Geology
-
ఏయూలో జియోలాజికల్ ఎగ్జిబిషన్
ఏయూ క్యాంపస్: విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ విభాగంలో ఏయూ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) విశాఖ ప్రాంతీయ కేంద్రం సంయుక్తంగా శనివారం ఏర్పాటు చేసిన జియోలాజికల్ ఎగ్జిబిషన్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో అరుదైన శిలాజాలను సేకరించే అలవాటు కలిగిన కందుల వెంకటేష్ కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న చేప శిలాజం, నత్త గుల్లలు, శంఖాలను, డైనోసార్ల శిలాజాలను, కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన జీవుల శిలాజాలను, అంతరిక్షం నుంచి భూమిని ఢీకొట్టిన ఉల్క శకలం, భూమి లోపల సహజ సిద్ధంగా ఏర్పడిన అరుదైన, అందమైన ఖనిజాలను ప్రదర్శించారు. ప్రముఖ ఛాయాచిత్ర గ్రాహకుడు బీకే అగర్వాల్ విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ జియో డైవర్సిటీ కలిగిన ప్రాంతాల చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత మాట్లాడుతూ శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన విద్యార్థుల్లో ఉత్సుకతను కలిగిస్తుందన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ..ఈ ఎగ్జిబిషన్లో అరుదైన మినరల్స్, శిలలు ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా లభించే అరుదైన శిలలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం విద్యార్థులకు ఏర్పడిందన్నారు. ఇంటాక్ విశాఖ కన్వీనర్ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. యునెస్కో అక్టోబర్ 6 ను ఇంటర్నేషనల్ జియో డైవర్సిటీ డేగా ప్రకటించిందని వెల్లడించారు. నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు. -
భూములే కాదు.. ఆస్తుల సర్వే జరగాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తేవడం ద్వారా భూవివాదాలకు పరిష్కారం చూపాలన్న ఆలోచనతో ముందుకెళ్తోంది. ఇందుకోసం ‘ధరణి’వెబ్‌సైట్‌ను కీలక ప్రామాణికం చేయబోతోంది. ఇకపై భూ లావాదేవీలన్నీ ఈ రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగానే జరగనున్నాయి. భూమి ఏ విధంగా బదలాయింపు జరిగినా వ్యవసాయ భూములైతే తహసీల్దార్, వ్యవసాయేతర భూములైతే సబ్రిజిస్ట్రార్లు హక్కులను బదలాయిస్తారు. ఇందుకోసం ధరణి పోర్టల్‌ను సమగ్రంగా తీర్చిదిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ఈ ధరణి పోర్టల్ భూమి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తుందా అనేదే పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్‌లోని లోపాలు, హక్కుల విషయంలో ఎదురయ్యే చిక్కులు, ప్రభుత్వం చేయాల్సిన మార్పు చేర్పులపై భూహక్కుల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.సునీల్ కుమార్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. హక్కుల రికార్డులపై.. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం, 2020 (కొత్త ఆర్వోఆర్ చట్టం) ప్రకారం ధరణి వెబ్సైట్లో ఉన్న వివరాలనే హక్కుల రికార్డుగా పరిగణిస్తారు. అదే పాత చట్టం ప్రకారం కేవలం 1బీ రికార్డులను మాత్రమే ధరణిలో అప్లోడ్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఇదే హక్కుల రికార్డు అవుతుంది. ధరణిలో మార్పుచేర్పులకు కొత్త చట్టంలో అవకాశం లేదు. సాధారణంగా ఏ హక్కుల రికార్డుల చట్టంలోనైనా ఒకసారి రూపొందించిన హక్కుల రికార్డులో సవరణకు కొంత సమయం ఇస్తారు. పాత ఆర్ఓఆర్ చట్టంలో కూడా సవరణలకు ఒక సంవత్సరం సమయం ఇచ్చారు. కానీ ఇలాంటి నిబంధన కొత్త చట్టంలో లేదు. భూరికార్డుల ప్రక్షాళనలో రికార్డులను సరిచేశామని, 90 శాతానికి పైగా రికార్డులు సరిగ్గానే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ పట్టాదారు పాసుపుస్తకం రాని వారు మళ్లీ కొత్త చట్టం కింద తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా వివాదముంటే సివిల్ కోర్టును ఆశ్రయించాల్సిందే.. గతంలో లాగా రెవెన్యూ కోర్టుల్లో కేసు వేసే అవకాశం లేదు. హక్కు పత్రాలపై.. దేశ ప్రజలకున్న సంపద 70 శాతానికి పైగా భూమే.. కానీ, ఆ భూమికి ఉండాల్సిన దస్త్రాలు, రికార్డులు లేకపోవడం వలన దాన్ని భూయజమాని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాడు. రుణం పొందాలన్నా, ప్రభుత్వం రైతుకు ఇచ్చే ఏ మేలు దక్కాలన్నా హక్కు పత్రాలు లేకుంటే సాధ్యం కాదు. కాగితాలు లేని భూములు నిరర్థక ఆస్తులుగానే మిగిలిపోతాయి. ప్రభుత్వం చెప్పినట్టుగా యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తే ప్రజల సంపదకు విలువ వస్తుంది. హక్కుల చిక్కులు తీరుతాయి. వివాదాలూ తగ్గుతాయి. సర్వే చేసి ఈ పుస్తకాలు ఇవ్వడం మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని చిక్కులు వచ్చే ప్రమాదముంది. ఈ సమస్యలన్నింటి పరిష్కారానికి ఏకైక మార్గం సమగ్ర సర్వేనే.. ఇది భూ సమస్యల సర్వరోగ నివారిణి. సర్వే చేసి కొత్త రికార్డులు రూపొందించుకోవాలి. ఆ రికార్డులకు ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉండాలి. కనీసం పాత చట్టంలాగా హక్కుల రికార్డుల్లోని వివరాలు సరైనవేనని కూడా ఈ చట్టం చెప్పడం లేదు. కాబట్టి ధరణిలో సవరణలకు ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వాల్సిందే. వ్యవసాయేతర భూములపై.. వ్యవసాయేతర భూముల వివరాలు కూడా ధరణిలో నమోదు చేయబోతున్నారు. గ్రామ, నగర పాలక సంస్థల పరిధిలో ఉన్న ఆస్తుల వివరాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నమోదైన వివరాలను కలిపి ఒక సమగ్ర వ్యవసాయేతర ఆస్తుల జాబితాను రూపొందిస్తారు. వాటి ఆధారంగానే ఆస్తుల లావాదేవీలు జరు గుతాయి. వ్యవసాయేతర ఆస్తు ల సమగ్ర వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. ఆబాదీ/గ్రామ కంఠాలలో సర్వే జరగలేదు. ఇప్పుడు గ్రామాలు ఈ ఆబాదీ దాటి వ్యవసాయ భూముల్లోకి విస్తరించాయి. దేశంలో దాదాపు ఏడు లక్షల గ్రామాలను నాలుగేళ్లలో సర్వే చేసి ఇంటి స్థలాలకు కార్డులు ఇవ్వడం కోసం కేంద్రం ‘స్వామిత్వా’పేరుతో కొత్త పథకం ప్రారంభించింది. రాష్ట్రం కూడా ఈవైపు ఆలోచించాలి. ధరణిలో తప్పొప్పులపై.. విస్తీర్ణంలో వ్యత్యాసం, భూ వివాదాలు, క్రమబద్ధీకరణ జరగని సాదా బైనామాలు, లావోని పట్టా కొనుగోళ్లు ఇలా పలు కారణాల వలన ధరణి వెబ్సైట్లో నమోదు కాని భూయజమానులు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఎక్కినా పాసు పుస్తకం రికార్డుల్లో ఉన్న సర్వే నంబర్, క్షేత్రస్థాయిలో పొజిషన్లో ఉన్న సర్వే నంబర్‌కూ తేడా ఉన్న కేసులూ ఉన్నాయి. దీన్ని వైవట్ కబ్జా అంటారు. పట్టా భూమి అయి ఉండి కూడా నిషేధిత భూములు (22ఏ) జాబితాలో ఉండటంతో కొత్త పట్టా పాసుపుస్తకాలు రాని వారూ ఉంటారు. ఇలాంటి తప్పులు సరిదిద్దాలన్నా, సమస్యలకు దాదాపు పరిష్కారం కావాలన్నా భూముల సమగ్ర సర్వే తప్పనిసరి. సర్వే చేసి కొత్తగా రికార్డులు రూపొందించుకోవడమే సమస్యకు శాశ్వత పరిష్కారం. సర్వే జరిగే లోపు ధరణిలో సవరణలకు మరో అవకాశం ఇవ్వాలి. ఒక్కసారైనా రికార్డులను మ్యాన్యువల్‌గా రాసి ఆ తర్వాత ధరణిలో నమోదు చేస్తే తప్పులు సరిచేయొచ్చు. -
భూగర్భ ప్రయాణం సాకారం
18.01 కిలోమీటర్లు, 17 మెట్రో స్టేషన్లు ప్రయాణ సమయం 33 నిమిషాలు పది రోజుల్లో అందుబాటులోకి బెంగళూరు: భూగర్భంలో ప్రయాణించాలనే బెంగళూరు నగరవాసుల కల సాకారం కానుంది. ఈమేరకు బయ్యపనహళ్లి నుంచి మైసూరు రోడ్డు వరకూ భూగర్భం, భూ ఉపరితలంలో నిర్మించిన రైలు మార్గంగుండా ప్రయాణికులను తీసుకువెళ్లడానికి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్సీఎల్)కు రైల్వే సేఫ్టీ కమిషనర్ తన సంసిద్ధత వ్యక్తం చేశారు. బెంగళూరు నగరంలో ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణానికి ప్రస్తుతం దాదాపు ముప్పావుగంట సమయం, రూ.120 ఖర్చవుతోంది. నమ్మ మెట్రో నిర్మించిన భూగర్భ మార్గంలో రూ.40 ఖర్చుతో 18.1 కిలోమీటర్లను 33 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈస్ట్ (బయ్యపనహళ్లి), వెస్ట్ (మైసూరు రోడ్డు) కారిడార్లను కలుపుతూ నిర్మించిన మెట్రో రైలు మార్గం మరో పదిరోజుల్లో అందుబాటులోకి రానుంది. మొత్తం 18.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ మార్గంలో మొత్తం 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఇందులో కబ్బన్‌పార్క్ (మానిస్క్ స్క్వెయర్), విధానసౌధ, విశ్వేశ్వరయ్య (సెంట్రల్ కాలేజ్), కెంపేగౌడ (మెజెస్టిక్), సీటీ రైల్వే స్టేషన్లు భూ గర్భంలో ఉన్నాయి. గరిష్టంగా 1.2 కిలోమీటర్ల మధ్య దూరం ఉన్న ఈ స్టేషన్ల మధ్య రైలు సగటున గంటకు 38 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు చేరడానికి 1.5 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కొక్క స్టేషన్లలో 30 సెకెనుల పాటు రైలు ఆగుతుంది. ఈ దిశలో ఎనిమిది రైళ్లు నడువనున్నాయి. ప్రతి పది నిమిషాలకు ఒక ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఒక్కొక్క ట్రైన్లో మూడు కోచ్‌లు ఉండగా, ఒక్కొక్క కోచ్‌లో 50 సీట్లు ఉంటాయి. ఈ విషయమై బీఎంఆర్సీఎల్ ఫైనాన్స్ విభాగం జనరల్ మేనేజర్ యూ.ఏ వసంత్‌రావ్ మాట్లాడుతూ...ఈస్ట్, వెస్ట్ కారిడార్ మధ్య వ్యాపార కేంద్రమైన సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ ఉంది. ముఖ్యంగా అనేక షాపింగ్‌మాల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలయాలతో పాటు ఈ మార్గంలోనే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. అందువల్ల ఈ ఏడాది చివరి నాటికి ఈస్ట్, వెస్ట్ కారిడార్ మార్గం ద్వారా ఐదు లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తారని భావిస్తున్నాం. అన్ని రకాల అనుమతులు లభించినందువల్ల మరో పదిరోజుల్లోపు ఈ మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నాం.’ అని పేర్కొన్నారు. -
పోస్టాఫీసులో ‘మీ సేవ’
వరంగల్, హన్మకొండ, మహబూబూబాద్, జనగామలో ప్రారంభం అందుబాటులోకి రానున్న 225 రకాల సేవలు మున్ముందు ఏటీఎంలు కూడా.. ఇన్నాళ్లూ ఉత్తరాల బట్వాడాకే పరిమితమైన పోస్టల్‌శాఖ ఇప్పుడు తన రూటు మార్చుకుంది. రకరకాల సేవలతో ముందుకు దూసుకుపోతోంది. బహుముఖ సేవలతో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పోస్టాఫీసుల్లో మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్ముందు ఏటీఎం సేవలను కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. పోచమ్మమైదాన్ : రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తి రగాల్సిన అవసరం లేకుండా, ముడుపులు, సిఫారుసుల తో పనిలేకుండా పలు రకాల ధ్రువపత్రాలను ఒకేచోట అందించేందుకు వీలుగా మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రభుత్వశాఖలు జారీచేసే ధ్రవపత్రాలన్నీ ఒకేచోట లభ్యం కావడం, ప్రతీ పనికి నిర్ధి ష్ట గడువు ఉండడంతో మీ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో ఇటీవల పోస్టాఫీసుల్లోనూ మీసేవ కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో టెలిఫోన్ బిల్లులు, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు తీసుకుంటున్నారు. త్వరలో రెవెన్యూ, పోలీసుశాఖ, మునిసిప ల్, పౌరసరఫరాల శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పరిశ్రమలు, వాణిజ్య, విద్యా, మైనింగ్, జియాలజీ, కార్మిక, వ్య వసాయ శాఖల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అందుబాటులోకి రానున్న 225 సేవలు పౌర సేవలను ప్రజలకు అతి సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ సేవ కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఇక పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాల ద్వారా 15శాఖలకు సంబంధించిన 225 రకాల సేవలను ప్రజలకు అందించనున్నారు. రెవెన్యూశాఖ నుంచి 55, మునిసిపల్ శాఖ 22, స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ 12, పోలీస్‌శాఖ 4, రవాణాశాఖ 4, విద్యాశాఖ 4, కార్మికశాఖ 4, సాధారణ పరిపాలన శాఖ 4, సమాచార సాంకేతిక, కమ్యూనికేషన్‌శాఖ 11, పౌరసరఫరాలశాఖ 3, భారీ పరిశ్రమలశాఖ 4, మైనింగ్, జియాలజీ శాఖ 7, వ్యవసాయశాఖ 2, విద్యుత్‌శాఖకు సంబంధించిన 4 రకాల సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సేవలు అందించేందుకే.. ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు పోస్టాఫీసులలో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇటీవల మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సాధారణ సేవలు ప్రారంభించాం. మరో వారం రోజుల్లో సాధారణ సేవల్లోని అన్ని సేవలను పోస్టాఫీసులలో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాల ద్వారా అందిస్తాం. - శ్రీనివాస్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్, వరంగల్ కేంద్రాలు ఇవే.. వరంగల్‌లోని హెడ్ పోస్టాఫీస్, హన్మకొండ డిపో క్రాస్‌లోని హెడ్ పోస్టాఫీస్, మహబూబాద్‌లోని హెడ్ పోస్టాఫీస్, జనగామలోని హెడ్ పోస్టాఫీస్‌లలో కేంద్ర ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
భూగర్భాన్వేషకుడు.. జియాలజిస్ట్
అప్‌కమింగ్ కెరీర్: భూగర్భం... అపారమైన ఖనిజ సంపద, ముడి చమురు, సహజ వాయువు, జల వనరులకు నిలయం. భూగర్భ సంపద మెండుగా ఉన్న దేశాలు ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఎదిగాయి. అనతికాలంలోనే సంపన్న దేశాలుగా అవతరించాయి. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు ఊహించనంతగా పెరిగాయి. దేశ ముఖచిత్రాన్ని మార్చేసే శక్తి భూగర్భ సంపదకు ఉంది. అలాంటి సంపదను అన్వేషించి, వెలికితీసేవారే జియాలజిస్ట్‌లు. ఎదుగుదలకు లెక్కలేనన్ని అవకాశాలు ఉన్న కెరీర్.. జియాలజిస్ట్. భూగర్భాన్వేషణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. దీంతో జియాలజిస్ట్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ రంగంపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో జియాలజీ కోర్సులను అభ్యసించిన నిపుణుల కొరత కంపెనీలను వేధిస్తోంది. మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చమురు, గ్యాస్ వెలికితీత ఊపందుకుంటోంది. మైనింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందింది. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. జియాలజిస్ట్‌లకు అధిక వేతనాలు ఇచ్చి నియమించుకుంటున్నాయి. జియాలజిస్ట్‌లకు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. జియాలజీలో ఎంఎస్సీ పూర్తిచేయగానే ఉద్యోగం సిద్ధంగా ఉంటోంది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థల్లో, మైనింగ్ శాఖల్లో అవకాశాలు సులువుగా దక్కుతున్నాయి. రిలయన్స్, హిందూస్థాన్ జింక్ లిమిటెడ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రముఖ సంస్థల్లోనూ మంచి అవకాశాలున్నాయి. కాలేజీలు/యూనివర్సిటీల్లోనూ ఫ్యాకల్టీగా, పరిశోధకులుగానూ సేవలందించొచ్చు. అర్హతలు మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత జియాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరొచ్చు. అనంతరం మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ కూడా చేస్తే ఉద్యోగావకాశాలు సులభంగా పొందొచ్చు. వేతనాలు ఎంఎస్సీ డిగ్రీ ఉన్న జియాలజిస్ట్కు రూ.5 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. పరిజ్ఞానం, పనితీరును బట్టి జీతభత్యాలు ఉంటాయి. ప్రారంభంలో నెలకు సగటున రూ.25 వేల దాకా వేతనం అందుకోవచ్చు. అంతర్జాతీయ చమురు, గ్యాస్ కంపెనీలో చేరితే నెలకు రూ.లక్షన్నర దాకా పొందొచ్చు. జియాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు - ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.osmania.ac.in/ - ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.andhrauniversity.edu.in/ - నాగార్జునా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.nagarjunauniversity.ac.in/ - ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్ వెబ్సైట్: http://www.ismdhanbad.ac.in/ - సెంటర్ ఫర్ ఎర్త్ సెన్సైస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు వెబ్సైట్: http://www.ceas.iisc.ernet.in/ అన్వేషణతో అద్భుత ఫలం ‘‘భూ అంతరాల్లో దాగిన ఖనిజాల అన్వేషణలో జియాలజిస్టుల భాగస్వామ్యం తప్పనిసరి. ఇటీవలి కాలంలో జియాలజీ కోర్సులకు డిమాండ్ పెరిగింది. జియాలజిస్ట్‌లకు అవకాశాలు పెరగడమే ఇందుకు కారణం. ప్రభుత్వ, ప్రైవేట్ మైనింగ్ సంస్థలు గనుల తవ్వకాలకు, ఖనిజాల వెలికితీతకు నిపుణులను నియమించుకుంటున్నాయి. జియాలజిస్ట్‌లకు మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. శ్రమించగల తత్వం, ఓర్పు ఉన్న వారికి ఇది బెస్ట్ కెరీర్’’ - డాక్టర్ ఎం.మురళీధర్, జియాలజీ విభాగ అధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం