నేర నియంత్రణలో కొత్త పంథా
నేర నియంత్రణలో కొత్త పంథా
Published Tue, Jul 11 2017 12:35 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM
ఏలూరు అర్బన్ : నగర పోలీసులు నేరాల నిరోధం, నియంత్రణలో అప్‌డేట్ అవుతున్నారు. చికిత్స కన్నా నివారణ మేలు అనే నానుడిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. గతంలో నేరం జరిగిన తరువాత తీరుబడిగా విజిల్స్ ఊదుకుంటూ హడావుడి పడుతూ వచ్చే వి«ధానానికి దాదాపు తిలోదకాలు ఇచ్చేశారు. అదే క్రమంలో చేతిలో లాఠీ పట్టుకుని అల్లరిమూకలపై దాడి చేసే ప్రక్రియతో ఆశించిన ఫలితాలు రావని గ్రహించి ఫ్రెండ్లీ పోలీసింగ్ మొదలు పెట్టారు.
ప్రజలను కూడా పోలీసు విధుల్లో భాగస్వాములను చేసేందుకు గతంలో పోలీసు మిత్ర పేరిట అమలు చేసిన పథకం ఫెయిల్ కావడంతో ఆ విధానానికి మరింత మెరుగులు దిద్ది విద్యార్థులు, ప్రజలను పోలీసుల విధుల్లో భాగస్వాములు చేసేందుకు కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ (సీపీవో) అనే నూతన పథకం అమలు చేస్తున్నారు.
నిత్యం నగరంలో విజిబుల్ పోలీసింగ్
విజిబుల్ పోలీసింగ్ పేరిట నిత్యం నగరంలో అన్ని పోలీసు స్టేషన్‌ల అధికారులు సిబ్బందితో కలిసి వాహన, లాడ్జి తనిఖీలు ముమ్మరం చేశారు.
రౌడీలు, విద్యార్థులు, వాహన చోదకులకు కౌన్సెలింగ్‌లు
రౌడీ షీటర్‌లను స్టేషన్‌కు పిలిపించి వారి ప్రవర్తనపై ఆరా తీయడం కౌన్సెలింగ్ నిర్వహించడం జరిపేవారు. అయితే ప్రస్తుతం పంథా మార్చారు. పోలీసు అధికారులే నేరుగా వారి ఇళ్ళకు వెళ్లి వారి కుటుంబసభ్యుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ర్యాగింగ్ నివారించేందుకు విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమాజంలో కుల వివక్ష రూపుమాపేందుకు ప్రతినెలా సివిల్ రైట్స్ డే పేరిట ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రహదారి ప్రమాదాల నివారణకు స్కూలు బస్ డ్రైవర్‌లు, ఆటో డ్రైవర్‌లకు తరచూ కౌన్సెలింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
చట్టాల అమలుకు ప్రత్యేక కార్యాచరణ
బహిరంగ ప్రదేశాలలో ధూమపానంపై నిషేధం ఉన్నా చూసీచూడనట్టు వ్యవహరించే పోలీసులు ప్రస్తుతం అందుకు భిన్నంగా చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగంగా పొగతాగుతూ పొగ మేఘాలు సృష్టించే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. అదే విధంగా పాదచారులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారిని గుర్తించి పెనాల్టీగా భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారు. రాంగ్ పార్కింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లెస్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని అదుపులోకి తీసుకోవడం కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టి కోర్టులో హాజరు పరచడం వంటి కార్యక్రమాలతో ప్రజల మెప్పు పొందుతున్నారు.
Advertisement
Advertisement