Sri Chaitanya College
-
ఫీజు కట్టలేదని విద్యార్థిని గెంటేశారు
కంకిపాడు: ఫీజు కట్టలేదని విజయవాడ సమీపంలోని గోసాల శ్రీచైతన్య కళాశాల నుంచి యాజమాన్యం ఓ విద్యార్థిని అర్థరాత్రి వేళ బయటకు పంపించేసింది. దీంతో ఆ విద్యార్థి, అతని తండ్రి కళాశాల గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. మీడియాకు సమాచారం వెళ్లటంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. బాధితుడి కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆబోతు టార్జాన్ కుమారుడు గౌతమ్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.సంక్రాంతికి ఇంటికి వెళ్లిన గౌతమ్ ఆదివారం రాత్రి తన తండ్రితో కలసి కళాశాలకు వచ్చాడు. ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తామని కళాశాల సిబ్బంది చెప్పారు. టార్జాన్ తన వద్ద ఉన్న రూ 20 వేలు నగదును చెల్లించాడు. మిగిలిన రూ. 50 వేలు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని బతిమలాడారు. అందుకు యాజమాన్యం ససేమిరా అని విద్యార్థిని కళాశాల నుంచి పంపించేసింది. దీంతో విద్యార్థి గౌతమ్, అతని తండ్రి టార్జాన్ అర్ధరాత్రి కళాశాల గేటు వద్దే నిరసన వ్యక్తం చేశారు.పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌లో పరీక్షలు ఉన్నాయని, ఆ లోపు ఫీజు చెల్లిస్తానని చెప్పినా యాజమాన్యం అంగీకరించలేదని వాపోయారు. నిర్దాక్షిణ్యంగా తమను బయటకు పంపించేశారని తెలిపారు. పోలీసులు కూడా కళాశాలకు చేరుకుని ఆరా తీశారు. దీంతో యాజమాన్యం విద్యార్థి, అతని తండ్రితో మాట్లాడి విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. -
విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
-
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: తాడిగడప శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని మృతి చెందింది. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామానికి చెందిన రామిశెట్టి గంగా భువనేశ్వరి.. నీట్లో కోచింగ్ తీసుకుంటోంది. కామినేని ఆసుపత్రికి విద్యార్థిని మృతదేహన్ని తరలించారు. కాగా, తమ కుమార్తె మృతిపై విద్యార్థిని తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు, కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తండ్రికి గుండెపోటుకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.విద్యార్ధి తల్లి గోవింద లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు ఎటువంటి ఆనారోగ్య సమస్యలు లేవని.. నిన్న రాత్రి కూడా తనతో ఫోన్లో మాట్లాడిందన్నారు. గత రాత్రి తన కుమార్తెకు తలనొప్పి వస్తే అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పుడు చనిపోయింది అంటున్నారు.తలనొప్పి వస్తే ప్రాణం పోతుందా?. ఇప్పుడు నిర్లక్ష్యంగా శవాన్ని తీసుకువెళ్లమంటున్నారు’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన విషయం ఎందుకు దాచారు?. చనిపోయిందని ఆలస్యంగా ఎందుకు తెలిపారు?’’ అంటూ ఆమె ప్రశ్నించారు.ఇదీ చదవండి: తప్పు స్పెల్లింగ్‌తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు -
శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
మియాపూర్ శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ శ్రీచైతన్య కాలేజీలో ఓ విద్యార్థి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీచైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువున్న విద్యార్థి కౌశిక్ రాఘవ(17) నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
-
సాత్విక్‌ను బూతులు తిట్టి, చితకబాదారు: పోలీసులు రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి సాత్విక్ క్లాస్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాత్విక్ మృతిపై ఇంటర్ బోర్డ్ కమిటీ వేసి విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదికను కూడా వెల్లడించింది. ఇక, సాత్విక్ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్టు ప్రకారం.. కాలేజీ వేధింపుల వల్లే సాత్విక్ మృతిచెందాడు. సాత్విక్‌ను బూతులు తిట్టడం వల్లే మనస్తాపం చెందాడు. విద్యార్థుల ముందు కొట్టడం వల్ల హర్ట్ అయ్యాడు. ఆచార్యతో పాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచూ తిట్టడంతో మనస్తాపనికి గురయ్యాడు. చనిపోయిన రోజు స్టడీ అవర్‌లో ఆచార్య, కృష్ణారెడ్డి.. సాత్విక్‌కు చితకబాదారు. హాస్టల్లో సాత్విక్‌ను వార్డెన్ వేధించాడు అని స్పష్టం చేశారు. అంతకుముందు.. ఇంటర్ బోర్డు అధికారులు సాత్విక్ ఆత్మహ్యతపై ప్రభుత్వానికి నివేదికను అందించారు. నివేదికలో భాగంగా కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది. -
శ్రీచైతన్య కాలేజీలో సాత్విక్ ఆత్మహత్య ఘటనపై స్పందించిన విద్యాశాఖ
-
సాత్విక్: తప్పుల తడకగా అధికారులు రిపోర్ట్.. ఆవేదనలో పేరెంట్స్
సాక్షి, హైదరాబాద్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ బ్రాంచ్‌లో విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, సాత్విక్ ఆత్మహత్యపై ఇంటర్ బోర్డు రంగంలోకి దిగింది. అధికారులతో కమిటీ వేసింది. తాజాగా బోర్డు కమిటీ విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందించింది. అయితే, విచారణలో భాగంగా ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై తప్పుల తడకగా నివేదికను అందించారు అధికారులు. ఉస్మానియా మార్చురీలో మృతదేహం ఉంటే.. గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిపోర్టు, అధికారులపై సాత్విక్ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రిపోర్టులో సాత్విక్‌కు కాలేజీలో అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాగా, దీనిపై సాత్విక్ తల్లిదండ్రులు స్పందించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. సాత్విక్‌ను శ్రీచైతన్య కాలేజ్ పేరు మద అడ్మిషన్ చేశాం. శ్రీచైతన్య కాలేజ్ నార్సింగి క్యాంపస్‌లో జాయిన్ చేస్తామని చెప్పారు. శ్రీచైతన్యలోనే అడ్మిషన్ ఇస్తున్నామని చెప్పారు. వేరే కాలేజీలో అడ్మిషన్ ఉన్నట్టు మాకు తెలియదు. కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది. మాకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
సాత్విక్ మృతిపై కమిటీ రిపోర్ట్ ఇదే.. శ్రీచైతన్యకు షాక్!
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీచైత్యన కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ క్లాస్ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, సాత్విక్ ఆత్మహత్యపై ఎంక్వైరీ కమిటీ రిపోర్టును ఇచ్చింది. తాజా రిపోర్టులో కూడా పాత విషయాలనే అధికారులు ప్రస్తావించారు. అయితే, ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. రిపోర్టులో భాగంగా సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. అన్ని కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇదే బాగోతం ఉందని విచారణ కమిటీ పేర్కొంది. క్లాసులేమో శ్రీచైతన్యలో.. చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు గుర్తించింది. ఈ క్రమంలోనే అడ్మిషన్లపై అన్ని కాలేజీల్లో చెక్ చేయాలని కమిటీ సూచించింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది. -
Khammam: శ్రీచైతన్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
సాక్షి, ఖమ్మం: హైదరాబాద్ నార్సింగి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య ఘటన మరువకముందే ఖమ్మం శ్రీచైతన్య స్కూల్లో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. సాయి శరణ్య అనే పదో తరగతి స్టూడెంట్.. పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థిని ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడినట్లు చెబుతున్నారు. చదవండి: సడన్ హార్ట్ ఎటాక్.. కాలేజీలోనే కుప్పకూలిన ఇంజనీరింగ్ విద్యార్థి -
సాత్విక్ ఆత్మహత్య ఎఫెక్ట్: శ్రీ చైతన్య కాలేజీకి షాక్!
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ తరగతి గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యార్థి ఆత్మహత్యపై తాజాగా ఇంటర్ బోర్డ్ అధికారులు.. శ్రీ చైతన్య కాలేజీ మేనేజ్మెంట్కు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇంటర్ బోర్డు విచారణ చేపట్టింది. ఇక, విద్యార్థి సాత్విక్ మృతి నేపథ్యంలో డీఈవో ఆధ్వర్యంలో బోర్డు అధికారులు కాలేజీని విజిట్ చేశారు. ఈ ఘటనపై అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. కాగా, కాలేజీ మేనేజ్మెంట్ ఇచ్చే వివరణపై ఫైనల్ రిపోర్టు సిద్ధం చేసి అధికారులు.. కమిషనర్‌కు నివేదిక అందజేయనున్నారు. మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాలేజీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు, అధికారులు.. విద్యార్థులు, పేరెంట్స్, మిగిలిన లెక్చరర్ల నుంచి కూడా సమాచారం తీసుకుని నివేదిక తయారు చేయనున్నారు. ఇదిలా ఉండగా, నివేదిక అందిన వెంటనే కాలేజీ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని నవీన్ మిట్టల్ తెలిపారు. -
టార్చర్ తట్టుకోలేను.. వెళ్లిపోతున్నా..
ఒక్కసారి రా.. నాన్నా.. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్.. కాలేజీలో వేధింపులు భరించలేక చనిపోదామనుకున్నాడు.. నాన్న చివరి చూపు.. అమ్మతో ఆఖరి మాటల కోసం తపించాడు. ‘జ్వరం వచ్చింది.. ఒక్కసారి రా నాన్నా..’ అని ఫోన్ చేసి తండ్రిని పిలిపించుకున్నాడు. ఆఖరి సారిగా అమ్మతో ఆప్యాయంగా మాట్లాడాడు. అంతకు ముందే ‘మిస్ యూ అన్నా.. నన్ను క్షమించు.. అమ్మానాన్నను బాగా చూసుకో’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. తరగతి గదిలోనే ఉరివేసుకున్నాడు. కాలేజీలో పెట్టే నరకం భరించలేక... సూసైడ్ నోట్లో సాత్విక్ ఆవేదన బుధవారం సాయంత్రం నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ నుంచి సాత్విక్ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి డ్రెస్‌ల మధ్య సూసైడ్ నోట్ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్ పేర్కొన్నాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. ‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పనిచేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నాను. మిస్ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేనిలోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉండటం చూస్తే.. కొన్ని రోజుల కిందే రాసిపెట్టుకున్నట్టు ఉందని సాత్విక్ స్నేహితులు చెప్తున్నారు. మణికొండ (హైదరాబాద్)/ షాద్‌నగర్: ‘సరిగా చదవడం లేదంటూ తిడుతున్నారు. మార్కులు రాకుంటే గేటు బయట వాచ్‌మన్‌గా కూడా పనికిరావని అవమానిస్తున్నారు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్‌ను, నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను..’’ అంటూ ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ అధ్యాపకులు, హాస్టల్ నిర్వాహకుల వేధింపులతో మనస్తాపం చెంది తరగతి గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలోని నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అంతేకాదు హాస్టల్లో సాత్విక్ కనిపించడం లేదని చెప్పినా, ఉరివేసుకున్నట్టు తెలిసినా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని తోటి విద్యార్థులు చెప్పారు. తామే మోసుకుంటూ కాలేజీ బయటికి మోసుకొచ్చి, ఓ వాహనదారుడిని లిఫ్ట్ అడిగి ఆస్పత్రికి తీసుకెళ్లామని.. కానీ అప్పటికే సాత్విక్ మరణించాడని తెలిపారు. బుధవారం విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగటంతో ఈ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి సాత్విక్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం చేశాక కుటుంబ సభ్యులు సాత్విక్ మృతదేహాన్ని షాద్‌నగర్‌లోని ఇంటికి తీసుకెళ్లారు. పరీక్షలు ఉన్నాయని ఆగి.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన నాగుల రాజు షాద్‌నగర్‌లో ఉంటూ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సాత్విక్ నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. శివరా>త్రి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన సాత్విక్.. కాలేజీలో వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే 15 రోజుల్లో పరీక్షలు ఉన్నాయని, ముగిసిన వెంటనే మరో కాలేజీలో చేర్పిస్తామని తండ్రి సర్దిచెప్పాడు. దీనితో సాత్విక్ నాలుగు రోజుల క్రితం హాస్టల్‌కు తిరిగొచ్చాడు. జ్వరం వచ్చిందంటూ సాత్విక్ ఫోన్ చేయడంతో.. తండ్రి రాజు మంగళవారం రాత్రి 8గంటల సమయంలో హాస్టల్‌కు వచ్చి మాట్లాడి, మందులు ఇచ్చి వెళ్లిపోయారు. హాస్టల్లో రాత్రి 10.30 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహించారు. అందరి కంటే ముందుగా స్టడీ హాల్ నుంచి లేచిన సాత్విక్.. నేరుగా తరగతి గదికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నది ఈ గదిలోనే.. చెప్పినా పట్టించుకోని సిబ్బంది.. స్టడీ హాల్ నుంచి హాస్టల్ గదికి వచ్చాక సాత్విక్ రాలేదని గుర్తించి, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా.. ‘అతడే వస్తాడు, మీరు పడుకోండి..’ అంటూ నిర్లక్ష్యం చేశారని తోటి విద్యార్థులు చెప్పారు. గట్టిగా అరవడంతో అర గంట తర్వాత గేట్ తీశారని, కాలేజీ అంతా వెతకగా సాత్విక్ ఓ తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడని వివరించారు. వెంటనే అతడిని కిందికి దింపామని.. ప్రాణాలతో ఉన్నట్టు కనిపించడంతో కాలేజీ బయటికి తామే మోసుకుంటూ వచ్చామని తెలిపారు. ఇది చూసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని.. పైగా ఎలాంటి శబ్దం చేయకుండా తీసుకెళ్లా్లని చెప్పారని వాపోయారు. దీంతో తాము సాత్విక్‌ను మెయిన్ రోడ్డు వరకు మోసుకుంటూ వచ్చి, ఓ వాహనదారుడ్ని లిఫ్ట్ అడిగి సమీపంలోని నర్సింగ్ హోంకు తరలించామని.. కానీ అప్పటికే సాత్విక్ చనిపోయాడని డాక్టర్ చెప్పారన్నారు. ఇంటికి వచ్చిన అరగంటలోపే.. నాగుల రాజు తన కుమారుడికి మందులు ఇచ్చి సుమారు రాత్రి 10 గంటల సమయంలో షాద్‌నగర్‌లోని ఇంటికి చేరుకున్నాడు. తర్వాత అర గంట సేపటికి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచ్చింది. దీనితో కుటుంబమంతా హతాశులయ్యారు. సాత్విక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని, కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సాత్విక్ తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతుడి తల్లి అలివేలు, అన్న మిథున్లు పోలీసుల కాళ్లు పట్టుకుని, నిందితులను శిక్షించాలంటూ వేడుకున్న తీరు కలచి వేసింది. సమగ్ర విచారణకు మంత్రి సబిత ఆదేశం సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకోవాలని, త్వరగా విచారణ నివేదిక ఇవ్వాలన్నారు. అవమానించడంతోనే.. ఎక్కువ మార్కులు రాకపోతే కాలేజీ గేటు ముందు వాచ్‌మన్‌గా కూడా పనికిరారని, ర్యాంకు వచ్చేలా చదవాలని కాలేజీ అడ్మిన్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్లు వేధించడంతోనే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నా కుమారుడి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. – అలివేలు, సాత్విక్ తల్లి రోదిస్తున్న సాత్విక్ తల్లి, సోదరుడు చదువు ఒత్తిడి ఇలా చేస్తుందనుకోలేదు సాత్విక్‌కు కాలేజీలో ఎదురవుతున్న ఇబ్బందులను నాకు చెప్పాడు. దీనిపై కాలేజీ వారితో మాట్లాడుతానని సర్దిచెప్పాను. ఇంతగా తట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పి ఉంటే ఇంటికి తీసుకెళ్లే వాడిని. కాలేజీ నిర్వాహకులు ఫీజులు, ర్యాంకులు తప్ప విద్యార్థుల మనోభావాలతో పనిలేకుండా వ్యవహరిస్తున్నారు. కానీ చదువే ఇలా చావు వరకు తెస్తుందని ఊహించలేకపోయాం. – నాగుల రాజు, సాత్విక్ తండ్రి చదవడం లేదని రక్తం వచ్చేలా కొట్టారు గతంలో సరిగా చదవడం లేదం టూ నన్ను ముక్కుమీద గుద్దితే రక్తం వచ్చింది. కనికరం కూడా లేకుండా నాతోనే రక్తాన్ని కడిగించారు. షాద్‌నగర్ నుంచి వచ్చి చదువుకుంటున్న మా ఐదుగురు ఫ్రెండ్స్‌ను గాలి బ్యాచ్ అని హేళన చేసేవారు. కాలేజీ గేటు వద్ద వాచ్మన్లుగా కూడా పనికిరా రంటూ అవమానపర్చేవారు. – ప్రదీప్, తోటి విద్యార్థి వేధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు కాలేజీలో విద్యార్థులను ఉపాధ్యాయులు వేధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. దీనికి కారణమైన ముగ్గురు సిబ్బంది పోలీసుల అదుపులో ఉన్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తాం. విద్యాసంస్థల్లో వేధింపులు, అసౌకర్యాలపై విచారణ చేస్తాం. – స్వామి, చైతన్య కళాశాల ఏజీఎం నిందితులను అదుపులోకి తీసుకున్నాం విద్యార్థి మృతికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జగన్‌లను అదుపులోకి తీసుకున్నాం. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – జీవీ రమణగౌడ్, ఏసీపీ, నార్సింగి -
బాధ్యులైన వారిని శిక్షిస్తాం : మంత్రి సబిత
-
శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ ఆత్మహత్య.. మంత్రి సబిత కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ కుమారుడికి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ ఎదుట ఆందోళనల సందర్బంగా సాత్విక్ తల్లి స్పృహ తప్పిపోయి రోడ్డుపైనే పడిపోయారు. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యార్థిపై విచారణకు ఆదేశించారు సబిత. ఇదే సమయంలో ఈ ఘటనపై విచారణ చెపట్టాలని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌కు కూడా సబిత ఆదేశించారు. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ క్రిష్ణారెడ్డి, వార్డెన్లు నరేష్‌తో పాటు మేనేజ్మెంట్పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 305 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇక, అంతుకుముందు.. తమకు న్యాయం చేయాలంటూ శ్రీచైతన్య కాలేజీ ఎదుట విద్యార్థి పేరెంట్స్, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతిచెందాడని పేరెంట్స్ ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఆందోళనల సందర్బంగా సాత్విక్ తల్లి స్పృహ తప్పిపోయి రోడ్డుపైనే పడిపోయారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసి విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు. -
నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య
-
శ్రీ చైతన్య కాలేజీలో విషాదం
సాక్షి, హైదరాబాద్: శ్రీ చైతన్య కాలేజీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో, స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా అది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు కాలేజీ సిబ్బందిని సాయం కోరగా వాళ్లు పట్టించుకోలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారు. దీంతో, తోటి విద్యార్థులు బయట వాహనం లిఫ్ట్ అడిగి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం, సాత్విక్ పోస్టుమార్టం కోసం సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక, కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సాత్విక్ ఘటనపై విద్యార్థి పేరెంట్స్ స్పందించారు. గతంలో లెక్చరర్స్ కొట్టడంతో 15 రోజులు ఆసుపత్రి పాలయ్యాడు. సాత్విక్‌ను ఏం అనొద్దని గతంలోనే చెప్పాం. మెంటల్ స్ట్రెస్‌కి గురిచేయడం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. మా అబ్బాయి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాత్విక్ మృతితో శ్రీచైతన్య కాలేజీ ఎదుట విద్యార్థి పేరెంట్స్, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతిచెందాడని ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసి విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు. -
విజయవాడ శ్రీ చైతన్య కళాశాలపై ఏపీ ఇంటర్ బోర్డు చర్యలు
-
విజయవాడ శ్రీచైతన్య కాలేజీ గుర్తింపు రద్దు
మచిలీపట్నం: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోగల శ్రీచైతన్య (భాస్కర్భవన్ క్యాంపస్) జూనియర్ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తూ ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి రవికు మార్ ధ్రువీకరించారు. శ్రీచైతన్య జూనియర్ కాలేజీ గుర్తింపు రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ప్రత్యామ్నాయంగా ఇతర కాలేజీలకు సర్దుబాటు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల అభీష్టం మేరకు వారికి నచ్చిన కాలేజీలో అడ్మిషన్ తీసుకునేలా వెసులుబాటు కల్పించారు. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థిపై కాలేజీ అధ్యాపకుడు పరుష పదజా లంతో విరుచుకుపడటమే కాకుండా చేయిచేసుకో వడం తెలిసిందే. ఆ ఘటనపై చిత్రీకరించిన వీడి యో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. కేంద్ర విద్యాశాఖ సైతం దీనిపై జోక్యం చేసుకుని కలెక్టర్‌ను నివేదిక కోరింది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఘటనకు పా ల్పడిన అధ్యాపకుడిపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదుచేశారు. తాజాగా, కాలేజీ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించడంతోపాటు కాలేజీ గుర్తింపు రద్దు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు కాలేజీకి మూతవేస్తామని, విద్యార్థులకు ఎక్కడా నష్టం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని ఆర్ఐవో పి.రవికుమార్ తెలిపారు. విద్యార్థులకు ర్యాంకుల బూచి చూపించి హద్దు మీరి ప్రవర్తిస్తే ఎంతటి వారిపై అయినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. -
వీడియో: శ్రీ చైతన్య కాలేజీలో షాకింగ్ ఘటన.. మరీ ఇంత దారుణమా?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తరగతి గదిలో మాట్లాడాడని ఓ విద్యారి్థని అధ్యాపకుడు చెంపలు వాయించడంతో పాటు, కాలితో తన్నిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాల భాస్కర్ భవన్ క్యాంపస్‌లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు, చైల్డ్‌లైన్ వారు కూడా రంగంలోకి దిగారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక కళాశాలకు వెళ్లి విచారించారు. విద్యార్థి ఇయర్‌ఫోన్స్‌లో పాటలు వింటుంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో క్షణికావేశంలో అలా చేసినట్లు అధ్యాపకుడు చెబుతుండగా.. తమ అబ్బాయి వద్ద ఫోన్లేదని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. అధ్యాపకుడ్ని కళాశాల యాజమాన్యం శుక్రవారం తొలగించినట్లు ఆర్ఐవో తెలిపారు. Sri chaithanya Bhaskar bhavan #Vijayawada.@ysjagan@AndhraPradeshCM@APPOLICE100 pic.twitter.com/yKyAKzvHdJ — 𝐇𝐚𝐫𝐢𝐤𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐁𝐡𝐞𝐞𝐦𝐚𝐧𝐢 (@hari_bheemani) September 16, 2022 -
శ్రీచైతన్యలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కంకిపాడు: ఇంటర్మీడియెట్ విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణం చెందిన ఘటన కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో బుధవారం చోటుచేసుకుంది. కంకిపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన ఎం.స్నేహిత్ వర్మ (17) కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని శ్రీచైతన్య శ్రీప్రభ క్యాంపస్‌లో సీనియర్ ఇంటర్ (బైపీసీ) చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్ భవనంలో ఖాళీగా ఉన్న ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. (చదవండి: టమాటా ధర పైపైకి.. కిలో రూ.42) -
హాస్టల్లో ఉండలేనమ్మా!, 10 నిముషాల్లోనే ఘోరం
పెనమలూరు/పెద్దతిప్పసముద్రం: ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పోరంకిలోని శ్రీ చైతన్య క్యాంపస్‌లో సోమవారం చోటు చేసుకుంది. కృష్ణాజిల్లా పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన మదన్‌మోహన్‌రెడ్డి, మంజుల దంపతుల కుమార్తె బట్టి శిరీష (17) పోరంకిలోని శ్రీచైతన్య సరస్వతీ సౌధంలో ఇంటర్ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నది. ఇటీవల ప్రాక్టికల్స్ పరీక్ష రాసిన ఆమె తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 7వ తేదీన ఇంటికి వెళ్లింది. మరలా సోమవారం తల్లితో కలిసి పోరంకిలోని కాలేజీకి వచ్చింది. తాను హాస్టల్లో ఉండలేనని తల్లికి చెప్పగా.. ఆమె నచ్చజెప్పింది. దీంతో రూమ్‌లోకి వెళ్లి వస్తానని చెప్పి అరుంధతి బ్లాక్ రూమ్ నంబర్ 247లోకి వెళ్లింది. పది నిమిషాలైనా కుమార్తె తిరిగి రాకపోవడంతో తల్లి, కాలేజీ యాజమాన్యం రూమ్‌లోకి వెళ్లి చూడగా శిరీష చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న యువతి తండ్రి మదన్‌మోహన్‌రెడ్డి హుటాహుటిన సోమవారం కళాశాలకు వెళ్లారు. -
మార్కులు తక్కువచ్చాయని విద్యార్థులపై దారుణం
సాక్షి, రాజమండ్రి: కరోనా వైరస్ కాలంలోను తల్లిదండ్రులు ధైర్యం చేసి మరీ విద్యార్థులను కళాశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కులు, ర్యాంకుల కోసం కొన్ని కాలేజీలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ ఓ లెక్చరర్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఆన్సర్ పేపర్లు ఇస్తూ ఆగ్రహంతో విద్యార్థులను దారణంగా కొట్టాడు. మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులను విక్షణరహితంగా దండించాడు. భయంతో విద్యార్థులు తరగతి గదిలో లెక్చరర్‌కు దూరంగా వెళ్లినా వారిమీదికి విరుచకపడి మరీ జుట్ట పట్టుకొని చేయిచేసుకున్నాడు. వచ్చిన మార్కులను విద్యార్థులకు చూపిస్తూ ఇలా తక్కువ మార్కులు వస్తే ఎలా? అంటూ ఆవేశంతో విద్యార్థులను కొట్టాడు. అయితే ఈ వీడియోను అదే తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థి సెల్ఫోన్లో రికార్డు చేయగా ఆ వీడియో తాజాగా బయటపడింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవాలని కాలేజీ పంపితే లెక్చరర్ అనుషంగా ప్రవర్తించడం ఏంటని యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళ వ్యక్తం చేసున్నాయి. చదవండి: ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి -
రాజోలు శ్రీ చైతన్య జూ. కాలేజీలో అమానుషం
-
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, కంకిపాడు: కృష్ణా జిల్లాపునాదిపాడు శ్రీచైతన్య క్యాంపస్‌లో ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురానికి చెందిన దాసరి లాస్యశ్రీ (16)ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోరంకిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఎస్ఐ వై. దుర్గారావు సహచర విద్యార్థులను విచారించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దుర్గారావు తెలిపారు.