సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలోపున్న పిల్లల్లో శారీరక ఎదుగుదలలేమి ఆందోళనకరంగా ఉంది. పౌష్టికాహార సమస్యల కారణంగా 35 శాతం మంది చిన్నారుల్లో ఎదుగుదల మందగించింది. దీంతో వయసుకు తగినట్లుగా శారీరక ఎత్తు ఉండటంలేదు. అలాంటివారిలో ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చనే ఆందోళన ఉంది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారుల ఎత్తు, బరువు నమోదు చేస్తుంటారు.
నెలవారీగా ఆ వివరాలను ఐసీడీఎస్ ప్రాజెక్టులకు, రాష్ట్ర కార్యాలయానికి చేరవేస్తుంటారు. ఈ గణాంకాలను విశ్లేషిస్తే చిన్నారుల్లో 17.05 శాతం మంది వయసుకు తగిన ఎత్తు లేరని తేలింది. మరో 18.52 శాతం మందిలో కూడా ఎత్తుకు తగిన బరువు లేనప్పటికీ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది. 64.43 శాతం మందిలో మాత్రం వయసుకు తగిన శారీరక ఎదుగుదల నమోదైంది.
పల్లె ప్రాంతాల్లోనే ఎక్కువ వ్యత్యాసం
33 జిల్లాలో పరిధిలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో 12.96 లక్షలమంది చిన్నారుల వయసు, ఎత్తును తూచి అంచనాలు రూపొందించారు. ఇందులో ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉన్న జిల్లాల్లోని చిన్నారులు పౌష్టికాహార సమస్యలతో ఉన్నట్లు కనిపిస్తోంది. వయసుకు తగిన ఎత్తు లేకుండా ఎక్కువ వ్యత్యాసంతో ఉన్న చిన్నారులు రాష్ట్రవ్యాప్తంగా 17.05 శాతం మంది ఉన్నారు.
రాష్ట్ర సగటు కంటే ఎక్కువశాతం చిన్నారులు గ్రామీణప్రాంతాల్లోనే ఉన్నారు. అత్యధికంగా జనగామ జిల్లాలో 28.23 శాతం మంది చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేకపోవడం గమనార్హం. ఆ తర్వాత స్థానాల్లో నారాయణపేట్(24.79%), మహబూబ్‌నగర్(21%), వికారాబాద్(26.78%), ఆదిలాబాద్(23.79%), కామారెడ్డి(21.29%), మెదక్(20.61%) జిల్లాలున్నాయి.
తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తే...
సాధారణంగా చిన్నారుల్లో ఎదుగుదల వేగంగా ఉంటుంది. మానసిక ఎదుగుదలతోపాటు శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే సరైన పౌష్టికాహారాన్ని అందించాలి. కానీ, చాలాచోట్ల చిన్నారులకు ఒకేరకమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిశీలనలు చెబుతున్నాయి. నిత్యం ఒకేరకమైన ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో ఇస్తుండటంతో కేవలం కొన్నిరకాల ప్రోటీన్లు, విటమిన్లు మాత్రమే అందుతాయి.
శరీరానికి కావాల్సిన అన్నిరకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు అందాలంటే భిన్నరకాలైన ఆహారాన్ని తగిన మోతాదులో అందించాలి. ఈ అంశాలపై గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు అవగాహన ఉండటంలేదు. దీంతో ఎదుగుదలలో లోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే పిల్లలకు ఇవ్వాల్సిన ఆహార పదార్థాలపై తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించాలని, ప్రభుత్వం కూడా విస్తృత ప్రచార కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని చిన్నపిల్లల వైద్య నిపుణులు కిశోర్ ఈగ ‘సాక్షి’తో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment