
శ్రీచైతన్య కళాశాల విద్యార్థుల వీరంగం
హోంగార్డుకు గాయాలు.. 20 మందిపై కేసు నమోదు
హైదరాబాద్: బాచుపల్లిలోని శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు శనివారం రాత్రి కళాశాలలో వీరంగం సృష్టించారు. రోడ్డుపైకి వచ్చి వాహనాలపై రాళ్లు రువ్వుతూ మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఆదివారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చివరి పరీక్ష ఉండడంతో శనివారం రాత్రి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫేర్‌వెల్ పార్టీ చేసుకుని.. అనంతరం కళాశాలలో ఫర్నీచర్, ఫ్యాన్లు, బల్బులు ధ్వంసం చేయడం ప్రారంభించారు. దీంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపాల్ మురళీమోహన్, సెక్యూరిటీ గార్డులపై దాడులు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే మరింత రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసులపైనే రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో బాచుపల్లి సీఐ బాలకృష్ణారెడ్డి అదనపు బలగాలను రప్పించి లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడిలో గాయపడిన హోంగార్డు రియాజ్ గాయపడ్డాడు. దాడులకు పాల్పడిన 20 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.