నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన అలవాట్లు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. పిల్లలు మొదలు యువత, మధ్య వయస్సు వారిపై వివిధ రూపాల్లో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మిగతా శరీర అవయవాల మాదిరిగానే ఎముకలు, కీళ్లకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. అయినా దీనిపై ప్రజలు పెద్దగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ దశరథరామారెడ్డి తేతలితో ‘సాక్షి’ ఇంటర్వూ్య జరిపింది. ముఖ్యాంశాలు ఇలా... సమస్యలేంటి?
– సాక్షి, హైదరాబాద్‌ఎముకలు, కీళ్లకు సంబంధించి వస్తున్న
►డా. దశరథ: 30–40 ఏళ్లు దాటాక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ వల్ల పిల్లలపై.. మద్యం, ధూమపానం వల్ల యువతపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆల్కహాల్, ధూమపానం అనేవి కాలేయాన్ని, ఊపిరితిత్తులనే కాకుండా ఎముకలనూ పాడు చేస్తాయి. ఆస్టియోపోరోసిస్ లేదా ప్రమాదవశాత్తు ఫ్రాక్చర్లు అయితే అతుక్కోవడం కష్టం కావొచ్చు. పొగతాగడం వల్ల ‘నికోటిన్ బోన్ సీజ్’, అధిక మద్యపానం వల్ల ‘ఎవాస్క్యూలర్ నెక్రోసిస్’తో తుంటి జాయింట్లు దెబ్బతింటాయి. చర్మవ్యాధులు లేదా ఆస్తమా వంటి వాటికి ఇష్టారీతిన స్టెరాయిడ్స్ తీసుకుంటే ఎముకలు బోలుగా మారి ఆస్టియోపోరోసిస్ రావొచ్చు.
ఎందువల్ల ఈ సమస్యలు పెరుగుతున్నాయి ?
►డా. దశరథ: శారీరక శ్రమ, వ్యాయామం లేకపోతే బరువు పెరిగి ఆస్టియో ఆర్థరైటిస్, వెన్నుపూస నొప్పికి దారితీస్తాయి. అధిక సమయం మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం వల్ల, సరిగా కూర్చోకుండా కొన్ని గంటల పాటు కంప్యూటర్ల వద్ద పనిచేయడం వల్ల మెడ, భుజం, నడుం, చేతుల నొప్పులు వస్తాయి. తరచుగా వచ్చే వెన్నుపూస, మెడ, భుజం నొప్పులతో రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజూరీస్, కండరాల్లో వచ్చే ‘టీనో సైనోవిటీస్’ నొప్పి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, నడుము నొప్పి, సయాటికా వంటివి ప్రధానమైనవి. బరువులు ఎత్తేటప్పుడు సరిగా ఎత్తాలి, కూర్చునే విధానం కూడా సరిగా ఉండాలి, ఇప్పుడొస్తున్న ఖరీదైన విలాసవంతమైన సోఫాలతోనూ సమస్యలొస్తున్నాయి. అవి గది అలంకరానికి బాగా కనిపిస్తాయి కానీ వీటి వల్ల మోకాళ్లు, నడుముపైనా బాగా ఒత్తిడి పడుతుంది.
చెక్కబల్ల మీద, నేలపై పడుకోవడం చేయొచ్చా?
►డా. దశరథ: నడుం నొప్పి వస్తే చెక్కబల్ల మీద పడుకోవడం, నేలపై నిద్రపోవడం వంటివి చేస్తే అది తగ్గిపోతుందనే అపోహ ఉంది. కొంతమంది ఎక్కువ దిండ్లు పెట్టుకుని పడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. డయాబెటిస్ వల్ల భుజాల నొప్పితో ‘పెరి ఆర్థరైటిస్’ వస్తుంది. అందువల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ మధ్యకాలంలో ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ వ్యాధి భారత్‌లో ఎక్కువగా పెరుగుతోంది. దానివల్ల తుంటి, మోకాలు జాయింట్లపై ప్రభావం పడుతోంది. ఇది వచ్చినపుడు తొలిదశలోనే ఆర్థోపెడిక్ లేదా రుమటాలజిస్ట్‌ను సంప్రదించి సరైన మందులు, ఆహారంతో తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాలి. విటమిన్ బీ–12 లోపం వల్ల కాళ్లు తిమ్మిర్లు రావడం, సయాటికా మాదిరి లక్షణాలు కనిపిస్తాయి.
చిన్నవయసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
►డా. దశరథ: చిన్న వయసులో మోకాలి జాయింట్ గాయాలైనపుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ‘లిగ్మెంట్ ఇంజూరీ’ వల్ల మోకాళ్లపై ఒత్తిడి సరిసమానంగా పడక ఒకవైపు అరిగిపోయి ‘ఆస్టియో ఆర్థరైటిస్’ వస్తుంది. చిన్నప్పుడే లిగ్మెంట్‌ల గాయాలను అశ్రద్ధ చేయకుండా ఆర్థోస్కోపి ఆపరేషన్ చేయించు కోవాలి. చిన్నపిల్లల్లో ‘ఫ్లాట్ ఫుట్’కు గతంలో అంత ప్రాధాన్యత ఇచ్చే వాళ్లం కాదు. దీనివల్ల కాళ్లపై సరిసమానంగా బరువు పడక మున్ముందు మోకాళ్లు అరిగిపోతాయి. దీనిని తల్లితండ్రులు ముందుగానే గుర్తించి వైద్యం చేయించాలి. చిన్నపుడే దానికి తగ్గట్టుగా కాలి జోళ్లు మార్చుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చు.
ఆయా సమస్యలకు మీరు చేసే సూచనలేంటి?
►డా. దశరథ: సమస్య వచ్చినపుడు అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ప్రతి ఒక్కరూ యుక్తవయసు నుంచి విటమిన్–డి, థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. 45 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులు బీఎండీ పరీక్ష చేయించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. పోషకాహారం తీసుకోవాలి. సూర్యరశ్మి తగిలేలా రోజూ కాసేపు ఎండలో కూర్చోవాలి. సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తే మంచిది. మహిళలు చిన్న చిన్న సమస్యలకే హిస్టరెక్టమీ ఆపరేషన్ల వల్ల భవిష్యత్‌లో ఎముకలు బలహీనమయ్యే అవకాశముంది. అవసరమైతేనే ఆ ఆపరేషన్లు చేయించుకోవాలి.
ఈ మధ్య నడుంనొప్పి సమస్యలు పెరుగుతున్నాయి. ఏం చేయాలి?
►డా. దశరథ: నడుం నొప్పి అనగానే ఆపరేషన్ చేసుకోవాలి... ఆ తర్వాత లేవకుండా మంచానికే పరిమితం కావాలనే అపోహ చాలామందిలో ఉంటోంది. వెన్నుపూస జారిపోయి ‘స్పాండిలో లిíస్తిసిస్’, కాళ్లలో తిమ్మిర్లు వచ్చి నడవలేకపోవడం వంటి వారికే వాస్తవంగా ఆపరేషన్ అవసరమౌతుంది. ఒట్టి నడుం నొప్పి ఉన్న వారికి ఆపరేషన్ అవసరం లేదు. ఈ నొప్పి క్రమం తప్పకుండా విపరీతంగా వస్తుంటే మిగతా ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చాయేమోనన్నది సరిచూసుకోవాలి. కొన్నిసార్లు శరీరంలో ఎక్కడైనా కేన్సర్ సోకితే అది ఎముకల్లోకి రావొచ్చు. దానివల్ల నడుం నొప్పి రావొచ్చు. నడుం నొప్పి అనేది వ్యాధి కాదు. శరీరంలో చోటుచేసుకునే అనేక అనర్థాలకు అదొక లక్షణంగానే పరిగణించాలి.
Comments
Please login to add a commentAdd a comment