
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు చైతన్య కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంసెట్ మెడికల్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని చంద్రకా నాగమణి శనివారం మధ్యాహ్నం కళాశాల క్లాస్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన నాగమణి చైతన్య కాలేజీలోని వసతి గృహంలో ఉంటూ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది.
మరోవైపు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రికా నాగమణి రాసిన సూసైడ్ లేఖలో కీలక సమాచారం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే విద్యార్థిని తల్లిదండ్రులకు పోలీసులు ఆత్మహత్య సమాచారం అందించారు.
ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశం
విద్యార్థిని చంద్రికా నాగమణి ఆత్మహత్య ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. ఆమె మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా...విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్‌కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు.