారు రాష్ట్రంలోనే కొనసాగినా.. మరో వెయ్యి మంది వరకు జాతీయ కాలేజీల్లో చేరుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు హైకోర్టు ఆదేశా ల మేరకు.. రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్, అనుబంధ బ్రాంచీల్లో మరో 4 వేల సీట్ల వరకూ వచ్చే వీలుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసు కుంటే 8 వేలలోపు ర్యాంకు వరకు సాధించిన వి ద్యార్థులకు టాప్ కాలేజీల్లోని కంప్యూటర్ కోర్సు ల్లో సీట్లు లభించే వీలుందని పేర్కొంటున్నారు. -
Karimnagar: ‘ఖాకీ’ దిద్దిన కాపురం
‘కరీంనగర్‌కు చెందిన యువకుడికి పక్కజిల్లాకు చెందిన యువతితో రెండేళ్లక్రితం వివాహమైంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంతో ఒకరిపై ఒకరి ఆధిపత్యం ఎక్కువైంది. చిన్న విషయాలకే పెద్దగొడవలు జరిగాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. అయినా సమస్య సద్దుమణగకపోవడంతో మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడి అధికారులు ఆ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని నిలబెట్టారు.’ సాక్షి, కరీంనగర్: మూడుముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారుతోంది. జీవితాంతం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన ఆ జంటలు విడిపోతామంటూ ఠాణామెట్లు ఎక్కుతున్నారు. చిన్నగొడవలకే పంచాయితీల వరకు వెళ్తున్నారు. కలిసి ఉండమంటూ.. పచ్చటికాపురాన్ని కూల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఠాణా మెట్లు ఎక్కుతున్న పలు జంటలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇద్దరిమధ్య సయోధ్య కుదిరించి కాపురాలను నిలబెడుతున్నారు జిల్లా మహిళా పోలీసుస్టేషన్ అధికారులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు స్టేషన్‌కు 794 ఫిర్యాదులు రాగా.. 609 పరిష్కరించి వారికి కొత్తజీవితాలను అందించారు. వేరు కాపురాల్లోనే ఎక్కువ.. ► ప్రస్తుతం ట్రెండు మారింది. గతంలో పెద్దలతో కలిసి ఉన్నప్పుడు దంపతుల మధ్య చిన్న సమస్య వచ్చినా.. ఇంట్లోనే పరిష్కరించేవారు. ఇద్దరికీ సర్దిచెప్పేవారు. ఇప్పుడు అలా కాదు. పెళ్లయ్యాక చాలామందికి పెద్దలతో కలిసి ఉండడం రుచించడం లేదు. పెళ్లికి ముందే ఉద్యోగ, వ్యాపారరీత్యా వేరుకాపురం పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లయిన నాలుగు రోజులకే ఇంటివారికి దూరంగా వెళ్తున్నారు. ► అలా వెళ్లినవారు కొన్నాళ్లపాటు బాగానే ఉంటున్నా.. తరువాత దంపతుల మధ్య ఆధిపత్యం పెరుగుతోంది. అభిప్రాయభేదాలతో చిన్నగొడవలకే విడాకుల వరకు వెళ్తున్నారు. చాలాకేసుల్లో రెండు, మూడు నెలల్లోనే విడాకుల వరకు రావడం బాధాకరమని, ఇలాంటివి వేరుకాపురంలోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ► తల్లిదండ్రులు సైతం పిల్లలకు పెళ్లికి ముందు కొన్ని నైతిక విలువలు నేర్పించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. దాంపత్యబంధం గురించి, అత్తవారింట్లో మెదలాల్సిన పద్ధతుల గురించిచెప్పాలని అంటున్నారు. చిన్న సమస్య రాగానే పెద్దలు కూడా ఆలోచన లేకుండా వ్యవహరించడం సరికాదని సూచిస్తున్నారు. ఇద్దరికి ప్రశాంతంగా సర్దిచెప్పాలని చెబుతున్నారు. ► దంపతులు పరస్పరం అర్థం చేసుకోవాల్సింది పోయి, అనుమానం పెంచుకోవడం, పట్టించుకోకపోవడం కాపురాల్లో చిచ్చుపెడుతుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. మద్యానికి బానిసకావడం, వివాహేతర సంబంధాలు సరికాదని అంటున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చేవారు చాలామంది ప్రేమ వివాహాలు చేసుకున్నవారే ఉంటున్నారని ఎస్సై సురేందర్ తెలిపారు. ► దంపతులు గొడవలతో కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు రాగానే.. వారికి వేర్వేరుగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు. భార్యాభర్తల బంధం గురించి వివరిస్తుంటారు.స్టేషన్‌లోని కౌన్సిలింగ్ సెంటర్ సైకాలజిస్టులు, న్యాయనిపుణులు, పోలీసులు కలిసి వారికి సర్దిచెబుతుంటారు. సమస్యను బట్టి అనుకూలమైన పరిష్కారాన్ని మార్గం చూపుతుంటారు. ఆవేశంగా వచ్చిన దంపతులు ఏకమై వెళ్లడం సంతోషంగా ఉందని పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య ఏర్పడిన సమస్యను చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. ప్రతీ విషయంలో గొడవపడడం మానుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పరస్పరం గౌరవం ఇచ్చుకోవడంతో పాటు అత్తింటివారు, పుట్టింటి విలువలకు గౌరవం ఇవ్వాలి. ఇలా ముందకుసాగితే వివాహబంధం సంతోషంగా ఉంటుంది. గొడవలు పెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కేసుల్లో కౌన్సెలింగ్ ఇస్తూ.. దంపతులను కలుపుతున్నాం. – శ్రీనివాస్, సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ చదవండి: చలానా పెండింగ్ ఉంటే బండి సీజ్ -
దెబ్బకు మత్తు దిగింది.. తిక్క కుదిరింది
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో చిక్కిన చోదకుల్లో 372 మందికి కోర్టులు జైలు శిక్ష విధించాయని ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. గత నెల 26 నుంచి 30 వరకు జరిగిన ప్రత్యేక డ్రైవ్‌ల్లో మొత్తం 621 కేసులు నమోదు చేశారు. వీటి చోదకులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో హాజరుపరిచారు. చోదకులు తీసుకున్న మద్యం మోతాదు, నడిపిన వాహనం తదితరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఒక రోజు నుంచి 22 రోజుల వరకు జైలు శిక్షలు విధించాయి. జైలుకు వెళ్లిన 372 మందిలో 186 మందికి ఒక రోజు, 101 మందికి రెండు రోజులు, 40 మందికి మూడు రోజులు, 18 మందికి నాలుగు రోజులు, 11 మందికి ఐదు రోజులు, ఇద్దరికి ఆరు రోజులు, అయిదుగురుకి వారం, నలుగురికి ఎనిమిది రోజులు, 10, 12, 16, 18 రోజుల చొప్పున ఒక్కొక్కరికి, మరో వ్యక్తికి 22 రోజుల జైలు శిక్ష పడింది. వీరికి కోర్టులు రూ.15.26 లక్షలు జరి మానా విధించాయి. వీరి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలంటూ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. -
డయాబెటిక్ కౌన్సెలింగ్
ఇన్సులిన్‌ను ట్యాబ్లెట్ల రూపంలో ఇవ్వలేమా? మనం డయాబెటిస్‌ను మందులు లేకుండానే నియంత్రించలేమా? ఇన్సులిన్ ఇంజెక్షన్ల రూపంలో కాకుండా ట్యాబ్లెట్ల రూపంలో దొరికే అవకాశం ఉందా? దయచేసి వివరించండి. – అరవింద, నెల్లూరు డయాబెటిస్ (టైప్–2) తొలిదశల్లో అంటే ప్రీ–డయాబెటిక్ స్టేజ్‌లో దీన్ని క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార నియమాలు పాటించడం (అంటే కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు) తక్కువగా ఉండటంతోపాటు అందులో కొవ్వులు, ప్రొటీన్ల పాళ్లు ఎంత ఉండాలో అంతే ఉండేలా ఆహారం తీసుకోవడం) వంటి చర్యల ద్వారా డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహారనియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలితోనూ రక్తంలోని చక్కెరపాళ్లు అదుపులోకి రాకపోతే మాత్రం తప్పనిసరిగా డయాబెటిస్‌కు మందులు వాడాల్సిందే. మందులు వాడటం మొదలుపెట్టాక కూడా వ్యాయామం, ఆహార నియమాలు పాటించాల్సిందే. ఇక మీ రెండో ప్రశ్నకు సమాధానం ఏమిటంటే... ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడ కూడా ఇన్సులిన్ ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులో లేదు. అయితే ఇంజెక్షన్ల ద్వారా కాకుండా టాబ్లెట్ల ద్వారా ఇన్సులిన్ అందించడానికి పరిశోధనలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నాయి. షుగర్ తగ్గడం వల్ల కూడాసమస్య వస్తుందా? మా అమ్మగారి వయసు 64 ఏళ్లు. చాలా రోజులుగా ఆమె డయాబెటిస్తో బాధపడుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా టాబ్లెట్లు తీసుకుంటారు. ఒకరోజు అకస్మాత్తుగా స్పృహతప్పిపడిపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి రక్తంలో షుగర్ పాళ్లు తగ్గాయని చెప్పారు. షుగర్ పెరిగితే కదా ప్రమాదం... ఇలా షుగర్ తగ్గడం వల్ల కూడా ప్రమాదాలు ఉంటాయా? – సందీప్, విశాఖపట్నం ఒక్కోసారి పెద్ద వయసు వాళ్లు తాము తినాల్సిన ఆహారం తినరు. కానీ తాము వాడాల్సిన చక్కెరను నియంత్రించే మాత్రలు మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటారు. అలాంటప్పుడు వాళ్ల రక్తంలో ఉండాల్సిన చక్కెర ఉండాల్సిన మోతాదు కంటే తక్కువకు పడిపోవచ్చు. అలా చక్కెరపాళ్లు చాలా ఎక్కువగా పడిపోవడాన్ని వైద్యపరిభాషలో హైపోగ్లైసీమియా అంటారు. దీనివల్ల వృద్ధులైన రోగుల్లో (వణుకు, చెమటలు పట్టడం వంటి లక్షణాలుకు బదులుగా) నరాలకు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే నిద్రమత్తుగా ఉన్నట్లుండటం, బలహీనత, భ్రాంతులు, అయోమయం వంటివి. ఆ వయసువారికి మత్తుగా జోగుతుండటం వల్ల పడిపోయి ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాలి. నైట్‌డ్యూటీలు చేస్తే డయాబెటిస్ వస్తుందా? నా వయసు 31 ఏళ్లు. నేను నెలలో ఒకటీ మూడు వారాలు డే–డ్యూటీలు, రెండూ, నాలుగు వారాలు నైట్ డ్యూటీలు... ఇలా మార్చిమార్చి డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. కాస్త యంగ్ పర్సన్స్ కావడంతో ఎవరైనా పెద్ద వయసు వాళ్లు డ్యూటీలకు రాకపోతే ఆ నైట్ డ్యూటీలు కూడా మాకే వేస్తారు. పరీక్షలు చేయించుకుంటే నాకు డయాబెటిస్ బార్డర్‌లైన్‌లో ఉందని తేలింది. రక్తపరీక్షలు చేయించినప్పటి నుంచి నాకు డయాబెటిస్ చాలా త్వరగా వచ్చేస్తుందేమోనని ఆందోళనగా ఉంది. డయాబెటిస్ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పండి. – మనీష్‌కుమార్, హైదరాబాద్ వృత్తిపరంగా కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల నిద్రపట్టకపోవడం డయాబెటిస్ రావడాన్ని వేగవంతం చేస్తే చేయవచ్చు. కానీ కేవలం నైట్ డ్యూటీస్ వల్లనే డయాబెటిస్ రాదు. అయితే డయాబెటిస్ రావడం అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల్లోగానీ, మీ వంశంలో ఎవరికైనా డయాబెటిస్ ఉందా అన్న అంశం మీద ఆధారపడి, జన్యుపరంగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా నైట్‌డ్యూటీలు చేస్తానని తెలిపారు. అయితే మీరు పగలు పడుకోవడం, రాత్రిళ్లు మేల్కొంటూ ఉండటం వల్ల కొన్ని రకాల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక రక్తపరీక్షలో బార్డర్‌లైన్ డయాబెటిస్ అని వచ్చింది కాబట్టి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఆరోగ్యకరమైన మీ జీవనశైలి మార్పులతో మీరు మీ డయాబెటిస్ వచ్చే అవకాశాలను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇందుకోసం మీరు రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు వంటి అధిక క్యాలరీలు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ప్రతి కొద్దిగంటల తర్వాత ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండేముడిబియ్యం, కాయధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. నైట్‌డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కాఫీలు, టీలు తాగవద్దు. కచ్చితంగా భోజనం వేళకు భోజనం చేయడం, కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు భోజనం చేయడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోండి. మీ బరువును అదుపులో పెట్టుకోండి. ఇలాంటి జీవనశైలి మార్పులు చేసుకుంటే డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నివారించవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. - డాక్టర్ ఎమ్. గోవర్ధన్ ,సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
అఫిడ‘ఒట్టు’..!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు నగరంలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కాడు. వాహనం పోలీసుల వద్దే ఉండిపోవడం, కౌన్సెలింగ్‌కు కుటుంబీకులతో హాజరుకావాల్సి ఉండటం, యూపీలో ఉంటున్న వారు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎటూ పాలుపోని స్థితిలో పడ్డాడు. బంజారాహిల్స్‌లో నివసించే యువకుడి తల్లిదండ్రులు దుబాయ్‌లో ఉంటారు. సోదరులు లేరు.. నగరంలో బంధువులెవరూ నివసించడం లేదు. మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కిన ఈ యువకుడి వాహనం సైతం ట్రాఫిక్ పోలీసుల దగ్గరే ఉండిపోయింది. సాక్షి, హైదరాబాద్ : నగరంలో నివసిస్తున్న అనేక మంది ‘నాన్–లోకల్స్’, కొందరు ‘లోకల్స్’ పరిస్థితి ఇది. ఫలితంగా ‘పరారీలో ఉన్న మందుబాబుల’ సంఖ్య పెరగడంతో పాటు అనేక ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలో వారి వాహనాలు పేరుకుపోయి వాటి పరిరక్షణ భారంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు ‘అఫిడవిట్’దాఖలు చేసే అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే 17 మంది దీన్ని వినియోగించుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తక్షణం వాహనం స్వాధీనం.. నిబంధనల ఉల్లంఘనల్ని ట్రాఫిక్ పోలీసులు మూడు రకాలుగా పరిగణిస్తారు. వాహనచోదకుడికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పు కలిగించేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ ముప్పు కలిగించేవి. మొదటి రెండింటి కంటే మూడో దాన్నే తీవ్రమైనదిగా పరిగణిస్తారు. మద్యం తాగి వాహనాలు నడపటం ఈ కోవలోకే వస్తుంది. రోడ్డు ప్రమాదాలు నిరోధించేందుకు ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వారాంతాలతో పాటు ఆకస్మికంగానూ స్పెషల్ డ్రైవ్స్ చేపడుతున్నారు. తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారి నుంచి తక్షణం వాహనం స్వాధీనం చేసుకుంటారు. వీరు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్(టీటీఐ)లో కౌన్సిలింగ్‌కు హాజరైన తర్వాత కోర్టుకు రావాల్సి ఉంటుంది. న్యాయస్థానం విధించే జరిమానా చెల్లించడం, జైలు శిక్ష వేస్తే అది పూర్తి చేసుకుని రావాలి. ఈ తతంగం ముగిసే వరకు వాహనం ట్రాఫిక్ పోలీసుల అధీనంలోనే ఉంటుంది. ‘విషయం’ తెలియడం ఇష్టం లేక.. స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడిన ‘నిషా’చరులు ఆ తర్వాతి వారంలో టీటీఐ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. దీనికి వారితోపాటు కుటుంబంలో ఎవరో ఒకరిని తీసుకురావాలి. వివాహితులు భార్య, అవివాహితులు తల్లిదండ్రులు, సోదరుడు, సమీప బంధువుతో హాజరుకావాలి. అయితే కౌన్సెలింగ్‌కు హాజరుకావడానికి కొందరు మందుబాబులు తెలివిగా వ్యవహరిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. స్నేహితులు, పరిచయస్తుల్ని కుటుంబీకులుగా చూపిస్తూ కౌన్సెలింగ్‌కు వస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తున్నారు. ‘నిషా’చరుడితోపాటు అతని వెంట వచ్చిన వారి ఆధార్ వివరాలను సరిచూస్తూ.. అసలు కుటుంబీకులు ఎవరు? నకిలీ కుటుంబీకులు ఎవరు? అనేది గుర్తిస్తున్నారు. అయితే మందుబాబుల్లో చాలా మంది విషయం కుటుంబీకులకు తెలియడానికి ఇష్టపడట్లేదు. మరికొందరి కుటుంబీకులు నగరంలో ఉండట్లేదు. దీంతో కౌన్సెలింగ్‌కు హాజరు కాకుండా ‘పరారీలో’ఉండిపోతున్నారు. ఓ అవకాశం కల్పించాలనే.. ‘పరారీలో’ ఉండిపోతున్న వారి వివరాలు సేకరించిన ట్రాఫిక్ పోలీసులు ఓ అధ్యయనం చేశారు. ఇలాంటి వారిలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారని గుర్తించారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వారు నగరానికి చెందిన వారైనా వారి కుటుంబీకులు విదేశాల్లో ఉండటంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని తేల్చారు. ఇలాంటి వారికి ఓ అవకాశం ఇవ్వడానికి అఫిడవిట్ల విధానం ప్రారంభించారు. దీంతో వారు తమ వారెవ్వరూ నగరంలో లేరంటూ స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ సమర్పించాలి. అలా చేస్తే స్నేహితులతో కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం ఇస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదైనా అఫిడవిట్‌పై అనుమానం వస్తే దాన్ని దాఖలు చేసిన వ్యక్తి నివసించే ప్రాంతానికి చెందిన స్థానిక పోలీసుల ద్వారా తనిఖీ చేయించాలని నిర్ణయించారు. ఇందులో ఆ వ్యక్తి తప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్లు తేలితే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
నేర నియంత్రణలో కొత్త పంథా
ఏలూరు అర్బన్ : నగర పోలీసులు నేరాల నిరోధం, నియంత్రణలో అప్డేట్ అవుతున్నారు. చికిత్స కన్నా నివారణ మేలు అనే నానుడిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. గతంలో నేరం జరిగిన తరువాత తీరుబడిగా విజిల్స్ ఊదుకుంటూ హడావుడి పడుతూ వచ్చే వి«ధానానికి దాదాపు తిలోదకాలు ఇచ్చేశారు. అదే క్రమంలో చేతిలో లాఠీ పట్టుకుని అల్లరిమూకలపై దాడి చేసే ప్రక్రియతో ఆశించిన ఫలితాలు రావని గ్రహించి ఫ్రెండ్లీ పోలీసింగ్ మొదలు పెట్టారు. ప్రజలను కూడా పోలీసు విధుల్లో భాగస్వాములను చేసేందుకు గతంలో పోలీసు మిత్ర పేరిట అమలు చేసిన పథకం ఫెయిల్ కావడంతో ఆ విధానానికి మరింత మెరుగులు దిద్ది విద్యార్థులు, ప్రజలను పోలీసుల విధుల్లో భాగస్వాములు చేసేందుకు కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ (సీపీవో) అనే నూతన పథకం అమలు చేస్తున్నారు. నిత్యం నగరంలో విజిబుల్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ పేరిట నిత్యం నగరంలో అన్ని పోలీసు స్టేషన్ల అధికారులు సిబ్బందితో కలిసి వాహన, లాడ్జి తనిఖీలు ముమ్మరం చేశారు. రౌడీలు, విద్యార్థులు, వాహన చోదకులకు కౌన్సెలింగ్‌లు రౌడీ షీటర్లను స్టేషన్‌కు పిలిపించి వారి ప్రవర్తనపై ఆరా తీయడం కౌన్సెలింగ్ నిర్వహించడం జరిపేవారు. అయితే ప్రస్తుతం పంథా మార్చారు. పోలీసు అధికారులే నేరుగా వారి ఇళ్ళకు వెళ్లి వారి కుటుంబసభ్యుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ర్యాగింగ్ నివారించేందుకు విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమాజంలో కుల వివక్ష రూపుమాపేందుకు ప్రతినెలా సివిల్ రైట్స్ డే పేరిట ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రహదారి ప్రమాదాల నివారణకు స్కూలు బస్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు తరచూ కౌన్సెలింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. చట్టాల అమలుకు ప్రత్యేక కార్యాచరణ బహిరంగ ప్రదేశాలలో ధూమపానంపై నిషేధం ఉన్నా చూసీచూడనట్టు వ్యవహరించే పోలీసులు ప్రస్తుతం అందుకు భిన్నంగా చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగంగా పొగతాగుతూ పొగ మేఘాలు సృష్టించే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. అదే విధంగా పాదచారులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారిని గుర్తించి పెనాల్టీగా భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారు. రాంగ్ పార్కింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లెస్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని అదుపులోకి తీసుకోవడం కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టి కోర్టులో హాజరు పరచడం వంటి కార్యక్రమాలతో ప్రజల మెప్పు పొందుతున్నారు. -
రేపు ఐటీఐలలో రెండో విడత కౌన్సెలింగ్
పెద్దపల్లిరూరల్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఈనెల 24న మలివిడత ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ సురేందర్ తెలిపారు. జిల్లాలోని పెద్దపల్లి, కాటారం, రామగుండం, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల ప్రభుత్వ ఐటీఐలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సకాలంలో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. ఆయా ప్రభుత్వ ఐటీఐలలో ఉన్న ఖాళీలను ఈ కౌన్సెలింగ్‌తో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. 27నుంచి ప్రైవేట్ ఐటీఐల్లో... జిల్లాలోని ప్రైవేట్ ఐటీఐల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 27 నుంచి రెండోవిడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. దరఖాస్తుదారులు ఆయా ఐటీఐల్లో జరిగే కౌన్సిలింగ్‌కు నేరుగా హాజరుకావాలన్నారు. ఈనెల 27న మార్కోస్ (కరీంనగర్), కాకతీయ(పెద్దపల్లి), సాదువెంకటరెడ్డి (ఎల్లారెడ్డిపేట), శివశక్తి (గోదావరిఖని) ఐటీఐలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. 28న సాయి (జగిత్యాల), శ్రీసార«థి (ఎన్టీపీసీ), వివేకవర్ధిని (సిరిసిల్ల), ఆల్బర్ట్ (పెద్దపల్లి), గార్గిల్ (హుజూరాబాద్), సింధూర (పెద్దపల్లి), 29న గౌతమి (గోదావరిఖని), జీఎస్సార్ (జమ్మికుంట), వాసవి (హుజూరాబాద్), సిఎస్ఐ (కరీంనగర్), శివసాయి (పెద్దపల్లి), 30న సూర్య (కరీంనగర్), శ్రీరామ (హుజూరాబాద్), లక్ష్మి (మెట్పల్లి), తేజస్వి (హుస్నాబాద్), సంతోష్ (కరీంనగర్) ఐటీఐలలో జరిగే కౌన్సిలింగ్‌కు ఒరిజినల్, జిరాక్సు సర్టిఫికెట్లతో సకాలంలో హాజరుకావాలని కన్వీనర్ సురేందర్ కోరారు.