నీట్ నిర్వహణను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశానికి సంబంధించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్డినెన్సు చూసిన తర్వాత ఈ అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ 'సాక్షి'కి తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కోర్సులకు కూడా ఎంసెట్ నిర్వహించారు. ఫలితాలు, ర్యాంకులను మాత్రం విడుదల చేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు, అధికారులతో చర్చించి శనివారం ఉదయం 11- 12 గంటల మధ్యలో కీలక నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ కాలేజీలలో ఉన్నట్లుగానే ప్రైవేటు వైద్య కళాశాలల్లో కూడా కన్వీనర్ కోటా ప్రవేశాలను ఎంసెట్ ద్వారా పూర్తిచేయాలని తాము కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. ఈ అంశంపై ఆర్డినెన్సులో కేంద్రం ఏం చెప్పిందో చూసి.. అప్పుడు నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ఆ వివరాలు చూసిన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఇక వచ్చే సంవత్సరం నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన విద్యార్థులను సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు. సీఎం సమక్షంలో విద్యాశాఖతో చర్చించి ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ఎలా తేవాలో నిర్ణయిస్తామన్నారు. వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే నీట్‌కు తాము సిద్ధమవుతామంటూ రాష్ట్ర ప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇచ్చిందని, ఆ విషయం కూడా తమకు తెలియదని అన్నారు.
ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు జె.పి.నడ్డా, వెంకయ్యనాయుడుల ప్రత్యేక చొరవ వల్లే నీట్‌పై ఆర్డినెన్స్ జారీ అయ్యిందని, సీఎం చంద్రబాబు ఈ అంశంపై మూడుసార్లు కీలక సమావేశాలు నిర్వహించి కేంద్రానికి ఏపీ అభ్యర్ధనను తెలియజేశారని చెప్పారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, తమ ప్రార్థనను కేంద్ర ఆలకించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక తెలంగాణలో నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే ఎంసెట్ నిర్వహించడం, అందులో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు పరీక్ష నిర్వహించకపోవడంతో.. ఇప్పుడు మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విషయంపై కూడా ఆర్డినెన్సు చూసిన తర్వాత ప్రభుత్వ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి 'సాక్షి'కి తెలిపారు. కేంద్రం ఎంతవరకు వెసులుబాటు ఇచ్చిందో పరిశీలించిన తర్వాత తదుపరి విషయాలపై నిర్ణయిస్తామన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ ప్రవేశాలు ఎలా?
Published Fri, May 20 2016 12:34 PM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement
Advertisement