- వరంగల్, హన్మకొండ, మహబూబూబాద్, జనగామలో ప్రారంభం
- అందుబాటులోకి రానున్న 225 రకాల సేవలు
- మున్ముందు ఏటీఎంలు కూడా..
ఇన్నాళ్లూ ఉత్తరాల బట్వాడాకే పరిమితమైన పోస్టల్‌శాఖ ఇప్పుడు తన రూటు మార్చుకుంది. రకరకాల సేవలతో ముందుకు దూసుకుపోతోంది. బహుముఖ సేవలతో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పోస్టాఫీసుల్లో మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్ముందు ఏటీఎం సేవలను కూడా అందించేందుకు సిద్ధమవుతోంది.
పోచమ్మమైదాన్ : రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తి రగాల్సిన అవసరం లేకుండా, ముడుపులు, సిఫారుసుల తో పనిలేకుండా పలు రకాల ధ్రువపత్రాలను ఒకేచోట అందించేందుకు వీలుగా మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రభుత్వశాఖలు జారీచేసే ధ్రవపత్రాలన్నీ ఒకేచోట లభ్యం కావడం, ప్రతీ పనికి నిర్ధి ష్ట గడువు ఉండడంతో మీ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో ఇటీవల పోస్టాఫీసుల్లోనూ మీసేవ కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో టెలిఫోన్ బిల్లులు, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు తీసుకుంటున్నారు. త్వరలో రెవెన్యూ, పోలీసుశాఖ, మునిసిప ల్, పౌరసరఫరాల శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పరిశ్రమలు, వాణిజ్య, విద్యా, మైనింగ్, జియాలజీ, కార్మిక, వ్య వసాయ శాఖల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అందుబాటులోకి రానున్న 225 సేవలు
పౌర సేవలను ప్రజలకు అతి సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ సేవ కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఇక పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాల ద్వారా 15శాఖలకు సంబంధించిన 225 రకాల సేవలను ప్రజలకు అందించనున్నారు. రెవెన్యూశాఖ నుంచి 55, మునిసిపల్ శాఖ 22, స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ 12, పోలీస్‌శాఖ 4, రవాణాశాఖ 4, విద్యాశాఖ 4, కార్మికశాఖ 4, సాధారణ పరిపాలన శాఖ 4, సమాచార సాంకేతిక, కమ్యూనికేషన్‌శాఖ 11, పౌరసరఫరాలశాఖ 3, భారీ పరిశ్రమలశాఖ 4, మైనింగ్, జియాలజీ శాఖ 7, వ్యవసాయశాఖ 2, విద్యుత్‌శాఖకు సంబంధించిన 4 రకాల సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సేవలు అందించేందుకే..
ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు పోస్టాఫీసులలో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇటీవల మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సాధారణ సేవలు ప్రారంభించాం. మరో వారం రోజుల్లో సాధారణ సేవల్లోని అన్ని సేవలను పోస్టాఫీసులలో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాల ద్వారా అందిస్తాం.
- శ్రీనివాస్
డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్, వరంగల్
కేంద్రాలు ఇవే..
వరంగల్‌లోని హెడ్ పోస్టాఫీస్, హన్మకొండ డిపో క్రాస్‌లోని హెడ్ పోస్టాఫీస్, మహబూబాద్‌లోని హెడ్ పోస్టాఫీస్, జనగామలోని హెడ్ పోస్టాఫీస్‌లలో కేంద్ర ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది.