ముంబై విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న రాష్ట్ర విద్యార్థినులు
సాక్షి, ముంబై/హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల తొలి బృందం శనివారం రాత్రి ముంబైకి చేరుకుంది. ప్రత్యేక విమానంలో రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో వచ్చిన ఈ బృందంలో తెలంగాణకు చెందిన 15 మంది, ఏపీకి చెందిన 10 మంది విద్యార్థులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల సహకారంతో సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నామని, ఆయా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా విద్యార్థులు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో భయాందోళనకు గురయ్యామని వారు వివరించారు.
తాము చదువుతున్న యూనివర్సిటీ, భారత ఎంబసీలు ఎప్పటికప్పుడు తమతో సంప్రదిస్తూ స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేశాయని తెలిపారు. తమను బస్సుల్లో ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించారని, రొమేనియా దేశంలోని విమానాశ్రయం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారని వెల్లడించారు. విద్యార్థులంతా శనివారం రాత్రి ముంబైలోనే బస చేశారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు విద్యార్థుల బస, భోజనం, ప్రయాణ ఏర్పాట్లు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులు హైదరాబాద్ వచ్చేందుకు విమాన టికెట్లను అందజేసింది. వారంతా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
సీఎం ఆదేశాలతో ఏర్పాట్లు చేశాం: సీఎస్ సోమేశ్
ఉక్రెయిన్ నుంచి భారత్‌కు చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులను హైదరాబాద్‌కు చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి ముంబై, న్యూఢిల్లీలకు తరలిస్తోందని.. అందులో తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్‌కు వచ్చేందుకు ఉచితంగా విమాన టికెట్లు అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఏ ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు.
తెలంగాణ విద్యార్థులు వీరే..
ముంబైకి చేరుకున్న తెలంగాణ విద్యార్థుల్లో అంతా హైదరాబాద్ నివాసులేనని అధికారులు తెలిపారు. వారిలో పెరెవేముల సౌమ్య, పింగళి దీప్తి, సూర్యవంశి సుప్రియ, పోతంశెట్టి అలేఖ్య, లావుడ్య ప్రియాంక, సాలిబండ్ల సుశాంతిప్రియ, బైరం శైలజ, బగేలికర్ ప్రియాంక, ఆలేటి హిమబిందు, ఆది రూపశ్రీ, పెరవలి హరిప్రియ, చీకోటి మానస, మల్యాల వాణి, మల్యాల సంధ్య, కె.భానుశ్రీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment