eamcet paper leakage scam
-
ఎంసెట్-2 పేపర్ లీకేజీలో మరో 16 మంది..!
సాక్షి, హైదరాబాద్: 2016లో సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణంలో నిందితులు వాసుబాబు, శివ నారాయణ గత కొంత కాలంగా సీఐడీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టులో బుధవారం హాజరుపరిచారు. కాగా, కోర్టు నిందితులిద్దరికీ 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. తమ విచారణలో కేసుకు సంబంధించి కీలక సూత్రధారిని గుర్తించినట్లు సీఐడీ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఒక కార్పొరేట్ సంస్థకు చెందిన కీలక వ్యక్తికి ఈ లీకేజీ వ్యవహారంలో పాత్ర ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అతన్ని అరెస్టు చేయనున్నట్టు తెలిపారు. ఈ కేసుతో ఎవరెవరికి సంబంధాలున్నాయో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ఆరు క్యాంపులు నిర్వహించామనీ, మరో 16 మందికి ఈ కేసులో ప్రమేయం ఉందని గుర్తించినట్టు సీఐడీ పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడు మెడికో గణేష్ ప్రసాద్‌ను వారం రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు సీఐడీ కోర్టులో పిటిషన్ వేసింది. వాసుబాబు, శివ నారాయణలు శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో ఉద్యోగులు అన్న సంగతి తెలిసిందే. -
రెండో రోజూ కొనసాగిన ‘ఎంసెట్’ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ, శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబుల విచారణ రెండో రోజు కూడా కొనసాగింది. శివనారాయణ ద్వారా మరిన్ని వివరాలు రాబట్టేందుకు శనివారం మధ్యాహ్నం అతన్ని కటక్ తీసుకెళ్లినట్లు సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులతో కటక్‌లోనే శివనారాయణ క్యాంపు నడిపినందున అక్కడి బ్రోకర్ల జాడ తెలిసే అవకాశముందని, క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ కూడా చేయాల్సి ఉండటంతో అతన్ని అక్కడికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇక శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబును హైదరాబాద్‌లో మరో బృందం విచారించింది. ముగ్గురు విద్యార్థులకే కాకుండా మరో నలుగురికి వాసుబాబు ప్రశ్నపత్రం ఇచ్చినట్లు విచారణలో సీఐడీ గుర్తించింది. కానీ, తాను ముగ్గురినే క్యాంపునకు తరలించినట్లు వాసు చెబుతుండటంతో రుజువులతో సహా ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేలో పరీక్ష జరగాల్సి ఉండగా ఫిబ్రవరి నుంచే కొంతమంది విద్యార్థులతో వాసు టచ్‌లో ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. దీంతో వారితో వాసు ఎందుకు టచ్‌లో ఉన్నాడో చెప్పాలని సీఐడీ ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే రెండు రాష్ట్రాల్లోని శ్రీచైతన్య కళాశాలల విద్యార్థులను హైదరాబాద్ పిలిపించి మాట్లాడారని, ప్రశ్నపత్రం వ్యవహారంపైనే చర్చించారా అని అధికారులు వివరణ కోరినట్లు తెలిసింది. మళ్లీ బ్రోకర్ల విచారణ వాసుబాబు, శివనారాయణ ద్వారా విద్యార్థులను క్యాంపులకు పంపిన తల్లిదండ్రుల వాంగ్మూలాలు సేకరించాలని సీఐడీ నిర్ణయించింది. వారిరువురూ డీల్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను వారి ముందే ప్రశ్నించనుంది. రూ.35 లక్షల చొప్పున డీల్ సెట్ చేసుకున్న వీరు అడ్వాన్స్‌గా ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు, పూచీకత్తుగా పదో తరగతి సర్టిఫికెట్లు తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. వీరి నుంచి రికవరీ లేకపోవడంతో ఈ రెండు అంశాలపై తల్లిదండ్రుల నుంచి వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి అంశంపైనా వారు పొంతన లేకుండా వ్యవహరించడంతో సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎక్కడా సరిగా సమాధానాలు చెప్పడం లేదని అధికారులు తెలిపారు. వీరికి ఎవరెవరితో సంబంధాలున్నాయో ఆయా బ్రోకర్లను సైతం మళ్లీ విచారణకు పిలుస్తున్నామని ఉన్నతాధి కారి ఒకరు చెప్పారు. అప్పుడే వారి బాగోతం వెలు గులోకి వస్తుందని, కార్పొరేట్ సంస్థల చీకటి వ్యవహా రం కూడా ఆధారాలతో బయటపడుతుందన్నారు. -
ఆ మంత్రి పేషీతో నీకేం పని?
సాక్షి, హైదరాబాద్: ‘నీకు ఆ మంత్రి కార్యాలయంతో సంబం«ధం ఏంటి? పదే పదే మంత్రి పేషీలోని వ్యక్తులకు ఎందుకు ఫోన్లు చేశావు. లీకేజీ కుంభకోణం బయటకు వచ్చిన సందర్భంలో డాక్టర్ ధనుంజయ్, సందీప్‌తో చర్చిస్తూనే మంత్రి కార్యాలయానికి ఎందుకు కాల్స్ చేశావు’ఇవీ సీఐడీ కస్టడీలో ఉన్న శివనారాయణకు దర్యాప్తు అధికారులు వేసిన ప్రశ్నలు. ఎంసెట్ స్కాంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచైతన్య కాలేజీ మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించింది. శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సీఐడీ దర్యాప్తు అధికారులు ఈ ఇద్దరినీ స్కాంలోని కీలక అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఎప్పటి నుంచి పరిచయం.. ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలో ఉన్న నిందితులతో పరిచయం ఎప్పటి నుంచి ఉందో చెప్పాలని సీఐడీ అధికారులు శివనారాయణను ప్రశ్నించినట్లు తెలిసింది. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించడంతో పాటు మెడికల్ సీట్లు ఇప్పించే కర్ణాటక దావణగెరె గ్యాంగ్‌తో శివనారాయణకు లింకున్నట్లు సీఐడీ గుర్తించింది. మేనేజ్మెంట్ సీట్ల మాటున ప్రవేశ పరీక్ష పత్రాలు లీక్ చేసే గ్యాంగ్‌తో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నారో చెప్పాలని సీఐడీ ప్రశ్నించగా, కేవలం సీట్ల కోసమే సంబంధాలు కొనసాగించానని శివనారాయణ చెప్పినట్లు సమాచారం. రెండు కార్పొరేట్ కాలేజీలకే చెందిన ఆరుగురు విద్యార్థులు ఆ క్యాంపులో ఎందుకున్నారని అధికారులు వివరణ కోరారు. అయితే మంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి వచ్చేంతగా ప్రభావితం చేయడంపైనా సీఐడీ దర్యాప్తు చేసింది. సంబంధిత మంత్రి కాలేజీలకు ఏడెనిమిదేళ్లుగా విద్యార్థులను చేర్పించడం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, పశ్చిమగోదావరి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పరిచయాలున్నాయని శివనారాయణ వివరించే ప్రయత్నం చేశాడని సీఐడీ వర్గాలు తెలిపాయి. అయితే మంత్రి పేషీలో పనిచేస్తున్న వారి సంబంధీకుల పిల్లలకు కాలేజీల్లో ఫీజు తగ్గించాలని కోరేవారని, అందుకే ఫోన్ మాట్లాడినట్లు శివనారాయణ సీఐడీ అధికారులు వివరించినట్లు తెలిసింది. ధనుంజయ్‌తో పరిచయం వెనుక.. లీకేజీ స్కాంలో కీలకంగా ఉంటూ వస్తున్న బిహార్‌లోని పట్నా వాసి, ధావనగిరి మెడికో ధనుంజయ్‌తో ఎందుకు టచ్‌లో ఉన్నారని ప్రశ్నించగా, సందీప్‌తో పాటు గణేశ్ ప్రసాద్ ద్వారా అతడు పరిచయం అయ్యాడని, విద్యార్థులకు కర్నాటకలోని బెంగళూర్, బీదర్ తదితర ప్రాంతాల్లో మెడికల్ సీట్లు ఇప్పించేవాడని చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ్ గురించి తెలిసే సంబంధాలు పెట్టుకున్నావా అని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, తన స్నేహితుల పిల్లల కోసమే తాను ఈ స్కాంలో పాలుపంచుకున్నానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ విద్యార్థులతో పనేంటి? వాసుబాబుపైనా సీఐడీ భారీస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. వాసుబాబు పనిచేసిన కాలేజీల విద్యార్థులే లీకేజీ మాఫియా క్యాంపులకు ఎక్కువగా వెళ్లడం, వారికే మంచి ర్యాంకుల రావడంపైనా దర్యాప్తు అధికారులు సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు సీఐడీ వాంగ్మూలాలు సేకరించిన 136 మందిలో ఒకే కార్పొరేట్ సంస్థకు చెందిన 86 మంది విద్యార్థులు క్యాంపునకు వెళ్లడంపై వాసుబాబును అధికారులు ప్రశ్నించారు. పూర్వ విద్యార్థులతో సంబంధాలున్నాయా అని ప్రశ్నించగా, తన స్నేహితుల పిల్లల కోసమే సందీప్, గణేశ్ ప్రసాద్‌తో టచ్‌లో ఉన్నట్లు వివరించారని తెలిసింది. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడారో చెప్పాలని ప్రశ్నించగా ఏమీ చెప్పలేదని తెలిసింది. 2016 ఎంసెట్ లీకేజీలోనే తాను సందీప్, గణేశ్ ప్రసాద్‌తో టచ్‌లో ఉన్నట్లు వాసుబాబు చెప్పగా, సందీప్, గణేశ్ ప్రసాద్ వివరించిన అంశాలను సీఐడీ అధికారులు ముందుపెట్టడంతో వాసుబాబు ఖంగుతిన్నట్లు తెలిసింది. 2015, 2014లోనూ సందీప్, గణేశ్ ప్రసాద్‌తో ఉన్నారని, అప్పుడు కూడా విద్యార్థులకు సీట్ల పేరుతో సంబంధాలు నడిపినట్లు ఆధారాలున్నాయని చెప్పగా వాసుబాబు నోరుమెదపలేని తెలిసింది. తాను ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చానని, మిగతా వాళ్లతో సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి. ఎంసెట్ స్కాం దర్యాప్తులో భాగంగా గతంలో విచారణ సందర్భంగా ఏం జరిగిందని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అప్పటి అధికారులు గంట పాటు ప్రశ్నించి వదిలేశారని చెప్పినట్లు తెలిసింది. అలా ఎందుకు వదిలేశారని, ఎక్కడినుంచి ఒత్తిడి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించగా, తనకేం తెలియదని సమాచారం. కటక్‌కు శివనారాయణ.. లీకైన ఎంసెట్ ప్రశ్నపత్రంపై విద్యార్థులను కటక్ తీసుకెళ్లిన శివనారాయణను అక్కడికి తరలించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. కటక్‌లోని ఏ హోటల్లో మూడ్రోజుల పాటు శిక్షణ ఇప్పించారు.. ఎవరి ద్వారా ప్రశ్నపత్రం తీసుకొచ్చారు వంటి వాటిపై అధికారులు ఆరా తీయనున్నారు. కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సీఐడీ విచారించింది. శివనారాయణ, వాసుబాబును వేర్వేరుగా తల్లిదండ్రుల ఎదుట ప్రశ్నించినట్లు తెలిసింది. కస్టడీ మొదటి రోజులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా మరికొంత మంది బ్రోకర్ల అరెస్టుకు సీఐడీ 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. -
ఎంసేట్ లీకేజీ కేసు: 100కు చేరిన నిందితులు
సాక్షి, హైదరాబాద్ : రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ (మెడికల్) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితులు శ్రీచైతన్య కాలేజీల డీన్ ఓలేటి వాసుబాబు(ఏ–89), ఏజెంట్ శివ నారాయణ రావు(ఏ90)లను మూడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ శనివారం నాంపల్లి కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. గత గురువారమే సీఐడీ ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వాసుబాబును శ్రీచైతన్య యాజమాన్యం సస్పెండ్ చేసింది. వాసుబాబు రిమాండ్ రిపోర్టు సాక్షికి అందింది. ఈ రిపోర్ట్‌లో కేసుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కొడుకు మెడిసిన్ సీటు కోసమే వాసుబాబు 2015లో తొలి సారి ఈ లీకేజీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ సందీప్‌కుమార్‌ను కలిసాడని తెలుస్తోంది. 2016లో అతని కొడుకుకు కర్ణాటకలో మెడిసిన్ సీటు లభించిందని, ఈ పరిచయంతోనే సందీప్ హైదరాబాద్‌కు వచ్చినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. ఈ తరుణంలోనే చైతన్య కాలేజీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులతో సందీప్ ఒక్కో విద్యార్థికి రూ.36 లక్షలు చోప్పున బేరం కుదుర్చుకొని, అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి నుంచి 9 లక్షలు తీసుకున్నాడు. ఈ లీకేజీ వ్యవహారంపై గుంటూరు శివనారయణకు కూడా సమాచారం అందించడంతో.. గుంటూరు నుంచి మరో ముగ్గురు విద్యార్థులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విద్యార్థులను భువనేశ్వర్ క్యాంప్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 64 మంది అరెస్ట్‌కాగా 26 మంది పరారీలో ఉన్నారు. తాజాగా మరో పది మంది నిందితులను సీఐడీ గుర్తించింది. దీంతో మొత్తం నిందితుల సంఖ్య 100కు చేరింది. దేశవ్యాప్తంగా ఆరు చోట్ల బెంగళూరు, ముంబై, పుణె, షిర్డీ, కోల్‌కతా, భువనేశ్వర్‌ల్లో క్యాంపులు నిర్వహించనట్లు సీఐడీ గుర్తించింది. 85 మందిని సాక్ష్యులుగా చూపిన సీఐడీ.. వీరిలో విద్యార్ధులు, వారి తల్లితండ్రులను కూడా సాక్ష్యులుగా చూపింది. -
డీన్ వాసుబాబు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
-
ఎంసెట్ లీకేజీ కేసులో శ్రీచైతన్య డీన్
-
ఎంసెట్ కేటు.. కార్పొ‘రేటు’
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ (మెడికల్) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కార్పొరేట్ కాలేజీల డొంక కదులుతోంది! ఇన్నాళ్లు లీకేజీకి పాల్పడ్డ నిందితులతోపాటు సాదాసీదా బ్రోకర్లను కటకటాల్లోకి నెట్టిన సీఐడీ తాజాగా ప్రముఖ కార్పొరేట్ కాలేజీ శ్రీచైతన్య డీన్ ఓలేటి వాసుబాబును అరెస్ట్ చేసింది. ఈయనకు సహకరిస్తూ విద్యార్థులను క్యాంపులకు తరలించిన ఏజెంట్ కమ్మ వెంకట శివ నారాయణ రావును కూడా గురువారం అరెస్ట్ చేసింది. దిల్సుఖ్నగర్ శ్రీచైతన్య బ్రాంచ్‌తోపాటు మరో ఆరు కేంద్రాల్లోని కాలేజీలకు ఓలేటి వాసుబాబు(ఏ–89) డీన్‌గా వ్యవహరిస్తున్నాడు. గుంటూరుకు చెందిన శివ నారాయణ రావు(ఏ90).. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించే ఏజెంట్. వీరిద్దరూ ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ ధనుంజయ్ థాకీర్, డాక్టర్ సందీప్‌కుమార్‌తో డీల్ కుదుర్చుకున్నారు. కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిండ్రులకు మెడికల్ సీట్లు ఇప్పిస్తామని చెప్పి ముందుగానే ప్రశ్నపత్రం ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్ కేంద్రంగా నడిచిన ప్రిపరేషన్ క్యాంపునకు ఆరుగురు విద్యార్థులను పంపారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 లక్షలు వసూలు చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. మరో ప్రముఖ కాలేజీకి సంబంధం? ప్రముఖ కార్పొరేట్ కాలేజీలకు ఎంసెట్ లీకేజీ స్కాంతో లింకులుండటం సంచలనంగా మారింది. డీన్ వాసుబాబు నిందితులతో పదేపదే మాట్లాడటంతోపాటు మరికొందరు విద్యార్థులను చేర్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఏజెంట్ శివ నారాయణ నుంచి మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉందని, మరో ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా ఆయన టచ్‌లో ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలిపారు. వీరిద్దరూ ప్రధాన నిందితులతో స్కాం బయటపడిన తర్వాత కూడా టచ్‌లో ఉండటం, విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లపై మరింత స్పష్టత రావాల్సి ఉందని దర్యాప్తు అధికారులు వివరించారు. అధికారుల పిల్లలకూ ‘ముందస్తు’ శిక్షణ శివ నారాయణ, డీన్ వాసుబాబు తీసుకువెళ్లిన విద్యార్థుల్లో కొందరు ప్రభుత్వాధికారుల పిల్లలుండటం సీఐడీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇద్దరు ఐఏఎస్ అధికారుల పిల్లలతోపాటు ఆరుగురు ప్రభుత్వాధికారుల పిల్లలు కూడా లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ కోసం కటక్ క్యాంపునకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సీఐడీ అధికారులు స్పందించడం లేదు. శ్రీచైతన్య కాకుండా మరో ప్రముఖ కాలేజీ విద్యార్థులను సైతం వాసుబాబు కటక్‌లో శిక్షణకు తరలించినట్టు సీఐడీ గుర్తించింది. మరో 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన ఫోన్ ద్వారా పదే పదే టచ్‌లో ఉన్నట్టు తేలింది. ఈ మేరకు సీఐడీ ఆధారాలు సేకరించింది. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి. కాలేజీ కోసమే చేశా.. తమ కాలేజీకి పేరు తీసుకువచ్చేందుకే ఈ స్కాంలో పాలు పంచుకున్నట్టు డీన్ వాసుబాబు తన వాంగ్మూలంలో ఒప్పుకున్నాడని సీఐడీ తెలిపింది. తల్లిదండ్రులను ఒప్పించి క్యాంపునకు పంపినట్టు ఆయన తెలిపాడు. తాను పంపిన ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురికి మంచి ర్యాంకులు వచ్చాయని, దీంతో వారి నుంచి మరింత డబ్బు వసూలు చేసేందుకు కూడా ఒప్పందం కుదిరినట్టు విచారణలో తేలింది. దర్యాప్తులో ఎందుకింత ఆలస్యం? సరిగ్గా రెండేళ్ల క్రితం ఎంసెట్ లీకేజీపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ చేసినవారితోపాటు ఇతర నిందితులు అరెస్ట్ చేస్తూ వచ్చింది. మొదటి రెండు నెలల్లోనే 22 మంది కీలక నిందితులను అరెస్ట్ చేసిన సీఐడీ ఆ తర్వాతి రెండు నెలల్లోనే 64 మంది బ్రోకర్లను జైలుకు పంపించింది. కానీ ఆ తర్వాత నుంచి కేసు దర్యాప్తు నెమ్మదించింది. అయితే మొదట్లోనే శ్రీచైతన్య, మరో కార్పొరేట్ కాలేజీకి లింకుందని తెలిసినా ఎందుకు పట్టించుకోలేదన్న దానిపై ఇప్పుడు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో విచారించిన అధికారులు ఎవరి ఒత్తిడి మేరకు వారిని నిందితుల జాబితాలో చేర్చకుండా వదిలేశారు? దీని వెనుక ఎంత మొత్తం చేతులు మారిందన్న దానిపై ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. గతంలో ఇదే కేసులో అక్రమాలకు పాల్పడ్డ ఓ డీఎస్పీతోపాటు మరో ఇన్స్పెక్టర్, ఇతర సిబ్బందిని సీఐడీ అధికారులు సస్పెండ్ చేశారు. అయినా జంకని అధికారులు శ్రీచైతన్య డీన్‌తోపాటు ఏజెంట్‌ను వదిలిపెట్టడంపై ఇప్పుడు అంతర్గత విచారణ జరుపుతున్నట్టు సీఐడీ కీలక అధికారి ఒకరు చెప్పారు. పిలిచి పంపించారు గతేడాది ఆగస్టులో శ్రీచైతన్య డీన్ ఓలేటి వాసుబాబును ఓ సీనియర్ అధికారి విచారణకు పిలిచి పంపించి వేసినట్టు తాజాగా బయటపడింది. ఎందుకు పిలిచారు, ఎందుకు పంపించి వేశారు? కనీసం వాంగ్మూలం కూడా ఎందుకు రికార్డు చేయలేదు? సీఐడీ అదనపు డీజీపీకి కూడా తెలియకుండా నిందితుల జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఆరోపణల జాబితాలో ఉన్న మరో కాలేజీ హైదరాబాద్ కీలక బ్రాంచ్ ప్రిన్సిపల్‌ను సైతం దర్యాప్తు అధికారి ఓ హోటల్‌కు పిలిపించి వదిలేయడంపైనా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి సెల్‌ఫోన్ డేటాను పరిశీలిస్తే సంబంధిత ఉన్నతాధికారితోపాటు ఓ ఇన్స్పెక్టర్, మరో డీఎస్పీ వ్యవహారం బయటపడుతుందని సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తు అధికారులు మార్పు వెనుక.. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నాటినుంచి ఎనిమిది మంది దర్యాప్తు అధికారులు మారడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు దేశవ్యాప్తంగా లింకులుండటంతో ఒక సీనియర్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించి బృందాలను ఏర్పాటు చేసి అరెస్టులు కొనసాగించారు. అయితే ఇదే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు దర్యాప్తు అధికారి మారిపోవడం, సస్పెన్షన్‌కు గురవడంతో అనుమానాలు తీవ్రమయ్యాయి. పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ఒత్తిళ్ల వల్లే తాను స్వచ్ఛందంగా దర్యాప్తు నుంచి తప్పుకున్నట్టు గతంలో కేసును దర్యాప్తు చేసిన అధికారి ఒకరు తెలిపారు. పదే పదే ఫోన్లు చేసి ఈ రెండు కార్పొరేట్ కాలేజీల జోలికి వెళ్లవద్దని, అటు యూనివర్సిటీ అధికారుల పాత్రపైనా పెద్దగా విచారణ చేయవద్దని, ఏదైనా ఉంటే ఫార్మాలిటీ పూర్తి చేస్తామని, దానికి కాలేజీ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని తనతో పదే పదే చెప్పినట్టు సదరు అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. అయితే వాటికి తాను ఒప్పుకోలేదని, కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించాలని వేడుకోగా ఉన్నతాధికారులు మరో అధికారికి అప్పగించినట్టు ఆయన వివరించారు. కీలక నిందితుల మృతిపైనా అనుమానాలు ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి కమిలేశ్ కుమార్ సింగ్ సీఐడీ కస్టడీలో మృతి చెందడం, ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం బయటకు తెచ్చిన రావత్ అనుమానాస్పదంగా చనిపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిలేశ్ సింగ్ గుండెపోటుతో మృతిచెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారని సీఐడీ అధికారులు చెబుతున్నా.. రావత్ మృతిపై మాత్రం నోరుమెదపడం లేదు. కమిలేశ్‌కు కస్టడీలో ఉండగా రెండుసార్లు గుండెపోటు వచ్చింది. మొదటిసారి ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ రెండోసారి నటన అనుకొని నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మృతి వెనక కూడా అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాసుబాబును సస్పెండ్ చేసిన శ్రీచైతన్య ఎంసెట్ లీకేజీ కేసులో అరెస్టయిన డీన్ ఓలేటి వాసుబాబును సస్పెండ్ చేస్తున్నట్టు శ్రీచైతన్య యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామంతో తమకేమీ సంబంధం లేదని, 32 ఏళ్ల విద్యాప్రస్థానంలో ఎప్పుడూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని ఆ విద్యాసంస్థల స్టేట్ కో–ఆర్డినేటర్ నరేంద్రబాబు పేర్కొన్నారు. -
ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు
-
ఎంసెట్ పేపర్ లీక్.. నారాయణ, శ్రీచైతన్యలకు లింక్
సాక్షి, హైదరాబాద్: 2016లో సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు. ఈ స్కాంతో నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు సంబంధాలున్నాయని తెలంగాణ సీఐడీ పోలీసులు నిర్ధారించారు. ఆయా కాలేజీల్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...ఎంసెట్ పేపర్ లీకేజీ స్కాం ప్రధాన నిందితులతో సంబంధాలున్న వాసుబాబును హైదరాబాద్‌లో, శివనారాయణను గుంటూరులో అరెస్టు చేశామని చెప్పారు. చైతన్య కాలేజీలకు డీన్‌గా వ్యవహరిస్తున్న వాసుబాబును ఎ-89, మరో నిందితుడు శివనారాయణ ఎ-90గా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ధనుంజయ ఠాకూర్, సందీప్ కుమార్‌లతో వీరిద్దరూ టచ్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆరుగురు విద్యార్థులకు ర్యాంకులు రావడానికి వాసుబాబు, శివనారాయణ ప్రధాన నిందితులతో ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. ఒక్కొక్క విద్యార్థి నుంచి 36 లక్షల రూపాయలు వసూలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురికి టాప్ ర్యాంకులు వచ్చాయని అన్నారు. ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా నిందితులను గుర్తించామని తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు. -
పేపర్ల లీకేజీలకు కేరాఫ్ రాజగోపాల్
► అనేక పేపర్ల లీకేజీలో సూత్రధారి ► 2007 నుంచి ఇదే దందా.. పలు కేసులు నమోదు ► ఎన్టీఆర్ వర్సిటీ పీజీమెట్-2014 లీకేజీలోనూ కీలక పాత్ర హైదరాబాద్: ఎంసెట్-2 లీక్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రాజగోపాల్‌రెడ్డికి... ప్రశ్నపత్రాలు లీకు చేయడంలో ఆరితేరాడు. ఇప్పటివరకు అతడిపై ప్రశ్నపత్రాల లీకులకు సంబంధించి పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాకు చెందిన రాజగోపాల్‌రెడ్డి అలియాస్ గోవింద్‌రెడ్డి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో స్థిరపడ్డాడు. విజయ బ్యాంకులో పనిచేసి 2005లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. విద్యారంగంలో అనేక మందితో పరిచయాలు పెంచుకొని 2007 నుంచి ప్రశ్నపత్రాలను లీక్ చేయడంలో ఆరి తేరాడు. బెంగళూరు కేంద్రంగా ఉషా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని స్థాపించిన రాజగోపాల్‌రెడ్డి... ప్రముఖ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తుంటాడు. కర్ణాటకలో 2007 నుంచి నాలుగు ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ స్కామ్‌లో ఇతడు సూత్రధారి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం నిర్వహించిన పీజీ మెట్-2014 ప్రశ్నపత్రం లీకేజీలోనూ ఇతడిదే కీలక పాత్ర. కర్ణాటకలో 2007 నుంచి 2013 మధ్య నాలుగు లీకేజీలకు పాల్పడి అరెస్టయ్యాడు. బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైన్ (ఆర్జీయూహెచ్ఎస్-2007) ప్రశ్నపత్రం లీకే జీ, కన్సార్షియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కొమెడ్ కే-2001) బోగస్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులతో సహా బెంగళూరు సీబీఐ, సెంట్రల్, హెచ్ఎస్ఆర్ లేజౌట్, జయనగర్ పోలీసు స్టేషన్లలో ఇతడిపై కేసులున్నాయి. 2014 పీజీమెట్ లీకేజీలోనూ కేసు నమోదైంది.