ఆ మంత్రి పేషీతో నీకేం పని? | CID Questioned Accused In EAMCET Paper Leak 2016 | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 14 2018 2:17 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

CID Questioned Accused In EAMCET Paper Leak 2016 - Sakshi

ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ నిందితులను కస్టడీలోకి తీసుకుంటున్న సీఐడీ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ‘నీకు ఆ మంత్రి కార్యాలయంతో సంబం«ధం ఏంటి? పదే పదే మంత్రి పేషీలోని వ్యక్తులకు ఎందుకు ఫోన్లు చేశావు. లీకేజీ కుంభకోణం బయటకు వచ్చిన సందర్భంలో డాక్టర్‌ ధనుంజయ్, సందీప్‌తో చర్చిస్తూనే మంత్రి కార్యాలయానికి ఎందుకు కాల్స్‌ చేశావు’ఇవీ సీఐడీ కస్టడీలో ఉన్న శివనారాయణకు దర్యాప్తు అధికారులు వేసిన ప్రశ్నలు. ఎంసెట్‌ స్కాంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచైతన్య కాలేజీ మాజీ డీన్‌ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్‌ శివనారాయణపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించింది. శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సీఐడీ దర్యాప్తు అధికారులు ఈ ఇద్దరినీ స్కాంలోని కీలక అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది.  

ఎప్పటి నుంచి పరిచయం..
ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలో ఉన్న నిందితులతో పరిచయం ఎప్పటి నుంచి ఉందో చెప్పాలని సీఐడీ అధికారులు శివనారాయణను ప్రశ్నించినట్లు తెలిసింది. కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించడంతో పాటు మెడికల్‌ సీట్లు ఇప్పించే కర్ణాటక దావణగెరె గ్యాంగ్‌తో శివనారాయణకు లింకున్నట్లు సీఐడీ గుర్తించింది. మేనేజ్‌మెంట్‌ సీట్ల మాటున ప్రవేశ పరీక్ష పత్రాలు లీక్‌ చేసే గ్యాంగ్‌తో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నారో చెప్పాలని సీఐడీ ప్రశ్నించగా, కేవలం సీట్ల కోసమే సంబంధాలు కొనసాగించానని శివనారాయణ చెప్పినట్లు సమాచారం. రెండు కార్పొరేట్‌ కాలేజీలకే చెందిన ఆరుగురు విద్యార్థులు ఆ క్యాంపులో ఎందుకున్నారని అధికారులు వివరణ కోరారు.

అయితే మంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి వచ్చేంతగా ప్రభావితం చేయడంపైనా సీఐడీ దర్యాప్తు చేసింది. సంబంధిత మంత్రి కాలేజీలకు ఏడెనిమిదేళ్లుగా విద్యార్థులను చేర్పించడం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, పశ్చిమగోదావరి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పరిచయాలున్నాయని శివనారాయణ వివరించే ప్రయత్నం చేశాడని సీఐడీ వర్గాలు తెలిపాయి. అయితే మంత్రి పేషీలో పనిచేస్తున్న వారి సంబంధీకుల పిల్లలకు కాలేజీల్లో ఫీజు తగ్గించాలని కోరేవారని, అందుకే ఫోన్‌ మాట్లాడినట్లు శివనారాయణ సీఐడీ అధికారులు వివరించినట్లు తెలిసింది.

ధనుంజయ్‌తో పరిచయం వెనుక..
లీకేజీ స్కాంలో కీలకంగా ఉంటూ వస్తున్న బిహార్‌లోని పట్నా వాసి, ధావనగిరి మెడికో ధనుంజయ్‌తో ఎందుకు టచ్‌లో ఉన్నారని ప్రశ్నించగా, సందీప్‌తో పాటు గణేశ్‌ ప్రసాద్‌ ద్వారా అతడు పరిచయం అయ్యాడని, విద్యార్థులకు కర్నాటకలోని బెంగళూర్, బీదర్‌ తదితర ప్రాంతాల్లో మెడికల్‌ సీట్లు ఇప్పించేవాడని చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ్‌ గురించి తెలిసే సంబంధాలు పెట్టుకున్నావా అని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, తన స్నేహితుల పిల్లల కోసమే తాను ఈ స్కాంలో పాలుపంచుకున్నానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

మాజీ విద్యార్థులతో పనేంటి?
వాసుబాబుపైనా సీఐడీ భారీస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. వాసుబాబు పనిచేసిన కాలేజీల విద్యార్థులే లీకేజీ మాఫియా క్యాంపులకు ఎక్కువగా వెళ్లడం, వారికే మంచి ర్యాంకుల రావడంపైనా దర్యాప్తు అధికారులు సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు సీఐడీ వాంగ్మూలాలు సేకరించిన 136 మందిలో ఒకే కార్పొరేట్‌ సంస్థకు చెందిన 86 మంది విద్యార్థులు క్యాంపునకు వెళ్లడంపై వాసుబాబును అధికారులు ప్రశ్నించారు.

పూర్వ విద్యార్థులతో సంబంధాలున్నాయా అని ప్రశ్నించగా, తన స్నేహితుల పిల్లల కోసమే సందీప్, గణేశ్‌ ప్రసాద్‌తో టచ్‌లో ఉన్నట్లు వివరించారని తెలిసింది. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడారో చెప్పాలని ప్రశ్నించగా ఏమీ చెప్పలేదని తెలిసింది. 2016 ఎంసెట్‌ లీకేజీలోనే తాను సందీప్, గణేశ్‌ ప్రసాద్‌తో టచ్‌లో ఉన్నట్లు వాసుబాబు చెప్పగా, సందీప్, గణేశ్‌ ప్రసాద్‌ వివరించిన అంశాలను సీఐడీ అధికారులు ముందుపెట్టడంతో వాసుబాబు ఖంగుతిన్నట్లు తెలిసింది. 2015, 2014లోనూ సందీప్, గణేశ్‌ ప్రసాద్‌తో ఉన్నారని, అప్పుడు కూడా విద్యార్థులకు సీట్ల పేరుతో సంబంధాలు నడిపినట్లు ఆధారాలున్నాయని చెప్పగా వాసుబాబు నోరుమెదపలేని తెలిసింది.

తాను ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చానని, మిగతా వాళ్లతో సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి. ఎంసెట్‌ స్కాం దర్యాప్తులో భాగంగా గతంలో విచారణ సందర్భంగా ఏం జరిగిందని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అప్పటి అధికారులు గంట పాటు ప్రశ్నించి వదిలేశారని చెప్పినట్లు తెలిసింది. అలా ఎందుకు వదిలేశారని, ఎక్కడినుంచి ఒత్తిడి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించగా, తనకేం తెలియదని సమాచారం.

కటక్‌కు శివనారాయణ..
లీకైన ఎంసెట్‌ ప్రశ్నపత్రంపై విద్యార్థులను కటక్‌ తీసుకెళ్లిన శివనారాయణను అక్కడికి తరలించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. కటక్‌లోని ఏ హోటల్‌లో మూడ్రోజుల పాటు శిక్షణ ఇప్పించారు.. ఎవరి ద్వారా ప్రశ్నపత్రం తీసుకొచ్చారు వంటి వాటిపై అధికారులు ఆరా తీయనున్నారు. కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సీఐడీ విచారించింది. శివనారాయణ, వాసుబాబును వేర్వేరుగా తల్లిదండ్రుల ఎదుట ప్రశ్నించినట్లు తెలిసింది. కస్టడీ మొదటి రోజులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా మరికొంత మంది బ్రోకర్ల అరెస్టుకు సీఐడీ 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement