ఎంసెట్‌ కేటు.. కార్పొ‘రేటు’ | EAMCET Question Paper leak, Sri Chaitanya Groups Suspends Dean | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 6 2018 1:01 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

EAMCET Question Paper leak, Sri Chaitanya Groups Suspends Dean - Sakshi

సీఐడీ అదుపులో వాసుబాబు

సాక్షి, హైదరాబాద్‌: రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్‌ (మెడికల్‌) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కార్పొరేట్‌ కాలేజీల డొంక కదులుతోంది! ఇన్నాళ్లు లీకేజీకి పాల్పడ్డ నిందితులతోపాటు సాదాసీదా బ్రోకర్లను కటకటాల్లోకి నెట్టిన సీఐడీ తాజాగా ప్రముఖ కార్పొరేట్‌ కాలేజీ శ్రీచైతన్య డీన్‌ ఓలేటి వాసుబాబును అరెస్ట్‌ చేసింది. ఈయనకు సహకరిస్తూ విద్యార్థులను క్యాంపులకు తరలించిన ఏజెంట్‌ కమ్మ వెంకట శివ నారాయణ రావును కూడా గురువారం అరెస్ట్‌ చేసింది. దిల్‌సుఖ్‌నగర్‌ శ్రీచైతన్య బ్రాంచ్‌తోపాటు మరో ఆరు కేంద్రాల్లోని కాలేజీలకు ఓలేటి వాసుబాబు(ఏ–89) డీన్‌గా వ్యవహరిస్తున్నాడు. గుంటూరుకు చెందిన శివ నారాయణ రావు(ఏ90).. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించే ఏజెంట్‌. 

వీరిద్దరూ ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్‌ ధనుంజయ్‌ థాకీర్, డాక్టర్‌ సందీప్‌కుమార్‌తో డీల్‌ కుదుర్చుకున్నారు. కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిండ్రులకు మెడికల్‌ సీట్లు ఇప్పిస్తామని చెప్పి ముందుగానే ప్రశ్నపత్రం ఇచ్చేందుకు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్‌ కేంద్రంగా నడిచిన ప్రిపరేషన్‌ క్యాంపునకు ఆరుగురు విద్యార్థులను పంపారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 లక్షలు వసూలు చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. 

మరో ప్రముఖ కాలేజీకి సంబంధం? 
ప్రముఖ కార్పొరేట్‌ కాలేజీలకు ఎంసెట్‌ లీకేజీ స్కాంతో లింకులుండటం సంచలనంగా మారింది. డీన్‌ వాసుబాబు నిందితులతో పదేపదే మాట్లాడటంతోపాటు మరికొందరు విద్యార్థులను చేర్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఏజెంట్‌ శివ నారాయణ నుంచి మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉందని, మరో ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా ఆయన టచ్‌లో ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలిపారు. వీరిద్దరూ ప్రధాన నిందితులతో స్కాం బయటపడిన తర్వాత కూడా టచ్‌లో ఉండటం, విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లపై మరింత స్పష్టత రావాల్సి ఉందని దర్యాప్తు అధికారులు వివరించారు. 

అధికారుల పిల్లలకూ ‘ముందస్తు’ శిక్షణ 
శివ నారాయణ, డీన్‌ వాసుబాబు తీసుకువెళ్లిన విద్యార్థుల్లో కొందరు ప్రభుత్వాధికారుల పిల్లలుండటం సీఐడీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల పిల్లలతోపాటు ఆరుగురు ప్రభుత్వాధికారుల పిల్లలు కూడా లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ కోసం కటక్‌ క్యాంపునకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సీఐడీ అధికారులు స్పందించడం లేదు. శ్రీచైతన్య కాకుండా మరో ప్రముఖ కాలేజీ విద్యార్థులను సైతం వాసుబాబు కటక్‌లో శిక్షణకు తరలించినట్టు సీఐడీ గుర్తించింది. మరో 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన ఫోన్‌ ద్వారా పదే పదే టచ్‌లో ఉన్నట్టు తేలింది. ఈ మేరకు సీఐడీ ఆధారాలు సేకరించింది. త్వరలోనే వారిని కూడా అరెస్ట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి. 

కాలేజీ కోసమే చేశా.. 
తమ కాలేజీకి పేరు తీసుకువచ్చేందుకే ఈ స్కాంలో పాలు పంచుకున్నట్టు డీన్‌ వాసుబాబు తన వాంగ్మూలంలో ఒప్పుకున్నాడని సీఐడీ తెలిపింది. తల్లిదండ్రులను ఒప్పించి క్యాంపునకు పంపినట్టు ఆయన తెలిపాడు. తాను పంపిన ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురికి మంచి ర్యాంకులు వచ్చాయని, దీంతో వారి నుంచి మరింత డబ్బు వసూలు చేసేందుకు కూడా ఒప్పందం కుదిరినట్టు విచారణలో తేలింది. 

దర్యాప్తులో ఎందుకింత ఆలస్యం? 
సరిగ్గా రెండేళ్ల క్రితం ఎంసెట్‌ లీకేజీపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి లీక్‌ చేసినవారితోపాటు ఇతర నిందితులు అరెస్ట్‌ చేస్తూ వచ్చింది. మొదటి రెండు నెలల్లోనే 22 మంది కీలక నిందితులను అరెస్ట్‌ చేసిన సీఐడీ ఆ తర్వాతి రెండు నెలల్లోనే 64 మంది బ్రోకర్లను జైలుకు పంపించింది. కానీ ఆ తర్వాత నుంచి కేసు దర్యాప్తు నెమ్మదించింది. అయితే మొదట్లోనే శ్రీచైతన్య, మరో కార్పొరేట్‌ కాలేజీకి లింకుందని తెలిసినా ఎందుకు పట్టించుకోలేదన్న దానిపై ఇప్పుడు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో విచారించిన అధికారులు ఎవరి ఒత్తిడి మేరకు వారిని నిందితుల జాబితాలో చేర్చకుండా వదిలేశారు? 

దీని వెనుక ఎంత మొత్తం చేతులు మారిందన్న దానిపై ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. గతంలో ఇదే కేసులో అక్రమాలకు పాల్పడ్డ ఓ డీఎస్పీతోపాటు మరో ఇన్‌స్పెక్టర్, ఇతర సిబ్బందిని సీఐడీ అధికారులు సస్పెండ్‌ చేశారు. అయినా జంకని అధికారులు శ్రీచైతన్య డీన్‌తోపాటు ఏజెంట్‌ను వదిలిపెట్టడంపై ఇప్పుడు అంతర్గత విచారణ జరుపుతున్నట్టు సీఐడీ కీలక అధికారి ఒకరు చెప్పారు. 
పిలిచి పంపించారు 

గతేడాది ఆగస్టులో శ్రీచైతన్య డీన్‌ ఓలేటి వాసుబాబును ఓ సీనియర్‌ అధికారి విచారణకు పిలిచి పంపించి వేసినట్టు తాజాగా బయటపడింది. ఎందుకు పిలిచారు, ఎందుకు పంపించి వేశారు? కనీసం వాంగ్మూలం కూడా ఎందుకు రికార్డు చేయలేదు? సీఐడీ అదనపు డీజీపీకి కూడా తెలియకుండా నిందితుల జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఆరోపణల జాబితాలో ఉన్న మరో కాలేజీ హైదరాబాద్‌ కీలక బ్రాంచ్‌ ప్రిన్సిపల్‌ను సైతం దర్యాప్తు అధికారి ఓ హోటల్‌కు పిలిపించి వదిలేయడంపైనా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి సెల్‌ఫోన్‌ డేటాను పరిశీలిస్తే సంబంధిత ఉన్నతాధికారితోపాటు ఓ ఇన్‌స్పెక్టర్, మరో డీఎస్పీ వ్యవహారం బయటపడుతుందని సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. 

దర్యాప్తు అధికారులు మార్పు వెనుక.. 
ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన నాటినుంచి ఎనిమిది మంది దర్యాప్తు అధికారులు మారడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు దేశవ్యాప్తంగా లింకులుండటంతో ఒక సీనియర్‌ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించి బృందాలను ఏర్పాటు చేసి అరెస్టులు కొనసాగించారు. అయితే ఇదే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు దర్యాప్తు అధికారి మారిపోవడం, సస్పెన్షన్‌కు గురవడంతో అనుమానాలు తీవ్రమయ్యాయి. పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ఒత్తిళ్ల వల్లే తాను స్వచ్ఛందంగా దర్యాప్తు నుంచి తప్పుకున్నట్టు గతంలో కేసును దర్యాప్తు చేసిన అధికారి ఒకరు తెలిపారు. పదే పదే ఫోన్లు చేసి ఈ రెండు కార్పొరేట్‌ కాలేజీల జోలికి వెళ్లవద్దని, అటు యూనివర్సిటీ అధికారుల పాత్రపైనా పెద్దగా విచారణ చేయవద్దని, ఏదైనా ఉంటే ఫార్మాలిటీ పూర్తి చేస్తామని, దానికి కాలేజీ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని తనతో పదే పదే చెప్పినట్టు సదరు అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. అయితే వాటికి తాను ఒప్పుకోలేదని, కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించాలని వేడుకోగా ఉన్నతాధికారులు మరో అధికారికి అప్పగించినట్టు ఆయన  వివరించారు. 

కీలక నిందితుల మృతిపైనా అనుమానాలు 
ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి కమిలేశ్‌ కుమార్‌ సింగ్‌ సీఐడీ కస్టడీలో మృతి చెందడం, ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ప్రశ్నపత్రం బయటకు తెచ్చిన రావత్‌ అనుమానాస్పదంగా చనిపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిలేశ్‌ సింగ్‌ గుండెపోటుతో మృతిచెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారని సీఐడీ అధికారులు చెబుతున్నా.. రావత్‌ మృతిపై మాత్రం నోరుమెదపడం లేదు. కమిలేశ్‌కు కస్టడీలో ఉండగా రెండుసార్లు గుండెపోటు వచ్చింది. మొదటిసారి ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ రెండోసారి నటన అనుకొని నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మృతి వెనక కూడా అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

వాసుబాబును సస్పెండ్‌ చేసిన శ్రీచైతన్య 
ఎంసెట్‌ లీకేజీ కేసులో అరెస్టయిన డీన్‌ ఓలేటి వాసుబాబును సస్పెండ్‌ చేస్తున్నట్టు శ్రీచైతన్య యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామంతో తమకేమీ సంబంధం లేదని, 32 ఏళ్ల విద్యాప్రస్థానంలో ఎప్పుడూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని ఆ విద్యాసంస్థల స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ నరేంద్రబాబు పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement