భూములే కాదు.. ఆస్తుల సర్వే జరగాలి   | Sakshi Special Interview With Geology Expert M Sunil Kumar | Sakshi
Sakshi News home page

భూములే కాదు.. ఆస్తుల సర్వే జరగాలి  

Published Mon, Oct 5 2020 4:42 AM | Last Updated on Mon, Oct 5 2020 4:42 AM

Sakshi Special Interview With Geology Expert M Sunil Kumar

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తేవడం ద్వారా భూవివాదాలకు పరిష్కారం చూపాలన్న ఆలోచనతో ముందుకెళ్తోంది. ఇందుకోసం ‘ధరణి’వెబ్‌సైట్‌ను కీలక ప్రామాణికం చేయబోతోంది. ఇకపై భూ లావాదేవీలన్నీ ఈ రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగానే జరగనున్నాయి. భూమి ఏ విధంగా బదలాయింపు జరిగినా వ్యవసాయ భూములైతే తహసీల్దార్, వ్యవసాయేతర భూములైతే సబ్‌రిజిస్ట్రార్‌లు హక్కులను బదలాయిస్తారు. ఇందుకోసం ధరణి పోర్టల్‌ను సమగ్రంగా తీర్చిదిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ఈ ధరణి పోర్టల్‌ భూమి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తుందా అనేదే పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్‌లోని లోపాలు, హక్కుల విషయంలో ఎదురయ్యే చిక్కులు, ప్రభుత్వం చేయాల్సిన మార్పు చేర్పులపై భూహక్కుల నిపుణుడు, నల్సార్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎం.సునీల్‌ కుమార్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

హక్కుల రికార్డులపై.. 
ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం, 2020 (కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం) ప్రకారం ధరణి వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలనే హక్కుల రికార్డుగా పరిగణిస్తారు. అదే పాత చట్టం ప్రకారం కేవలం 1బీ రికార్డులను మాత్రమే ధరణిలో అప్‌లోడ్‌ చేశారు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఇదే హక్కుల రికార్డు అవుతుంది. ధరణిలో మార్పుచేర్పులకు కొత్త చట్టంలో అవకాశం లేదు. సాధారణంగా ఏ హక్కుల రికార్డుల చట్టంలోనైనా ఒకసారి రూపొందించిన హక్కుల రికార్డులో సవరణకు కొంత సమయం ఇస్తారు. పాత ఆర్‌ఓఆర్‌ చట్టంలో కూడా సవరణలకు ఒక సంవత్సరం సమయం ఇచ్చారు. కానీ ఇలాంటి నిబంధన కొత్త చట్టంలో లేదు. భూరికార్డుల ప్రక్షాళనలో రికార్డులను సరిచేశామని, 90 శాతానికి పైగా రికార్డులు సరిగ్గానే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ పట్టాదారు పాసుపుస్తకం రాని వారు మళ్లీ కొత్త చట్టం కింద తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా వివాదముంటే సివిల్‌ కోర్టును ఆశ్రయించాల్సిందే.. గతంలో లాగా రెవెన్యూ కోర్టుల్లో కేసు వేసే అవకాశం లేదు. 

హక్కు పత్రాలపై.. 
దేశ ప్రజలకున్న సంపద 70 శాతానికి పైగా భూమే.. కానీ, ఆ భూమికి ఉండాల్సిన దస్త్రాలు, రికార్డులు లేకపోవడం వలన దాన్ని భూయజమాని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాడు. రుణం పొందాలన్నా, ప్రభుత్వం రైతుకు ఇచ్చే ఏ మేలు దక్కాలన్నా హక్కు పత్రాలు లేకుంటే సాధ్యం కాదు. కాగితాలు లేని భూములు నిరర్థక ఆస్తులుగానే మిగిలిపోతాయి. ప్రభుత్వం చెప్పినట్టుగా యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తే ప్రజల సంపదకు విలువ వస్తుంది. హక్కుల చిక్కులు తీరుతాయి. వివాదాలూ తగ్గుతాయి. సర్వే చేసి ఈ పుస్తకాలు ఇవ్వడం మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని చిక్కులు వచ్చే ప్రమాదముంది. ఈ సమస్యలన్నింటి పరిష్కారానికి ఏకైక మార్గం సమగ్ర సర్వేనే.. ఇది భూ సమస్యల సర్వరోగ నివారిణి. సర్వే చేసి కొత్త రికార్డులు రూపొందించుకోవాలి. ఆ రికార్డులకు ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉండాలి. కనీసం పాత చట్టంలాగా హక్కుల రికార్డుల్లోని వివరాలు సరైనవేనని కూడా ఈ చట్టం చెప్పడం లేదు. కాబట్టి ధరణిలో సవరణలకు ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వాల్సిందే.  

వ్యవసాయేతర భూములపై.. 
వ్యవసాయేతర భూముల వివరాలు కూడా ధరణిలో నమోదు చేయబోతున్నారు. గ్రామ, నగర పాలక సంస్థల పరిధిలో ఉన్న ఆస్తుల వివరాలు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నమోదైన వివరాలను కలిపి ఒక సమగ్ర వ్యవసాయేతర ఆస్తుల జాబితాను రూపొందిస్తారు. వాటి ఆధారంగానే ఆస్తుల లావాదేవీలు జరు గుతాయి. వ్యవసాయేతర ఆస్తు ల సమగ్ర వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. ఆబాదీ/గ్రామ కంఠాలలో సర్వే జరగలేదు. ఇప్పుడు గ్రామాలు ఈ ఆబాదీ దాటి వ్యవసాయ భూముల్లోకి విస్తరించాయి. దేశంలో దాదాపు ఏడు లక్షల గ్రామాలను నాలుగేళ్లలో సర్వే చేసి ఇంటి స్థలాలకు కార్డులు ఇవ్వడం కోసం కేంద్రం ‘స్వామిత్వా’పేరుతో కొత్త పథకం ప్రారంభించింది. రాష్ట్రం కూడా ఈవైపు ఆలోచించాలి.  

ధరణిలో తప్పొప్పులపై.. 
విస్తీర్ణంలో వ్యత్యాసం, భూ వివాదాలు, క్రమబద్ధీకరణ జరగని సాదా బైనామాలు, లావోని పట్టా కొనుగోళ్లు ఇలా పలు కారణాల వలన ధరణి వెబ్‌సైట్‌లో నమోదు కాని భూయజమానులు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఎక్కినా పాసు పుస్తకం రికార్డుల్లో ఉన్న సర్వే నంబర్, క్షేత్రస్థాయిలో పొజిషన్‌లో ఉన్న సర్వే నంబర్‌కూ తేడా ఉన్న కేసులూ ఉన్నాయి. దీన్ని వైవట్‌ కబ్జా అంటారు. పట్టా భూమి అయి ఉండి కూడా నిషేధిత భూములు (22ఏ) జాబితాలో ఉండటంతో కొత్త పట్టా పాసుపుస్తకాలు రాని వారూ ఉంటారు. ఇలాంటి తప్పులు సరిదిద్దాలన్నా, సమస్యలకు దాదాపు పరిష్కారం కావాలన్నా భూముల సమగ్ర సర్వే తప్పనిసరి. సర్వే చేసి కొత్తగా రికార్డులు రూపొందించుకోవడమే సమస్యకు శాశ్వత పరిష్కారం. సర్వే జరిగే లోపు ధరణిలో సవరణలకు మరో అవకాశం ఇవ్వాలి. ఒక్కసారైనా రికార్డులను మ్యాన్యువల్‌గా రాసి ఆ తర్వాత ధరణిలో నమోదు చేస్తే తప్పులు సరిచేయొచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement