Srichaitanya college
-
హైదరాబాద్: శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పీర్జాదిగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బాత్ రూమ్‌లో చున్నితో ఉరి వేసుకున్న విద్యార్థినిని కళాశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఆత్మహత్య చేసుకుందా? మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వనపర్తి పట్టణానికి చెందిన విద్యార్థిని హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఇదీ చదవండి: కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు -
కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి..!
సాక్షి, వీపనగండ్ల (మహబూబ్‌నగర్): తీవ్ర అస్వస్థతకు గురైన ఓ ఇంటర్ విద్యార్థిని హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. వారి కథనం మేరకు.. మండలంలోని గోవర్ధనగిరి సర్పంచ్ చంద్రకళ, సురేశ్‌రెడ్డి ఏకైక కుమార్తె అస్మిత (17) హైదరాబాద్‌లోని నాగోల్‌శాఖ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. 4 రోజులుగా తీవ్ర జ్వరం, వాంతులు అవుతున్నా.. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. గురువారం బంధువు ఒకరు అస్మితను చూసేందుకు కళాశాలకు వెళ్లగా అస్వస్థతతో బాధపడుతూ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబానికి పరామర్శ.. విషయం తెలుసుకున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సింగిల్‌విండో చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అస్మిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బూటు కాలితో తన్నిన ఘటన; మంత్రి సీరియస్
సాక్షి, తిరుపతి: శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని బూటు కాలితో తన్నిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. తిరుపతి అన్నమయ్య కూడలిలో గల సదరు కళాశాలను సీజ్ చేయాలని ఆదేశించారు. చిత్తూరు ఆర్.ఐ.ఓతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న అనంతరం ఈ మేరకు ఇంటర్మీడియేట్ విద్యాశాఖ కమిషనర్‌కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఘటనకు బాధ్యుడైన అధ్యాపకుడిపైనా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. -
ఆ మంత్రి పేషీతో నీకేం పని?
సాక్షి, హైదరాబాద్: ‘నీకు ఆ మంత్రి కార్యాలయంతో సంబం«ధం ఏంటి? పదే పదే మంత్రి పేషీలోని వ్యక్తులకు ఎందుకు ఫోన్లు చేశావు. లీకేజీ కుంభకోణం బయటకు వచ్చిన సందర్భంలో డాక్టర్ ధనుంజయ్, సందీప్‌తో చర్చిస్తూనే మంత్రి కార్యాలయానికి ఎందుకు కాల్స్ చేశావు’ఇవీ సీఐడీ కస్టడీలో ఉన్న శివనారాయణకు దర్యాప్తు అధికారులు వేసిన ప్రశ్నలు. ఎంసెట్ స్కాంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచైతన్య కాలేజీ మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించింది. శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సీఐడీ దర్యాప్తు అధికారులు ఈ ఇద్దరినీ స్కాంలోని కీలక అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఎప్పటి నుంచి పరిచయం.. ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలో ఉన్న నిందితులతో పరిచయం ఎప్పటి నుంచి ఉందో చెప్పాలని సీఐడీ అధికారులు శివనారాయణను ప్రశ్నించినట్లు తెలిసింది. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించడంతో పాటు మెడికల్ సీట్లు ఇప్పించే కర్ణాటక దావణగెరె గ్యాంగ్‌తో శివనారాయణకు లింకున్నట్లు సీఐడీ గుర్తించింది. మేనేజ్మెంట్ సీట్ల మాటున ప్రవేశ పరీక్ష పత్రాలు లీక్ చేసే గ్యాంగ్‌తో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నారో చెప్పాలని సీఐడీ ప్రశ్నించగా, కేవలం సీట్ల కోసమే సంబంధాలు కొనసాగించానని శివనారాయణ చెప్పినట్లు సమాచారం. రెండు కార్పొరేట్ కాలేజీలకే చెందిన ఆరుగురు విద్యార్థులు ఆ క్యాంపులో ఎందుకున్నారని అధికారులు వివరణ కోరారు. అయితే మంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి వచ్చేంతగా ప్రభావితం చేయడంపైనా సీఐడీ దర్యాప్తు చేసింది. సంబంధిత మంత్రి కాలేజీలకు ఏడెనిమిదేళ్లుగా విద్యార్థులను చేర్పించడం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, పశ్చిమగోదావరి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పరిచయాలున్నాయని శివనారాయణ వివరించే ప్రయత్నం చేశాడని సీఐడీ వర్గాలు తెలిపాయి. అయితే మంత్రి పేషీలో పనిచేస్తున్న వారి సంబంధీకుల పిల్లలకు కాలేజీల్లో ఫీజు తగ్గించాలని కోరేవారని, అందుకే ఫోన్ మాట్లాడినట్లు శివనారాయణ సీఐడీ అధికారులు వివరించినట్లు తెలిసింది. ధనుంజయ్‌తో పరిచయం వెనుక.. లీకేజీ స్కాంలో కీలకంగా ఉంటూ వస్తున్న బిహార్‌లోని పట్నా వాసి, ధావనగిరి మెడికో ధనుంజయ్‌తో ఎందుకు టచ్‌లో ఉన్నారని ప్రశ్నించగా, సందీప్‌తో పాటు గణేశ్ ప్రసాద్ ద్వారా అతడు పరిచయం అయ్యాడని, విద్యార్థులకు కర్నాటకలోని బెంగళూర్, బీదర్ తదితర ప్రాంతాల్లో మెడికల్ సీట్లు ఇప్పించేవాడని చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ్ గురించి తెలిసే సంబంధాలు పెట్టుకున్నావా అని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, తన స్నేహితుల పిల్లల కోసమే తాను ఈ స్కాంలో పాలుపంచుకున్నానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ విద్యార్థులతో పనేంటి? వాసుబాబుపైనా సీఐడీ భారీస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. వాసుబాబు పనిచేసిన కాలేజీల విద్యార్థులే లీకేజీ మాఫియా క్యాంపులకు ఎక్కువగా వెళ్లడం, వారికే మంచి ర్యాంకుల రావడంపైనా దర్యాప్తు అధికారులు సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు సీఐడీ వాంగ్మూలాలు సేకరించిన 136 మందిలో ఒకే కార్పొరేట్ సంస్థకు చెందిన 86 మంది విద్యార్థులు క్యాంపునకు వెళ్లడంపై వాసుబాబును అధికారులు ప్రశ్నించారు. పూర్వ విద్యార్థులతో సంబంధాలున్నాయా అని ప్రశ్నించగా, తన స్నేహితుల పిల్లల కోసమే సందీప్, గణేశ్ ప్రసాద్‌తో టచ్‌లో ఉన్నట్లు వివరించారని తెలిసింది. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడారో చెప్పాలని ప్రశ్నించగా ఏమీ చెప్పలేదని తెలిసింది. 2016 ఎంసెట్ లీకేజీలోనే తాను సందీప్, గణేశ్ ప్రసాద్‌తో టచ్‌లో ఉన్నట్లు వాసుబాబు చెప్పగా, సందీప్, గణేశ్ ప్రసాద్ వివరించిన అంశాలను సీఐడీ అధికారులు ముందుపెట్టడంతో వాసుబాబు ఖంగుతిన్నట్లు తెలిసింది. 2015, 2014లోనూ సందీప్, గణేశ్ ప్రసాద్‌తో ఉన్నారని, అప్పుడు కూడా విద్యార్థులకు సీట్ల పేరుతో సంబంధాలు నడిపినట్లు ఆధారాలున్నాయని చెప్పగా వాసుబాబు నోరుమెదపలేని తెలిసింది. తాను ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చానని, మిగతా వాళ్లతో సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి. ఎంసెట్ స్కాం దర్యాప్తులో భాగంగా గతంలో విచారణ సందర్భంగా ఏం జరిగిందని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అప్పటి అధికారులు గంట పాటు ప్రశ్నించి వదిలేశారని చెప్పినట్లు తెలిసింది. అలా ఎందుకు వదిలేశారని, ఎక్కడినుంచి ఒత్తిడి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించగా, తనకేం తెలియదని సమాచారం. కటక్‌కు శివనారాయణ.. లీకైన ఎంసెట్ ప్రశ్నపత్రంపై విద్యార్థులను కటక్ తీసుకెళ్లిన శివనారాయణను అక్కడికి తరలించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. కటక్‌లోని ఏ హోటల్లో మూడ్రోజుల పాటు శిక్షణ ఇప్పించారు.. ఎవరి ద్వారా ప్రశ్నపత్రం తీసుకొచ్చారు వంటి వాటిపై అధికారులు ఆరా తీయనున్నారు. కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సీఐడీ విచారించింది. శివనారాయణ, వాసుబాబును వేర్వేరుగా తల్లిదండ్రుల ఎదుట ప్రశ్నించినట్లు తెలిసింది. కస్టడీ మొదటి రోజులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా మరికొంత మంది బ్రోకర్ల అరెస్టుకు సీఐడీ 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. -
అందరూ ఆ కాలేజీ పక్షులే!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో మరో కీలకమైన లింకు బయటపడింది. ఈ కేసుకు సంబంధించి శ్రీచైతన్య కాలేజీలో డీన్‌గా పని చేసిన వాసుబాబు ఇప్పటికే అరెస్ట్ కాగా.. తాజాగా అదే కాలేజీలో చదువుకుని వైద్య విద్య ఫైనలియర్ చదువుతున్న విజయవాడకు చెందిన డాక్టర్ గణేశ్ ప్రసాద్ అరెస్టవడం సంచలనం రేపు తోంది. ప్రస్తుతం కర్ణాటక ధావనగిరిలోని మెడికల్ యూనివర్సిటీలో గణేశ్ చదువుతున్నాడు. ఇతడి సోదరుడు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ పూర్తి చేయ గా, ఎంసెట్ రాసేందుకు సిద్ధమయ్యాడు. గణేశ్ తన స్నేహితులతో కలసి ఎంసెట్ ప్రశ్నపత్రంపై భువనేశ్వర్‌లో క్యాంపు నిర్వహించాడు. తన సోదరుడితోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి, డోర్నకల్‌కు చెందిన మరో విద్యార్థిని క్యాంపునకు తీసుకెళ్లాడు. వారితో రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకుని.. అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు వసూలు చేసినట్టు సీఐడీ విచారణలో బయటపడింది. డాక్టర్లు సందీప్, ధనుం జయ్‌లతో వాసుబాబుకు లింకు బయటపడటం, వాసుబాబుతో గణేశ్ లింకు బయటపడటంతో అధికారులకు క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ర్యాంకుల వెనుక గుట్టు శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ అరెస్ట్‌తో.. తీగ లాగితే డొంక కదిలినట్టు చిట్టా బయటపడుతోంది. శివనారాయణ లింకులో బిహార్‌కు చెందిన మరో డాక్టర్, ఇద్దరు బ్రోకర్ల పాత్ర వెలుగులోకి రావాల్సి ఉందని సీఐడీ భావిస్తోంది. దీంతో వాసుబాబుతోపాటు శివనారాయణను మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గణేశ్ అరెస్ట్‌తో నిందితుల జాబితా 90కి చేరింది. -
సెలవు అడిగినందుకు విద్యార్థులపై దాడి
► విద్యార్ధులపై సిబ్బంది దాడి ► నిరసనగా విద్యార్ధి సంఘాల ఆందోళన.. ► ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం. చైతన్యపురి: గడ్డిఅన్నారం డివిజన్ వీవీనగర్ పాణనీయ క్యాంపస్‌లోని శ్రీచైతన్య రెసిడెన్షియల్ కళాశాలలో శుక్రవారం హోమ్ సిక్ సెలవులు ఇవ్వాలని అడిగినందుకు విద్యార్థులపై సిబ్బంది దాడి చేశారు. దీంతో విద్యార్ధి సంఘాల నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగటంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లో వెళితే శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు హోమ్‌సిక్ సెలవులు ఇచ్చినందున తమకు కూడా సెలవులు ఇవ్వాలని ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్, ఇంచార్జిలను కోరారు. అయితే వారు అందుకు అంగీకరించకపోవడంతో విద్యార్థులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో కళాశాల సిబ్బంది జోక్యం చేసుకుని గొడవకు దిగిన 18మంది విద్యార్ధులను చితకబాదారు. దీనిపై సమాచారం అం దడంతో ఏబీవీపీ నేతలు శ్రవణ్ ఆద్వర్యంలో శనివారం ఉదయం కళాశాలకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ సందర్భం గా కాలేజీలో అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వం సం చేశారు. సరూర్‌నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎన్ఎస్యూఐ, గిరిజన సంఘాలు యాజ మాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్ధులపై దాడి చేసిన సిబ్బం దిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశా రు. కాగా కాలేజీకి సెలవులు ప్రకటించటంతో విద్యార్ధులు ఇళ్లకు వెళ్లారు. కేసులు నమోదు... విద్యార్ధుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది వేణుగౌడ్, యాకూబ్, నానిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ లింగయ్య తెలిపారు. కళాశాల ఫర్నీచర్ ధ్వంసం చేసిన విద్యార్ధి నేతలు శ్రవణ్, అయ్యప్ప, మహేష్ మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు సెలవులు ఇవ్వమని అడిగినందుకు విద్యార్ధులపై శ్రీచైతన్య సిబ్బంది దాడి చేసిన విషయం తెలసుకున్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఇందుకు బాధ్యులైన పీఆర్ఓ వేణు, జూనియర్ లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆయనకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచార ణ జరిపి ఆగస్టు 10లోగా నివేదిక ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఎల్బీనగర్ డీసీపీని ఆదేశించినట్లు అచ్యుతరావు తెలిపారు.