మంగళవారం అర్ధరాత్రి... బెంగళూరు రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధి, ముందు కారులో రౌడీలు, వెనుక జీప్‌లో పోలీసుల చేజింగ్. ఎస్‌ఐ గురిపెట్టి తుపాకీ పేల్చాడు, కారు టైర్ పేలిపోయి ఆగిపోయింది. రౌడీలు– పోలీసుల మధ్య బాహాబాహీ. కత్తుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు. ఎస్‌ఐ మళ్లీ తుపాకీకి పనిచెప్పాడు. దుండగులకు తీవ్ర గాయాలు. సినీఫక్కీలో చేజింగ్– గోలీబార్ ఘటన అలా ముగిసింది.
సాక్షి, యశవంతపుర: ఇంటి ముందు నిలిపిన వాహనాల అద్దాలను ధ్వంసం చేసిన కేసులో నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరిని అరెస్టు చేసిన ఘటన మహలక్ష్మి లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పాత నేరస్తులు రఫిక్, సుధాకర్‌ను అరెస్టు చేశారు. కురబరహళ్లి, మహలక్ష్మి లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇటీవల ఇంటీ ముందు నిలిపిన వాహనాల అద్దాలను ధ్వంసంచేసి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఇందులో పాత నిందితులు రఫిక్, సుధాకర్‌లు ఉన్నట్లు గుర్తించారు.
దుండగుల అరెస్టుకు కార్యాచరణ
నిందితులను అరెస్టు చేయాలని ఉత్తర విభాగం డీసీపీ పలువురు ఎస్‌ఐలతో ఒక బృందాన్ని నియమించారు. మంగళవారం అర్ధరాత్రి నిందితులు రఫిక్, సుధాకర్‌ను మారుతి జెన్ కారులో తిరుగుతుండగా అనుమానం వచ్చి ఆపారు. వారు తప్పించుకోవటానికి కారును వేగంగా నడుపుతూ దూసుకెళ్లారు. దీనితో ఎస్‌ఐలు లోహిత్, మహేంద్రకుమార్, నిరంజన్ కుమార్‌లు సిబ్బందితో వెంబడించారు. వారు కారును ఆపకపోవడంతో రాజగోపాలనగర పోలీసు స్టేషన్ సరిహద్దులోని కరీంసాబ్ లేఔట్ వద్ద ఎస్‌ఐ లోహిత్ రివాల్వర్‌తో కాల్చగా నిందితుల కారు టైర్ పేలిపోయి వాహనం అక్కడే నిలిచిపోయింది.
నిందితులు కారు దిగి పారిపోతుంటే పోలీసు సిబ్బంది పట్టుకోవడానికి యత్నించారు. దీంతో దుండగులు కత్తులతో దాడి చేయగా కానిస్టేబుల్ శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ హనుమంతరాజు గాయపడ్డారు. ఎస్‌ఐ లోహిత్ అత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరపగా నిందితుల ఇద్దరి కాళ్లకు గాయాలు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీనితో రఫిక్, సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరూ ఘరానా నేరగాళ్లే
ఈ ఇద్దరూ జూన్ 17న రాత్రి ఇళ్ల ముందు నిలిపిన 14 వాహనాలు కారళ్లాటోల అద్దాలను ధ్వంసం చేసి మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి పారిపోయారు. అదే రాత్రి రాజాజీ నగరలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి సెల్‌ఫోన్, బైక్‌ను లాక్కెళ్లిన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. గతంలో కూడా జేసీ నగరలో 17 వాహనాల అద్దాలను ధ్వంసం చేసినట్లు విచారణలో తెలింది. పాత నిందితుడు సుధాకర్ 2016లో శ్రీరామపుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు. అప్పటినుంచి పోలీసులకు కళ్లకప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. వీటితో పాటు మొత్తం 18 కేసులు ఇతనిపై ఉన్నాయి. కమలనగరకు చెందిన రౌడీ రఫీక్‌పై బసవేశ్వరనగర పోలీసుస్టేషన్‌లో మూడు హత్య కేసులు, రెండు దోపిడీ, ఒక దాడికేసు, కామాక్షిపాళ్య పోలీసుస్టేషన్‌లో ఒక దొపిడీ, తావరెకెరె పోలీసుస్టేషన్ పరిధిలో హత్యకేసు, తమిళనాడులో అపహరణ కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment