సాక్షి, హైదరాబాద్: అసలే కరోనాతో సగటు మనిషి జీవితం అతలాకుతలమైపోయిందంటే.. తాజాగా దీనితో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు జతకట్టే ముప్పు నెలకొంది. ప్రస్తుత వానాకాలంలో ఎముకలు, కీళ్లకు సంబంధించిన (ఆర్థోపెడిక్) సమస్యలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఒకపక్క కరోనా సంక్షోభం నెలకొన్న తరుణంలో ఇలాంటి సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే అవసరం రాకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కోవిడ్ ప్రభావిత పరిణామాల ప్రభావం, దీనివల్ల లోలోపల ఉత్పన్నమయ్యే ఆదుర్దా కారణంగా ఇంట్లోనో, బయటో ప్రమాదవశాత్తు పడడమో, ఏదైనా యాక్సిడెంట్‌కు గురికావడం ద్వారా ఎముకలు విరగడం వంటివి జరగకుండా చూసుకోవాలంటున్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ దశరథరామారెడ్డి తేతలి. ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మరి న్ని జాగ్రత్తలు తప్పనిసరని ఆయన అంటున్నారు. శరీరంలోని చిన్న ఎముక విరిగితే మూడు నెలలు, పెద్ద ఎముక విరిగితే ఆరు నెలలు ఇంటికి, మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందన్న దాన్ని గుర్తెరిగి మసులుకుంటే మంచిదని ఆయన సూచిస్తున్నారు. ఇంకా వివిధ అంశాలపై డాక్టర్ దశరథరామారెడ్డి ‘సాక్షి’తో ఏమన్నారంటే..
వానాకాలం జాగ్రత్త
వర్షాకాలంలో ఎముకలు విరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ’నిదానమే ప్రధానం’ అనే నానుడిని ఎంత బాగా ఆచరిస్తే అంత మంచిది. క్షణకాలం అజాగ్రత్తగా వ్యవహరించినా.. కొన్ని నెలల పాటు ఇంటికి, మంచానికి పరిమితం కావాల్సి ఉంటుందని అందరూ గుర్తెరగాలి. వానాకాలంలో యాక్సిడెంట్లు, ఇతర రూపాల్లో వచ్చే అనుకోని సంఘటనలతో ఆర్థోపెడిక్ సమస్యలు పొంచి ఉంటాయి.
ఊహించనిది జరగొచ్చు
రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఇళ్లలోనే అనుకోకుండా జారిపడితే తుంటి ఎముక జారడం, వెన్నుపూస, చేతులు/కాళ్ల ఎముకలు విరగడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలతో ఇంటికి లేదా మంచానికే పరిమితం కావడం వల్ల కీళ్ల నొప్పులు / కీళ్ల వాతం సమస్యలు పెరుగుతాయి.
వృద్ధులు, పిల్లలపై దృష్టి
ఏ కాలంతోనూ సంబంధం లే కుండా బాత్రూంలు/ టాయ్‌లెట్లలో జారిపడడం సహజం. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు ఈ ప్రమాదాలకు అధికంగా గురవుతున్నారు. బాత్రూంలలో పడినవారికి ఎక్కువగా కీళ్లు బెణకడం, ఎముకలు విరగడం జరుగుతుంటుంది.
ప్రమాదాల నివారణ ఇలా
ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల బ్రేకులు, టైర్లను సరిచూసుకోవాలి. రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్లవద్దు. రోడ్ల పరిస్థితిని బట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలి. రోడ్లు సరిగా లేకపోవడం, ఎక్కడైనా గోతులు, గుంతలు పడి ఉండడం, వాటిలో వర్షం నీరు చేరి పైకి కనబడకుండా పోవడం వంటి వాటి వల్ల వెహికల్స్ అదుపుతప్పి ప్రమాదాలు జరిగే ఆస్కారముంది. వాహనాల వైపర్లు సరిచూసుకోవాలి. వాగులు, వంకలు దాటేప్పుడు తొందరపాటు పనికిరాదు. నీటి ప్రవాహ వేగాన్ని తక్కువ అంచనా వేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి.
నేలపై తడి లేకుండా చూడాలి
ఇళ్ల లోపల నేల, ఫ్లోరింగ్‌పై తడిలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో మరింత శ్రద్ధ అవసరం. వారు టాయ్‌లెట్‌కు, స్నానానికి వెళ్లినపుడు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
తరచూ బయటకు వెళ్లవద్దు
వర్షాకాలంలో తరచూ బయటకు వెళ్లడాన్ని తగ్గించుకోవాలి. అవసరమైన సరుకులు, వస్తువులు తగినంతగా ఒకేసారి నిల్వచేసి పెట్టుకుంటే తరచూ బయటికెళ్లే పని తప్పుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment