రండి బాబూ.. రండి!
►విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాలల ఎర్ర తివాచీ
►ఏ గ్రేడ్ కళాశాలల్లో 90 శాతం సీట్లు భర్తీ
►పలు కళాశాలల్లో 100 లోపు సీట్లే భర్తీ
►తుది విడత కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్న యాజమాన్యాలు
గుంటూరు ఎడ్యుకేషన్: కన్వీనర్ కోటాలోని ఇంజినీరింగ్ సీట్లే అరకొరగా భర్తీ అవటంతో జిల్లాలోని చాలా కళాశాలల యూజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. విద్యార్థులను ఆకర్షించటానికి నానాపాట్లూ పడుతున్నారుు. ఎలాగోలా సీట్లు భర్తీ అయ్యేలా చూసుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారుు. రండి బాబూ.. రండంటూ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నారుు. ఎంసెట్ ర్యాంకుల వారీగా విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల జాబితా వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం రాత్రి ఎంసెట్ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. జిల్లాలో 41 ఇంజినీరింగ్ కళాశాలు ఉండగా టాప్ టెన్ కళాశాలల్లో మాత్రమే దాదాపు 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. బీ, సీ గ్రేడ్ కళాశాలల్లో సగానికి మించి భర్తీ కాలేదు. ఇటీవల ప్రారంభించిన కళాశాలల్లో సీట్లు భర్తీకి నోచుకోకపోవడం యాజమాన్యాలకు షాకిచ్చింది. పీఆర్వోలను నియమించుకుని భారీఎత్తున ప్రచారం చేపట్టినా ఫలితం లేకపోవడంతో అవి తలలు పట్టుకుంటున్నాయి. కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి కళాశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాల పరిస్థితి మరింత దయనీయంగా తయూరైంది.
అధ్యాపకులు, బోధన వసతులు, ఉత్తీర్ణత శాతం, ఉద్యోగ అవకాశాల కల్పనలో కళాశాలల ట్రాక్ రికార్డ్‌పై విద్యార్థులు దృష్టి సారించడంతో చాలా కళాశాలలు తొలి దశ కౌన్సెలింగ్‌లో అసలు బోణీ కొట్టలేదు. పదుల సంఖ్యలోని కళాశాలల్లో అన్ని విభాగాల్లో కలిపి 50 నుంచి 100 లోపు సీట్లే భర్తీ అయినట్లు తెలుస్తోంది. దీంతో మలి విడత కౌన్సెలింగ్‌పైనే యూజమాన్యాలు ఆశలు పెట్టుకున్నాయి.
జిల్లాలో 19,250 మంది ఎంసెట్ రాయగా నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో గత నెల 7న మొదలై 23న ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలనకు 8,839 మంది హాజరయ్యారు. జిల్లాలో కాకినాడ జేఎన్‌టీయూ, ఏఎన్‌యూ పరిధిలో ఉన్న 41 కళాశాలల్లో దాదాపు 16 వేల సీట్లు ఉన్నాయి. అలాట్‌మెంట్ ఆర్డర్ పొందిన విద్యార్థులు సీటును ధ్రువీకరించుకునేందుకు సోమవారం నుంచి ఆయూ హెల్ప్‌లైన్ కేంద్రాల కు హాజరుకావాలి. అక్కడి కోఆర్డినేటర్ నుంచి సీటు కేటాయింపు ధ్రువీకరణపత్రం పొందాలి.
హెల్ప్‌లైన్ కేంద్రాల్లో పొందిన సీటు కేటాయింపు ధ్రువీకరణ పత్రం, ఫీజు చెల్లింపు రసీదును సెప్టెంబర్ 6వ తేదీలోగా ఆయా కళాశాలల్లో సమర్పించాలి. లేనిపక్షంలో సీటు రద్దవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగిన విద్యార్థులకు రూ.35 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజు మొత్తం రూ. 35 వేలు ఉంటే విద్యార్థి కళాశాలకు ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదు.తమకు కేటాయించిన కళాశాలలో చేరేందుకు ఆసక్తి లేని పక్షంలో విద్యార్థులు వెళ్లనవసరం లేదు. వీరు మలి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు.