మీసేవ.. మా ఇష్టం!.
కేంద్రాల్లో అనర్హులు
- కేటాయింపులో నిబంధనలు బేఖాతరు
- బినామీల నిర్వహణతో అస్తవ్యస్తం
- పల్లెల పేరిట మంజూరు.. పట్టణాల్లో ఏర్పాటు
- 60 కేంద్రాల్లో ఒక్క కంప్యూటరే దిక్కు
- సేవల్లో జాప్యంతో ప్రజల బేజారు
కర్నూలు(కలెక్టరేట్): మీసేవ కేంద్రాల్లో బినామీలు పాగా వేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఉద్దేశించిన ఈ కేంద్రాల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 287 మీసేవ కేంద్రాలను నిర్వహిస్తుండగా అధిక శాతం ఎలాంటి అర్హత లేని వ్యక్తుల చేతుల్లో ఉండటం గమనార్హం. పలుకుబడి.. పైరవీలతో దక్కించుకున్న కేంద్రాలను చాలా మంది లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం డిగ్రీ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన నిరుద్యోగులకే వీటిని కేటాయించాల్సి ఉంది. అయితే 10వ తరగతి చదివి కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం లేని వ్యక్తులకు సైతం మీసేవ కేంద్రాలను కట్టబెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
హెచ్‌సీఎల్‌కు సంబంధించి అర్బన్‌లో 12, ఇతర ప్రాంతాల్లో 54 కేంద్రాలు ఉండగా.. 10 సెంటర్లను బినామీలకు కట్టబెట్టారు. సీఎంఎస్ నిర్వహణలోని మీసేవ కేంద్రాలు 178 ఉండగా.. 50 వరకు ఇతరుల చేతుల్లో ఉన్నట్లు సమాచారం. ఏపీ ఆన్‌లైన్‌కు సంబంధించిన కేంద్రాలు 55 ఉండగా.. సగం వరకు బినామీలే నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మీసేవ కేంద్రాలు ఏ గ్రామానికి మంజూరైతే అక్కడే ఏర్పాటు చేయాలనే నిబంధనను కాలరాశారు. గ్రామాల పేరుతో అనుమతి పొంది పట్టణాల్లో నిర్వహిస్తుండటంతో గ్రామీణులకు నిరాశే ఎదురవుతోంది. ఆదోని మండలంలోని సాదాపురం, బసాపురం గ్రామాలకు మీసేవ కేంద్రాలు మంజూరు కాగా.. వీటిని ఆదోని పట్టణంలో ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇలాంటి అక్రమాలు అనేకం చోటు చేసుకున్నా అడిగే నాథుడే కరువయ్యాడు.
ఇక మీసేవ కేంద్రాల్లో తగినంత మంది ఆపరేటర్లను నియమించకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. హెచ్‌సీఎల్‌కు చెందిన అర్బన్ కేంద్రాల్లో పని ఒత్తిడి అధికంగా ఉన్నా అందుకు తగినట్లుగా ఆపరేటర్లను నియమించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ఆన్‌లైన్, సీఎంఎస్ సెంటర్లలోనూ తగినన్ని కంప్యూటర్లు లేకపోవడంతో సేవల్లో జాప్యం జరుగుతోంది. ఒకే సిస్టంతో పని చేస్తున్న మీసేవ కేంద్రాలు జిల్లాలో 60 వరకు ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.