సాక్షి, వీపనగండ్ల (మహబూబ్‌నగర్): తీవ్ర అస్వస్థతకు గురైన ఓ ఇంటర్ విద్యార్థిని హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. వారి కథనం మేరకు.. మండలంలోని గోవర్ధనగిరి సర్పంచ్ చంద్రకళ, సురేశ్‌రెడ్డి ఏకైక కుమార్తె అస్మిత (17) హైదరాబాద్‌లోని నాగోల్‌శాఖ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.
4 రోజులుగా తీవ్ర జ్వరం, వాంతులు అవుతున్నా.. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. గురువారం బంధువు ఒకరు అస్మితను చూసేందుకు కళాశాలకు వెళ్లగా అస్వస్థతతో బాధపడుతూ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
విషయం తెలుసుకున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సింగిల్‌విండో చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అస్మిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment