సాక్షి, కంబాలచెరువు(రాజమహేంద్రవరం): బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయి. అమాయకులను బెదిరించి సొమ్ములు కాజేయడం.. వాటితో జల్సాలు చేయడం.. గంజాయి, డ్రగ్స్‌కు బానిసై గొడవలకు దిగడం, దోపిడీలు, హత్యలకు పాల్పడడం వీరికి నిత్యకృత్యమైంది. జిల్లాలోని రాజమహేంద్రవరం, తుని, అమలాపురం ప్రాంతాల్లో ఈ నేర సంస్కృతి ఎక్కువైంది. రాజమహేంద్రవరంలో గత రెండేళ్లలో బ్లేడ్ బ్యాచ్ ముఠా తగాదాలు కారణంగా ఐదు హత్యలు జరిగాయంటే వీరి ఆగడాలు ఎంత మితిమీరుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. శనివారం రాజమహేంద్రవరం ఆదెమ్మదిబ్బ వాంబేకాలనీలో జరిగిన హత్యతో మరోసారి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
రూపాయి బ్లేడే ఆయుధం..
నేర చరిత్ర గల యువకులు, కొత్తగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన రౌడీషీటర్లు, వీధి బాలల స్థాయి నుంచి ఎదిగే నేరగాళ్లు బ్లేడు బ్యాచ్‌లుగా తయారవుతున్నారు. వీరు మద్యానికి, గంజాయి దమ్ముకు బానిసై ఆ మత్తులో దాడులకు పాల్పడుతున్నారు. గతంలో రాత్రి సమయాల్లో రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల సమీపాల్లో మద్యం సేవిస్తూ ఒంటరిగా వెళ్లే ప్రయాణికులను బెదిరించి వారి వద్ద విలువైన వస్తువులు దోచుకునేవారు. ప్రస్తుతం ఈ సంస్కృతి విస్తరించి మురికివాడల్లోని యువకులు కూడా బ్లేడు బ్యాచ్‌లుగా మారుతున్నారు. రూపాయికి లభించే బ్లేడును ముక్కలుగా విరిచి వేళ్ల మధ్య పెట్టుకోవడం ఆ చేత్తో దాడికి దిగుతున్నారు. విలువైన వస్తువులు తస్కరించి క్షణాల్లో అక్కడి నుంచి పరారవుతున్నారు. నగరంలోని కొందరి పెద్దల అండదండలతో ఈ బ్లేడ్ బ్యాచ్ యువకులు చెలామణీ అవుతున్నారు.
రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో..
అనుమానాస్పద రికార్డు గలవారు : 789
రౌడీ షీటర్లు : 276
దొంగలు : 21
దోపిడీలకు పాల్పడేవారు : 33
పట్టించుకోని పోలీసులు
జిల్లాలో బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోతున్నా.. పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బ్యాచ్ ఆగడాలపై పోలీస్‌స్టేషన్లకు వెళ్లి బాధితులు ఫిర్యాదుచేస్తున్నా పెద్దగా పోలీసు అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. తిరిగి బాధితులదే తప్పు అన్నట్టుగా పోలీసుల ప్రవర్తన ఉంటోందని పలువురు అంటున్నారు. గతంలో ప్రతి నెలా రౌడీషీటర్లకు స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేవారు. ఇటీవల ఆపేశారు. వీరు ఊరు వదిలి వెళ్లినా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో చెప్పి వెళ్లాల్సి వచ్చేది. పెరుగుతున్న నేరాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు వీరిపై దృష్టి సారించి నేరాలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ముఠాల మధ్య ఆధిపత్య పోరే హత్యలకు కారణం
► గత మూడేళ్లలో రాజమహేంద్రవరంలో జరిగిన హత్యలు పరిశీలిస్తే.. ముఠాల మధ్య ఆధిపత్య పోరు, ఆర్థిక లావాదేవీల పంపకాల్లో తేడాల కారణంగానే చోటు చేసుకున్నాయి.
► రెండేళ్ల క్రితం ఆదెమ్మదిబ్బకు చెందిన ఉప్పు శివ, కంబాలపేటకు చెందిన సన్నీ ముఠాల మధ్య వివాదాలు కారణంగా ఉప్పు శివను సన్నీ వర్గం కిరాతకంగా చంపారు. దీంతో కక్ష పెంచుకున్న ప్రత్యర్థి వర్గం సన్నీని లాలాచెరువు చోడేశ్వరనగర్ ప్రాంతంలో పొడిచి చంపారు.
► నగరంలో బ్లేడు ముఠాలో ఓ ముఠాకు నాయకుడిగా ఉన్న కరణం వాసును అతడి ప్రత్యర్థి వర్గం మద్యం తాగించి పేపరుమిల్లు యార్డు సమీపంలో కిరాతకంగా హత్యచేశారు. ఆ సమయంలో హత్యకు ఉపయోగించిన ఆయు ధం పోలీసులను సైతం ముచ్చెమటలు పట్టించింది.
► బ్లేడుబ్యాచ్ యువకుడైన సన్నీ తమ్ముడు బన్నీపై పలు బెదిరింపు కేసులు ఉండడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని పోలీసులను భయబ్రాంతులకు గురిచేశాడు. ఆ సమయంలో ఒళ్లు తీవ్రంగా కాలడంతో చికిత్స పొందుతూ బన్నీ మృతి చెందాడు.
► అప్సరా థియేటర్ ప్రాంతానికి చెందిన ఓ బ్లేడు బ్యాచ్ యువకుడిపై మరో వర్గం దాడి చేయడంతో అతడు చికిత్స పొందుతూ కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందాడు. ఆ మృతదేహానికి నేర చరిత్రగల యువకులందరూ ఊరేగింపు నిర్వహిస్తుండడంతో అడ్డుకున్న ఒకటో పట్టణ ఎస్సైపై బ్లేడుతో దాడిచేసిన ఘటన అప్పట్లో సంచలనమైంది.
► ఇటీవల హత్యకు గురైన రౌడీషీటర్ వై.శ్రీను వెనుక ఉండే అనేక మంది యువకులు బ్లేడులతో దాడి చేయడంలో ఆరితేరిన వారే.
► నగరంలో కాలేజీలు, కళాశాలల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటే ఏదో ఒక వర్గం తరఫున బ్లేడ్‌బ్యాచ్ యువకులు రంగ ప్రవేశం చేసి దాడులు చేసిన ఘటనలు అనేకం.
కఠిన చర్యలు చేపట్టాం
ఇటీవల జరుగుతున్న బ్లేడ్ బ్యాచ్ దాడులపై కఠిన చర్యలు చేపడుతున్నాం ఇందులో ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఇప్పటికే తమ వద్ద 82 మంది బ్లేడ్ బ్యాచ్ అనుమానితుల చిట్టా ఉంది. వీరందరిపై దృష్టిసారించాం. ఎప్పటికప్పుడు వీరి కదలికలను తమ సిబ్బంది కనిపెడుతున్నారు. వీరిపై కేసులు నమోదు చేస్తున్నాం. అలాగే రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తాం. కరోనా కారణంగా కౌన్సెలింగ్ పక్రియ తగ్గింది. బ్లేడ్ బ్యాచ్ కదలికలపై ఎవరికైనా ఎప్పుడైనా అనుమానం వస్తే వెంటనే 100కి కాల్ చేసి తెలపండి.
– లతామాధురి, అడిషనల్ ఎస్పీ, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment