Orthopedic doctor
-
ఇజ్రాయెల్‌లో అద్భుతం.. తెగిన తలను అతికించారు..
ఇజ్రాయెల్: తెగిపోయిన బాలుడి తలను తిరిగి అతికించి అద్భుతం సృష్టించారు ఇజ్రాయెల్ డాక్టర్లు. సైకిల్ తొక్కుతుండగా కారు ఢీకొట్టడంతో 12 ఏళ్ల బాలుడి తల మెడ నుండి దాదాపుగా తెగిపోయింది. సుదీర్ఘంగా సాగిన సర్జరీ విజయవంతమైనా డాక్టర్లు ఆ బాలుడు డిస్చార్జి అయ్యేంత వరకు విషయం బయటకు చెప్పలేదు. 12 ఏళ్ల సులేమాన్ హాసన్ సైకిల్ తొక్కుతుండగా ఓ కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడి తలభాగం మెడ నుండి వేరయింది. వెన్ను భాగానికి పుర్రె వేలాడుతూ ఉంది. వెంటనే బాలుడిని హదస్స త్ మెడికల్ సెంటరుకు తరలించగా అక్కడి డాక్టర్లు ఎమర్జెన్సీ కేర్ లో ఉంచి ట్రీట్మెంట్ ప్రారంభించారు. హదస్స త్ మెడికల్ సెంటరులోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ ఒహాడ్ ఎయినావ్ తెలిపిన వివరాల ప్రకారం బాలుడు అడ్మిట్ అయ్యే సమయానికి అతడి తల మొండెం దాదాపుగా వేరయ్యాయి.. బ్రతికే అవకాశం కూడా 50% మాత్రమే. దీన్ని బైలేటరల్ అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్ లోకేషన్ గా పిలుస్తుంటాం. బ్రతుకుతాడో లేదో తెలియని పరిస్థితుల్లోనే మేము సర్జరీ ప్రారంభించాము. బాలుడుని బ్రతికించడానికి మా బృందం ఆపరేషన్ థియేటర్లో చాలా గంటలపాటు శ్రమించాము. చివరికి తలను యధాతధంగా అతికించగలిగామని తెలిపారు. బాలుడు ఎప్పటిలాగే తన పనులు తాను చేసుకుంటున్నాడు. అంతటి మేజర్ సర్జరీ అయినా కూడా ఎవ్వరి సాయం లేకుండా నడవగలుగుతున్నాడు. అతడి శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలూ, శరీర భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ సంఘటన గత నెలలో జరగగా బాలుడు పూర్తిగా కోలుకున్నాక గాని ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని ఉద్దేశ్యంతోనే గుప్తంగా ఉంచామన్నారు ఆసుపత్రి సిబ్బంది. బాలుడిని డిశ్చార్జి చేసే రోజున డాక్టర్లు ఆ బాలుడితో ఫోటో తీసుకుని విషయాన్ని వివరించారు. ఇది కూడా చదవండి: Pakistan Crisis : ఆర్ధిక సంక్షోభంతో ఆస్తులను అమ్ముకుంటున్న పాకిస్తాన్.. -
ప్రముఖ డాక్టర్ని కలిసిన రష్మిక.. అసలు ఏమైందంటే..
ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ సహా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఇటీవలె సీతారామం సినిమాతో అలరించింది. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక హైదరాబాద్‌లోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గురువారెడ్డిని కలిసింది. గత కొంతకాలంగా రష్మిక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా గురువారెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ రష్మిక తన వద్దకు వచ్చిందని, అయితే పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. "నువ్వు 'సామి..సామి..' అంటూ మోకాళ్ళ మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి!" అని మోకాలి నొప్పి అంటూ నా దెగ్గరకు వచ్చిన 'శ్రీవల్లి'కి సరదాగా పెదవి విరుస్తూ ఇలా అన్నాను.. పుష్ప సినిమా చుసిన మొదలు రష్మికని కలిసి అభినందించాలనుకున్న నాకు ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ సందర్భం వచ్చింది! బన్నీ కూడా త్వరలో Shoulder pain తో వస్తాడేమో'' అంటూ ఫన్నీగా తన ఫేస్బుక్ స్టోరీలో రాసుకొచ్చారు. -
4 గంటలు.. 3 సర్జరీలు
సాక్షి గాంధీ ఆస్పత్రి: గాంధీఆస్పత్రి ఆర్థోపెడిక్ వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. నాలుగు గంటల వ్యవధిలో ముగ్గురికి శస్త్ర చికిత్సలు చేసి ఔరా అనిపించారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరికి చెందిన ఆగయ్య (63), ఖమ్మం జిల్లా వాసి అయిలయ్య(65), ముషీరాబాద్‌కు చెందిన నీలవేని (50)లకు మోకాలి కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ వాల్యా ఆధ్వర్యంలో శనివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏకబిగిన మూడు కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా సర్జరీలు ఉచితంగా చేసినట్లు గాంధీ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్, మైక్రోబయోలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ రాజేశ్వరరావు తెలిపారు. సర్జరీలో పాల్గొన్న ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ వాల్యా, అనస్థీషియా హెచ్ఓడీ బేబిరాణి, అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి, శ్రీనివాస నాయక్ అనీల్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అబ్బయ్య, కిరణ్, అక్రమ్‌లు అభినందలు అందుకున్నారు. (చదవండి: అంతు చిక్కని అస్వస్థత) -
ఎముకలు, కీళ్లు జాగ్రత్త
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన అలవాట్లు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. పిల్లలు మొదలు యువత, మధ్య వయస్సు వారిపై వివిధ రూపాల్లో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మిగతా శరీర అవయవాల మాదిరిగానే ఎముకలు, కీళ్లకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. అయినా దీనిపై ప్రజలు పెద్దగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ దశరథరామారెడ్డి తేతలితో ‘సాక్షి’ ఇంటర్వూ్య జరిపింది. ముఖ్యాంశాలు ఇలా... సమస్యలేంటి? – సాక్షి, హైదరాబాద్ఎముకలు, కీళ్లకు సంబంధించి వస్తున్న ►డా. దశరథ: 30–40 ఏళ్లు దాటాక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ వల్ల పిల్లలపై.. మద్యం, ధూమపానం వల్ల యువతపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆల్కహాల్, ధూమపానం అనేవి కాలేయాన్ని, ఊపిరితిత్తులనే కాకుండా ఎముకలనూ పాడు చేస్తాయి. ఆస్టియోపోరోసిస్ లేదా ప్రమాదవశాత్తు ఫ్రాక్చర్లు అయితే అతుక్కోవడం కష్టం కావొచ్చు. పొగతాగడం వల్ల ‘నికోటిన్ బోన్ సీజ్’, అధిక మద్యపానం వల్ల ‘ఎవాస్క్యూలర్ నెక్రోసిస్’తో తుంటి జాయింట్లు దెబ్బతింటాయి. చర్మవ్యాధులు లేదా ఆస్తమా వంటి వాటికి ఇష్టారీతిన స్టెరాయిడ్స్ తీసుకుంటే ఎముకలు బోలుగా మారి ఆస్టియోపోరోసిస్ రావొచ్చు. ఎందువల్ల ఈ సమస్యలు పెరుగుతున్నాయి ? ►డా. దశరథ: శారీరక శ్రమ, వ్యాయామం లేకపోతే బరువు పెరిగి ఆస్టియో ఆర్థరైటిస్, వెన్నుపూస నొప్పికి దారితీస్తాయి. అధిక సమయం మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం వల్ల, సరిగా కూర్చోకుండా కొన్ని గంటల పాటు కంప్యూటర్ల వద్ద పనిచేయడం వల్ల మెడ, భుజం, నడుం, చేతుల నొప్పులు వస్తాయి. తరచుగా వచ్చే వెన్నుపూస, మెడ, భుజం నొప్పులతో రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజూరీస్, కండరాల్లో వచ్చే ‘టీనో సైనోవిటీస్’ నొప్పి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, నడుము నొప్పి, సయాటికా వంటివి ప్రధానమైనవి. బరువులు ఎత్తేటప్పుడు సరిగా ఎత్తాలి, కూర్చునే విధానం కూడా సరిగా ఉండాలి, ఇప్పుడొస్తున్న ఖరీదైన విలాసవంతమైన సోఫాలతోనూ సమస్యలొస్తున్నాయి. అవి గది అలంకరానికి బాగా కనిపిస్తాయి కానీ వీటి వల్ల మోకాళ్లు, నడుముపైనా బాగా ఒత్తిడి పడుతుంది. చెక్కబల్ల మీద, నేలపై పడుకోవడం చేయొచ్చా? ►డా. దశరథ: నడుం నొప్పి వస్తే చెక్కబల్ల మీద పడుకోవడం, నేలపై నిద్రపోవడం వంటివి చేస్తే అది తగ్గిపోతుందనే అపోహ ఉంది. కొంతమంది ఎక్కువ దిండ్లు పెట్టుకుని పడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. డయాబెటిస్ వల్ల భుజాల నొప్పితో ‘పెరి ఆర్థరైటిస్’ వస్తుంది. అందువల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ మధ్యకాలంలో ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ వ్యాధి భారత్‌లో ఎక్కువగా పెరుగుతోంది. దానివల్ల తుంటి, మోకాలు జాయింట్లపై ప్రభావం పడుతోంది. ఇది వచ్చినపుడు తొలిదశలోనే ఆర్థోపెడిక్ లేదా రుమటాలజిస్ట్ను సంప్రదించి సరైన మందులు, ఆహారంతో తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాలి. విటమిన్ బీ–12 లోపం వల్ల కాళ్లు తిమ్మిర్లు రావడం, సయాటికా మాదిరి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నవయసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ►డా. దశరథ: చిన్న వయసులో మోకాలి జాయింట్ గాయాలైనపుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ‘లిగ్మెంట్ ఇంజూరీ’ వల్ల మోకాళ్లపై ఒత్తిడి సరిసమానంగా పడక ఒకవైపు అరిగిపోయి ‘ఆస్టియో ఆర్థరైటిస్’ వస్తుంది. చిన్నప్పుడే లిగ్మెంట్ల గాయాలను అశ్రద్ధ చేయకుండా ఆర్థోస్కోపి ఆపరేషన్ చేయించు కోవాలి. చిన్నపిల్లల్లో ‘ఫ్లాట్ ఫుట్’కు గతంలో అంత ప్రాధాన్యత ఇచ్చే వాళ్లం కాదు. దీనివల్ల కాళ్లపై సరిసమానంగా బరువు పడక మున్ముందు మోకాళ్లు అరిగిపోతాయి. దీనిని తల్లితండ్రులు ముందుగానే గుర్తించి వైద్యం చేయించాలి. చిన్నపుడే దానికి తగ్గట్టుగా కాలి జోళ్లు మార్చుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చు. ఆయా సమస్యలకు మీరు చేసే సూచనలేంటి? ►డా. దశరథ: సమస్య వచ్చినపుడు అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ప్రతి ఒక్కరూ యుక్తవయసు నుంచి విటమిన్–డి, థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. 45 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులు బీఎండీ పరీక్ష చేయించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. పోషకాహారం తీసుకోవాలి. సూర్యరశ్మి తగిలేలా రోజూ కాసేపు ఎండలో కూర్చోవాలి. సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తే మంచిది. మహిళలు చిన్న చిన్న సమస్యలకే హిస్టరెక్టమీ ఆపరేషన్ల వల్ల భవిష్యత్‌లో ఎముకలు బలహీనమయ్యే అవకాశముంది. అవసరమైతేనే ఆ ఆపరేషన్లు చేయించుకోవాలి. ఈ మధ్య నడుంనొప్పి సమస్యలు పెరుగుతున్నాయి. ఏం చేయాలి? ►డా. దశరథ: నడుం నొప్పి అనగానే ఆపరేషన్ చేసుకోవాలి... ఆ తర్వాత లేవకుండా మంచానికే పరిమితం కావాలనే అపోహ చాలామందిలో ఉంటోంది. వెన్నుపూస జారిపోయి ‘స్పాండిలో లిíస్తిసిస్’, కాళ్లలో తిమ్మిర్లు వచ్చి నడవలేకపోవడం వంటి వారికే వాస్తవంగా ఆపరేషన్ అవసరమౌతుంది. ఒట్టి నడుం నొప్పి ఉన్న వారికి ఆపరేషన్ అవసరం లేదు. ఈ నొప్పి క్రమం తప్పకుండా విపరీతంగా వస్తుంటే మిగతా ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చాయేమోనన్నది సరిచూసుకోవాలి. కొన్నిసార్లు శరీరంలో ఎక్కడైనా కేన్సర్ సోకితే అది ఎముకల్లోకి రావొచ్చు. దానివల్ల నడుం నొప్పి రావొచ్చు. నడుం నొప్పి అనేది వ్యాధి కాదు. శరీరంలో చోటుచేసుకునే అనేక అనర్థాలకు అదొక లక్షణంగానే పరిగణించాలి. -
మోకాళ్ల నొప్పులా.. ఈ పనులు చేయకండి
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో చాలామంది తాము ఎక్కువగా నడుస్తూ ఉంటే మోకాళ్ళు మరింతగా అరిగిపోతాయేమోనని, దాంతో నొప్పులు మరింతగా పెరుగుతాయేమోనని అపోహపడుతుంటారు. వాస్తవానికి ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి మన మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే, ఆ భాగంలో అంతగా రక్తప్రసరణ జరుగుతుంది. అలా రక్తప్రసరణ పెరగడం వల్ల కీళ్లకు మంచి పోషణ అందుతుంది. రాబోయే కాలం అనువైన సమయం... కొద్దిరోజుల్లోనే చలికాలం ముగియబోతోంది. చలి క్రమంగా తగ్గిపోయి ఉదయం వేళ, సాయంత్రం పూట నడకకు ఆస్కారం ఇచ్చే వాతావరణం... అంటే... అంతగా చలీ, అంతగా వేడీ లేని మంచి వాతావరణం మరో రెండు నెలలూ ఉండబోతోంది. అందుకే వీలైతే వెంటనే రోజుకు కొంతసేపు నడకకు కేటాయించండి. పది నిమిషాలు వ్యవధితో మొదలు పెట్టి క్రమంగా 40 – 60నిమిషాల వరకూ వాకింగ్ సమయాన్ని పెంచుతూ పొండి. నడక వల్ల మీ మోకాళ్లపై మీ దేహభారం పడుతుందని అనిపిస్తే...ఒకే చోట కూర్చుని చేసే సైక్లింగ్ కూడా చేయవచ్చు. నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడే ఉపకరణాలివి... మోకాలిలో నొప్పులు లేకుండా ఉండటానికి / నొప్పులు తగ్గడానికి నీ గార్డులు, క్రేప్ బ్యాండేజీలు, మోకాళ్ల వద్ద బిగుతుగా ఉంచే సపోర్టింగ్ సాక్స్, చిన్న బ్రేసెస్ ఇలాంటి కొన్ని ఉపకరణాలను అవసరమైన వారికి ఆర్థోపెడిక్ నిపుణులు సూచిస్తారు. అయితే పనుల్లో భాగంగా మోకాలిపైన భారం పడుతున్న సమయంలో మాత్రమే వీటిని ధరించాలి. లేదా డాక్టర్ సూచనలకు అనుగుణంగా మాత్రమే వీటిని ఉపయోగించాలి. ఈ పనులు చేయకండి... మోకాళ్ల నొప్పులున్నవారు ఇక్కడ పేర్కొన్న పనులేవీ చేయకూడదు. అవేమిటంటే... ఒక అంతస్తు కంటే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగడం వద్దు. ఎగుడు–దిగుడుగా ఉండే నేలపై నడవద్దు. నడక వ్యాయామం సమయంలోనూ సమతలంగా ఉండే నేలపైనే నడవండి. నేలపై కాళ్లు రెండూ మడత వేసుకుని కూర్చోవడం / లేవడం (స్కాటింగ్) చేయకండి. గొంతుక్కూర్చొని బరువైన వస్తువలేవీ ఎత్తకండి. నొప్పులు తగ్గకపోతే... పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటున్నా... నడక మొదలుపెట్టిన వారం లేదా రెండు వారాల్లో తగ్గకపోయినా ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించండి. వారు మీ మోకాళ్ళను ఎక్స్–రే తీసి, అవి ఏ మేరకు అరిగాయి అన్న విషయం తెలుసుకుంటారు. దాన్ని బట్టి మీకు ఎలాంటి వైద్య చికిత్స అవసరమో నిర్ణయిస్తారు. అవసరాన్ని బట్టి మందులతోపాటు ఫిజియోథెరపీని కూడా సూచించవచ్చు. ఫిజియోథెరపీలో కండరాలు, ఎముకలు గట్టిపడి వాటి కదలికలు మెరుగుపడతాయి. ఫిజియో అంటే మళ్లీ వ్యాయామాలే. కాబట్టి ఈ సారి క్రమంగా మీ నొప్పులు తగ్గుతూ మళ్లీ వ్యాయామం వైపునకు మళ్లే అవకాశం ఉంటుంది. -
కాళ్లు, కీళ్లు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనాతో సగటు మనిషి జీవితం అతలాకుతలమైపోయిందంటే.. తాజాగా దీనితో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు జతకట్టే ముప్పు నెలకొంది. ప్రస్తుత వానాకాలంలో ఎముకలు, కీళ్లకు సంబంధించిన (ఆర్థోపెడిక్) సమస్యలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఒకపక్క కరోనా సంక్షోభం నెలకొన్న తరుణంలో ఇలాంటి సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే అవసరం రాకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కోవిడ్ ప్రభావిత పరిణామాల ప్రభావం, దీనివల్ల లోలోపల ఉత్పన్నమయ్యే ఆదుర్దా కారణంగా ఇంట్లోనో, బయటో ప్రమాదవశాత్తు పడడమో, ఏదైనా యాక్సిడెంట్‌కు గురికావడం ద్వారా ఎముకలు విరగడం వంటివి జరగకుండా చూసుకోవాలంటున్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ దశరథరామారెడ్డి తేతలి. ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మరి న్ని జాగ్రత్తలు తప్పనిసరని ఆయన అంటున్నారు. శరీరంలోని చిన్న ఎముక విరిగితే మూడు నెలలు, పెద్ద ఎముక విరిగితే ఆరు నెలలు ఇంటికి, మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందన్న దాన్ని గుర్తెరిగి మసులుకుంటే మంచిదని ఆయన సూచిస్తున్నారు. ఇంకా వివిధ అంశాలపై డాక్టర్ దశరథరామారెడ్డి ‘సాక్షి’తో ఏమన్నారంటే.. వానాకాలం జాగ్రత్త వర్షాకాలంలో ఎముకలు విరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ’నిదానమే ప్రధానం’ అనే నానుడిని ఎంత బాగా ఆచరిస్తే అంత మంచిది. క్షణకాలం అజాగ్రత్తగా వ్యవహరించినా.. కొన్ని నెలల పాటు ఇంటికి, మంచానికి పరిమితం కావాల్సి ఉంటుందని అందరూ గుర్తెరగాలి. వానాకాలంలో యాక్సిడెంట్లు, ఇతర రూపాల్లో వచ్చే అనుకోని సంఘటనలతో ఆర్థోపెడిక్ సమస్యలు పొంచి ఉంటాయి. ఊహించనిది జరగొచ్చు రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఇళ్లలోనే అనుకోకుండా జారిపడితే తుంటి ఎముక జారడం, వెన్నుపూస, చేతులు/కాళ్ల ఎముకలు విరగడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలతో ఇంటికి లేదా మంచానికే పరిమితం కావడం వల్ల కీళ్ల నొప్పులు / కీళ్ల వాతం సమస్యలు పెరుగుతాయి. వృద్ధులు, పిల్లలపై దృష్టి ఏ కాలంతోనూ సంబంధం లే కుండా బాత్రూంలు/ టాయ్లెట్లలో జారిపడడం సహజం. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు ఈ ప్రమాదాలకు అధికంగా గురవుతున్నారు. బాత్రూంలలో పడినవారికి ఎక్కువగా కీళ్లు బెణకడం, ఎముకలు విరగడం జరుగుతుంటుంది. ప్రమాదాల నివారణ ఇలా ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల బ్రేకులు, టైర్లను సరిచూసుకోవాలి. రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్లవద్దు. రోడ్ల పరిస్థితిని బట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలి. రోడ్లు సరిగా లేకపోవడం, ఎక్కడైనా గోతులు, గుంతలు పడి ఉండడం, వాటిలో వర్షం నీరు చేరి పైకి కనబడకుండా పోవడం వంటి వాటి వల్ల వెహికల్స్ అదుపుతప్పి ప్రమాదాలు జరిగే ఆస్కారముంది. వాహనాల వైపర్లు సరిచూసుకోవాలి. వాగులు, వంకలు దాటేప్పుడు తొందరపాటు పనికిరాదు. నీటి ప్రవాహ వేగాన్ని తక్కువ అంచనా వేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. నేలపై తడి లేకుండా చూడాలి ఇళ్ల లోపల నేల, ఫ్లోరింగ్‌పై తడిలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో మరింత శ్రద్ధ అవసరం. వారు టాయ్‌లెట్‌కు, స్నానానికి వెళ్లినపుడు ప్రత్యేక దృష్టి పెట్టాలి. తరచూ బయటకు వెళ్లవద్దు వర్షాకాలంలో తరచూ బయటకు వెళ్లడాన్ని తగ్గించుకోవాలి. అవసరమైన సరుకులు, వస్తువులు తగినంతగా ఒకేసారి నిల్వచేసి పెట్టుకుంటే తరచూ బయటికెళ్లే పని తప్పుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. -
నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మరణం
నెల్లూరు(అర్బన్): జిల్లాలో తొలి కరోనా మృతి నమోదైంది. కరోనా పాజిటివ్‌తో తీవ్ర అస్వస్థతకు గురైన నెల్లూరు ఆర్థోపెడిక్ డాక్టర్ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.అలాగే సోమవారం జిల్లాలో మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. నగరంలోని చంద్రబాబునగర్, రంగనాయకులపేట, ఖుద్దూస్‌నగర్, తడ మండలంలోని బీవీపాళెంలో కేసులు నిర్ధారణ అయ్యాయి. ఢిల్లీ నుంచి మతప్రచారం నిమిత్తం నగరానికి వచ్చి ఖుద్దూస్‌నగర్‌లోని మసీదులో ఉంటున్న వ్యక్తిని గుర్తించి అధికారులు క్వారంటైన్‌కు తరలించగా అతనికి పాజిటివ్ వచ్చింది. ఇదిలా ఉండగా తడ బీవీపాళెంలో తండ్రి నుంచి మూడో బిడ్డకు కరోనా సోకింది. కొత్తగా నమోదైన నాలుగు పాజిటివ్ కేసులు ఢిల్లీతో సంబంధం ఉన్నవే కావడం విశేషం. ఈ నలుగురితో కలిపి మొత్తం 56 మందికి జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వైద్య శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పెద్ద ఎత్తున ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. డాక్టర్ మృతికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డా. ఎస్వీకే ప్రసాద్‌రెడ్డి, డా. పి. ఫణిదర్‌రెడ్డి, నగర్ ఆర్థోపెడిక్ డాక్టర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డా. ఎంఏవీవీ ప్రసాద్, గోపాలకృష్ణయ్య సంతాపం తెలిపారు. -
షాక్‌లో డాక్టర్ కృష్ణంరాజు బంధువులు
సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి జిల్లా): ప్రముఖ వైద్యుడు పెనుమత్స రామకృష్ణంరాజు తన భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడటంతో బంధువులు, శ్రీకృష్ణ ఆర్దోపెడిక్ ఆసుపత్రి సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. మంచి వైద్యుడిగా పేరుగాంచిన కృష్ణంరాజు బలవన్మరణాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. రామకృష్ణంరాజు రెండవ కుమారుడు కృష్ణవంశీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ కృష్ణంరాజు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనేది ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ప్రాణాలు తీసుకునివుండొచ్చని అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన కారణంగానే కుటుంబంతో కలిసి ఆయన ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేట్టారు. (ప్రాథమిక వార్త: డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..!) -
అమలాపురంలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య
-
డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..!
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని అమలాపురంలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ పెనుమత్స రామ కృష్ణంరాజు అలియాస్ కృష్ణంరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్ కృష్ణంరాజు(55), ఆయన భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు కృష్ణసందీప్ (25) బలవన్మరణానికి పాల్పడ్డారు. కృష్ణసందీప్ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు సమాచారం. రెండో కొడుకు కృష్ణవంశీ రాజానగరంలోని జీఎస్ఎల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులే ఈ ఆత్మహత్యలకు కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. పాయిజన్ ఇంజక్షన్ తీసుకోవడంతో ముగ్గురూ ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. అమలాపురంలోని సొంతింటిలో కృష్ణంరాజు కుటుంబం విగతజీవులుగా పడిఉండటాన్ని గమనించిన వారి ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హేల్ప్ ప్లీజ్
ఎంజీఎంలో హెల్ప్‌లైన్ లేక అవస్థలు క్యూలైన్లో గంటల తరబడి నిరీక్షణ సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం రోగుల అవస్థలు హన్మకొండ : సారూ.. 23వ నంబరు ఎక్కడ? అన్నా.. ఆర్ధోపెడిక్ డాక్టరు ఏడుంటడు? అయ్యూ.. రక్త పరీక్ష జేయించుకోవాల్నంటే ఏడికి పోవాలే? అక్కా.. మందులెక్కడిత్తరు.. బిడ్డా.. జర లేవరాదు.. కాళ్లు నొప్పెడుతన్నయి.. కొంచేపు కూసుంట..! ఇవి తెలంగాణ రాష్ట్రంలోని రెండో పెద్దాస్పత్రి అరుున మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్(ఎంజీఎం)లో నిత్యం వినిపించే మాటలు.. ఎంజీఎంకు వచ్చే రోగులకు, వారి సహాయకులకు సమాచారం కొరవడింది. ప్రధానంగా హెల్ప్‌లైన్ లేకపోవడమే. హెల్ప్‌డెస్క్ అవసరం మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్‌కు జిల్లాతోపాటు కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ఇందులో ప్రధానంగా గ్రామీణులు, ని రక్షరాస్యులు, వయసుపైబడిన వారు ఉంటారు. ఎం జీఎంలో వీరి రోగానికి సంబంధించిన వైద్యుడిని పట్టుకోవడం తలకు మించిన భారం అవుతోంది. ఎ టు వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. కాలు, పంటినొప్పి సమస్యల మీద వచ్చే రోగులు జనరల్ ఓపీ వద్దే ఆగిపోతున్నారు. ఒక వేళ ఎవరైనా ఇక్కడ ఉంటారని సూచిస్తే.. ఆ వైద్యులకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఓపీ విభాగానికి వచ్చిన రోగులు జనరల్ ఓపీ గది వద్ద గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. తీరా జనరల్ ఓపీకి వెళ్లగానే మీ సమస్యకు ఫలానా వైద్యుడి వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వ చ్చి గంటల తరబడి నిల్చున్న రోగులుకు ఈ సమాధానం పిడుగుపాటుల మారుతోంది. వైద్యుడు దొరికి పరీక్ష చేరుుంచుకుని మందులు రారుుంచుకునే లోపే ఓపీ సమయం ముగిసిపోతోంది. రోగుల ఇబ్బందులు తొలగించేందుకు ఓపీలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయూలని రోగులు కోరుతున్నారు. ఓపీలో రోగుల అవస్థలు.. రోగులు అధిక సంఖ్యలో వచ్చే జనరల్ ఓపీలో సంఖ్యను పెంచాలి. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా ఓపీలు ఉన్నాయి. వీటిని రెట్టింపు చేయాలి.ఉచితంగా మందులు ఇచ్చే మెడికల్ స్టోర్ ఎదుట కేవలం నాలుగు కౌంటర్లు పని చేస్తున్నాయి. వీటి సంఖ్యను పెంచాలి. నిత్యం రెండు వేల మంది రోగులు, వారి సహాయకులు వచ్చే ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలో రోగులు కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు లేవు.ఓపీల దగ్గర రద్ది ఎక్కువగా ఉండటంతో సిబ్బంది, సెక్యూరిటీ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వైద్యుల వద్దకు త్వరగా పంపించేందుకు పైసలు వసూలు చేస్తున్నారు.మందుల దుకాణంలో అన్ని రకాల ఔషధాలు లభించడం లేదు. అదేవిధంగా రోగనిర్ధారణ పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది.