సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో వీటిని విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో బాలురు ఎక్కువ శాతం అర్హత సాధిస్తే, మెడికల్.. అగ్రికల్చర్ విభాగంలో బాలికలు ఎక్కువ మంది అర్హత పొందారు. ర్యాంకులు, మార్కులతో కూడిన ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌కు మొత్తం 1,72,238 మంది దరఖాస్తు చేశారు. 1,56,860 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది (80.41 శాతం) అర్హత సాధించారు. బాలురు 75,842 మంది అర్హత పొందితే, బాలికలు 50,298 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్..మెడికల్ ఎంసెట్‌కు 94,476 మంది దరఖాస్తు చేస్తే 80,575 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 71,180 మంది (88.34 శాతం) అర్హత సాధించారు. బాలురు 21,329 మంది, బాలికలు 49,851 మంది అర్హత పొందారు.
ఏపీ విద్యార్థులకు అగ్రశ్రేణి ర్యాంకులు
తెలంగాణ ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు అగ్రశ్రేణి ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్, మెడికల్..అగ్రికల్చర్ విభాగాలు రెండిటిలోనూ నంబర్ వన్ ర్యాంకులు వారికే దక్కాయి. అంతేకాదు టాప్‌టెన్‌లోనూ ఎక్కువమంది ఏపీ విద్యార్థులే ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎనిమిది మంది, అగ్రికల్చర్..మెడికల్ విభాగంలో ఏడుగురు ఉన్నారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఇంజనీరింగ్‌లో ఇద్దరు, మెడికల్..అగ్రికల్చర్ విభాగంలో ముగ్గురు మొదటి పది ర్యాంకుల్లో ఉన్నారు. ఫలితాలు విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాస్, జేఎన్‌టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎ.గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందనలు: సబిత
వర్షాలు, వరదల్లోనూ ఎంసెట్ నిర్వహించిన పలు ప్రభుత్వ విభాగాలకు విద్యా మంత్రి సబితా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎంసెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
ఈసెట్ ఫలితాలు విడుదల
పాలిటెక్నిక్ పూర్తిచేసి, ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు నిర్వహించిన ఈసెట్ పరీక్ష ఫలితాలను కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ పరీక్షకు 24,055 మంది దరఖాస్తు చేస్తే, 22,001 మంది పరీక్ష రాశారు. వీరిలో 19,954 మంది (90.69 శాతం) అర్హత పొందారు. కుర్చా హేమంత్ (విశాఖ), జి సాయినాగరాజు (పశ్చిమగోదావరి), కె నర్సింహనాయుడు (విశాఖ), ఇండిగ ఆకాశ్ (విశాఖ), ఐతంశెట్టి జగన్ (అనకాపల్లి) మొదటి ఐదు ర్యాంకులు పొందారు.
చదవండి: నెలనెలా కరెంట్ షాక్!
Comments
Please login to add a commentAdd a comment