'నీట్'గా!
సాక్షి, చెన్నై : నీట్ గందరగోళానికి తెర పడడంతో రాష్ర్టంలో వైద్య విద్యా కోర్సుల సీట్ల భర్తీకి అధికార వర్గాలు చర్యలు చేపట్టాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల పర్వానికి బుధవారం శ్రీకారం చుట్టగా, గురువారం నుంచి కళాశాలల ద్వారా దరఖాస్తుల పంపిణీ సాగనున్నది. జూన్ 20వ తేదీన కౌన్సెలింగ్, ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైద్య విద్యా డెరైక్టర్ విమల ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, నీట్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడికి సీఎం జయలలిత సిద్ధమయ్యారు.
రాష్ట్రంలోని ఉన్నత విద్యా విధానం మేరకు ఇంజనీరింగ్, వైద్య కోర్సుల సీట్లను ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ సీట్లను అన్నా వర్సిటీ ద్వారా, వైద్య కోర్సుల సీట్లను ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా భర్తీ చేయడం జరుగుతోంది. ఆ మేరకు ఇప్పటికే ఇంజనీరింగ్ కోర్సుల దరఖాస్తుల విక్రయానికి శ్రీకారం చుట్టారు. ప్లస్‌టూ ఫలితాలు వెలువడటంతో ఇంజనీరింగ్‌లోని ప్రధాన కోర్సుల సీట్లను దక్కించుకోవడం లక్ష్యంగా పెద్ద ఎత్తున విద్యార్థులు దరఖాస్తుల కొనుగోలు, ఆన్‌లైన్ ద్వారా నమోదుల్లో బిజీబిజీగా ఉన్నారు.
ఇక, వైద్య కోర్సుల దరఖాస్తుల పర్వానికి నీట్ అడ్డు వచ్చినట్టు అయింది. దేశ వ్యాప్తంగా ఒకే పరీక్షా విధానం(నీట్)తో సీట్ల భర్తీ అమలుకు సుప్రీం ఆదేశాలు ఇవ్వడంతో గందరగోళం బయలు దేరింది. ఈ విధానానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఎట్టకేలకు ఈ ఏడాదికి నీట్ రద్దు అయింది. ఈ గందరగోళానికి తెర పడడంతో ఇక, దరఖాస్తుల పర్వం మీద వైద్య విద్యా డెరైక్టరేట్ దృష్టి పెట్టింది.
ఇక దరఖాస్తులు : నీట్ రద్దుతో దరఖాస్తుల పంపిణీ, ర్యాండం నంబర్లు, ర్యాంకుల జాబితా, కౌన్సెలింగ్ తదితర అంశాలపై రాష్ర్ట వైద్య విద్యా డెరైక్టర్ విమల దృష్టి పెట్టారు. ఇందుకు తగ్గ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. అలాగే, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల నమోదుకు శ్రీకారం చుట్టారు. త దుపరి మీడియాతో మాట్లాడుతూ దరఖాస్తుల మొదలు నుంచి కౌన్సెలింగ్, తరగతుల ప్రారంభానికి సంబంధించిన వివరాలను, సీట్ల వివరాలను విమల ప్రకటించారు. రాష్ట్రంలో 20 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి.
వీటిలో 2,650 సీట్లు ఉండగా, పదిహేను శాతం (397) సీట్లు జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌కు అప్పగించారు. మిగిలిన 2253 సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నది. అలాగే, ఆరు స్వయం ప్రతిపత్తి హోదా(ప్రైవేటు) కళాశాలల్లో ఉన్న 760లో ప్రభుత్వ కోటా సీట్లుగా 470, కేకేనగర్ ఈఎస్‌ఐలోని వంద సీట్లలో 65 రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్ల పరిధిలోకి రానున్నాయి. ఈ సీట్లను సైతం వైద్య విద్యా డెరైక్టరేట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో చెన్నైలోని దంత వైద్య కళాశాలలో 85 ,17 స్వయం ప్రతిపత్తి హోదా కల్గిన దంత వైద్య కళాశాలల్లో 970 సీట్లు ప్రభుత్వ కోటా కింద ఉన్నాయి. వీటిని కూడా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక, విద్యార్థులు నీట్ గురించిన ఆందోళన అవసరం లేదని, కౌన్సెలింగ్ మీద దృష్టి పెట్టాలని విమల సూచించారు.
జూన్ 20 కౌన్సెలింగ్ :
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశ నిమిత్తం దరఖాస్తుల పంపిణీకి గురువారం శ్రీకారం చుట్టనున్నారు. ఆయా కళాశాలల్లో దరఖాస్తుల్ని పంపిణీ చేయనున్నారు. రూ. ఐదు వందలు డీడీ చెల్లించి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. జూన్ ఆరో తేదీ వరకు దరఖాస్తుల పంపిణీ, ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు పూర్తి చేసిన దరఖాస్తుల్ని సమర్పించేందుకు అవకాశం కల్పించారు.జూన్ పదిహేడో తేదిన ర్యాండం నంబర్ల ప్రకటన, తదుపరి ర్యాంకుల వివరాలు, జూన్ 20 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియకు చర్యలు తీసుకున్నారు.
అవసరాన్ని బట్టి మలి విడతగా జూలై 18న కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. పూర్తి చేసిన దరఖాస్తులతో కులధ్రువీకరణ పత్రాలు, మార్కుల జాబితా నకలు తదితర పత్రాల్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, ఆన్‌లైన్ సౌకర్యంగా www.tnhealth.org వెబ్ సైట్‌ను ప్రకటించారు. కోయంబత్తూరు ఈఎస్‌ఐకు అనుమతి ఇచ్చిన పక్షంలో వంద సీట్లు అదనంగా వచ్చి చేరుతాయి. ఇందులో 65 సీట్లు రాష్ట్ర విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా చేజిక్కించుకునేందుకు వీలు ఉంది.
శాశ్వత రద్దుకు ఒత్తిడి : రాష్ట్రంలో వైద్య కోర్సుల సీట్ల భర్తీకి అధికార వర్గాలు చర్యలు చేపట్టడంతో, ఇక, నీట్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడికి సీఎం జయలలిత సిద్ధమయ్యారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగుతున్న విద్యా విధానం గురించి వివరిస్తూ, నీట్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని , తమిళనాడుకు నీట్ నుంచి శాశ్వతంగా మినహాయింపు కల్పించాలని కోరారు.