
చైతన్య కాలేజీ వద్ద భారీగా పోలీసులు
హైదరాబాద్: బాచుపల్లిలో అర్ధరాత్రి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థులు వీరంగం సృష్టించారు. ప్రిన్సిపాల్ తో పాటు సెక్యురిటీ గార్డును చితకబాదారు. అక్కడితో ఆగకుండా రోడ్డుపై వెళుతున్న బస్సుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. అడ్డుకున్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చైతన్య కాలేజీ వద్ద భారీగా పోలీసులను మొహరించారు. పరిస్థితిని ఏసీపీ సమీక్షిస్తున్నారు. విద్యార్థుల దాడిపై కాలేజీ యాజమాన్యం వింత వివరణయిచ్చింది. పరీక్షలు అయిపోయిన ఆనందంలో విద్యార్థులు ఇలా ప్రవర్తించారని, ఎవరినీ గాయపరచలేదని తెలిపింది. ఎటువంటి దాడి జరగలేదన్నట్టుగా కాలేజీ యాజమాన్యం వివరణ ఇవ్వడం గమనార్హం.