ఒక్కసారి రా.. నాన్నా..
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్.. కాలేజీలో వేధింపులు భరించలేక చనిపోదామనుకున్నాడు.. నాన్న చివరి చూపు.. అమ్మతో ఆఖరి మాటల కోసం తపించాడు. ‘జ్వరం వచ్చింది.. ఒక్కసారి రా నాన్నా..’ అని ఫోన్ చేసి తండ్రిని పిలిపించుకున్నాడు. ఆఖరి సారిగా అమ్మతో ఆప్యాయంగా మాట్లాడాడు. అంతకు ముందే ‘మిస్ యూ అన్నా.. నన్ను క్షమించు.. అమ్మానాన్నను బాగా చూసుకో’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. తరగతి గదిలోనే ఉరివేసుకున్నాడు.
కాలేజీలో పెట్టే నరకం భరించలేక... సూసైడ్ నోట్‌లో సాత్విక్ ఆవేదన
బుధవారం సాయంత్రం నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ నుంచి సాత్విక్ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి డ్రెస్‌ల మధ్య సూసైడ్ నోట్ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్‌చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్ పేర్కొన్నాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. ‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పనిచేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నాను. మిస్ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేనిలోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉండటం చూస్తే.. కొన్ని రోజుల కిందే రాసిపెట్టుకున్నట్టు ఉందని సాత్విక్ స్నేహితులు చెప్తున్నారు.
మణికొండ (హైదరాబాద్)/ షాద్‌నగర్: ‘సరిగా చదవడం లేదంటూ తిడుతున్నారు. మార్కులు రాకుంటే గేటు బయట వాచ్‌మన్‌గా కూడా పనికిరావని అవమానిస్తున్నారు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్‌ను, నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను..’’ అంటూ ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ అధ్యాపకులు, హాస్టల్ నిర్వాహకుల వేధింపులతో మనస్తాపం చెంది తరగతి గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.
హైదరాబాద్ శివార్లలోని నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అంతేకాదు హాస్టల్‌లో సాత్విక్ కనిపించడం లేదని చెప్పినా, ఉరివేసుకున్నట్టు తెలిసినా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని తోటి విద్యార్థులు చెప్పారు. తామే మోసుకుంటూ కాలేజీ బయటికి మోసుకొచ్చి, ఓ వాహనదారుడిని లిఫ్ట్ అడిగి ఆస్పత్రికి తీసుకెళ్లామని.. కానీ అప్పటికే సాత్విక్ మరణించాడని తెలిపారు. బుధవారం విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగటంతో ఈ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి సాత్విక్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం చేశాక కుటుంబ సభ్యులు సాత్విక్ మృతదేహాన్ని షాద్‌నగర్‌లోని ఇంటికి తీసుకెళ్లారు.
పరీక్షలు ఉన్నాయని ఆగి..
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన నాగుల రాజు షాద్‌నగర్‌లో ఉంటూ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సాత్విక్ నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. శివరా>త్రి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన సాత్విక్.. కాలేజీలో వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పాడు.
అయితే 15 రోజుల్లో పరీక్షలు ఉన్నాయని, ముగిసిన వెంటనే మరో కాలేజీలో చేర్పిస్తామని తండ్రి సర్దిచెప్పాడు. దీనితో సాత్విక్ నాలుగు రోజుల క్రితం హాస్టల్‌కు తిరిగొచ్చాడు. జ్వరం వచ్చిందంటూ సాత్విక్ ఫోన్ చేయడంతో.. తండ్రి రాజు మంగళవారం రాత్రి 8గంటల సమయంలో హాస్టల్‌కు వచ్చి మాట్లాడి, మందులు ఇచ్చి వెళ్లిపోయారు. హాస్టల్‌లో రాత్రి 10.30 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహించారు. అందరి కంటే ముందుగా స్టడీ హాల్ నుంచి లేచిన సాత్విక్.. నేరుగా తరగతి గదికి వెళ్లి ఉరి వేసుకున్నాడు.
సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నది ఈ గదిలోనే..
చెప్పినా పట్టించుకోని సిబ్బంది..
స్టడీ హాల్ నుంచి హాస్టల్ గదికి వచ్చాక సాత్విక్ రాలేదని గుర్తించి, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా.. ‘అతడే వస్తాడు, మీరు పడుకోండి..’ అంటూ నిర్లక్ష్యం చేశారని తోటి విద్యార్థులు చెప్పారు. గట్టిగా అరవడంతో అర గంట తర్వాత గేట్ తీశారని, కాలేజీ అంతా వెతకగా సాత్విక్ ఓ తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడని వివరించారు.
వెంటనే అతడిని కిందికి దింపామని.. ప్రాణాలతో ఉన్నట్టు కనిపించడంతో కాలేజీ బయటికి తామే మోసుకుంటూ వచ్చామని తెలిపారు. ఇది చూసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని.. పైగా ఎలాంటి శబ్దం చేయకుండా తీసుకెళ్లా్లని చెప్పారని వాపోయారు. దీంతో తాము సాత్విక్‌ను మెయిన్ రోడ్డు వరకు మోసుకుంటూ వచ్చి, ఓ వాహనదారుడ్ని లిఫ్ట్ అడిగి సమీపంలోని నర్సింగ్ హోంకు తరలించామని.. కానీ అప్పటికే సాత్విక్ చనిపోయాడని డాక్టర్ చెప్పారన్నారు.
ఇంటికి వచ్చిన అరగంటలోపే..
నాగుల రాజు తన కుమారుడికి మందులు ఇచ్చి సుమారు రాత్రి 10 గంటల సమయంలో షాద్‌నగర్‌లోని ఇంటికి చేరుకున్నాడు. తర్వాత అర గంట సేపటికి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచ్చింది. దీనితో కుటుంబమంతా హతాశులయ్యారు. సాత్విక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని, కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సాత్విక్ తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతుడి తల్లి అలివేలు, అన్న మిథున్‌లు పోలీసుల కాళ్లు పట్టుకుని, నిందితులను శిక్షించాలంటూ వేడుకున్న తీరు కలచి వేసింది.
సమగ్ర విచారణకు మంత్రి సబిత ఆదేశం
సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకోవాలని, త్వరగా విచారణ నివేదిక ఇవ్వాలన్నారు.
అవమానించడంతోనే..
ఎక్కువ మార్కులు రాకపోతే కాలేజీ గేటు ముందు వాచ్‌మన్‌గా కూడా పనికిరారని, ర్యాంకు వచ్చేలా చదవాలని కాలేజీ అడ్మిన్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌లు వేధించడంతోనే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నా కుమారుడి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి.
– అలివేలు, సాత్విక్ తల్లి
రోదిస్తున్న సాత్విక్ తల్లి, సోదరుడు
చదువు ఒత్తిడి ఇలా చేస్తుందనుకోలేదు
సాత్విక్‌కు కాలేజీలో ఎదురవుతున్న ఇబ్బందులను నాకు చెప్పాడు. దీనిపై కాలేజీ వారితో మాట్లాడుతానని సర్దిచెప్పాను. ఇంతగా తట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పి ఉంటే ఇంటికి తీసుకెళ్లే వాడిని. కాలేజీ నిర్వాహకులు ఫీజులు, ర్యాంకులు తప్ప విద్యార్థుల మనోభావాలతో పనిలేకుండా వ్యవహరిస్తున్నారు. కానీ చదువే ఇలా చావు వరకు తెస్తుందని ఊహించలేకపోయాం.
– నాగుల రాజు, సాత్విక్ తండ్రి
చదవడం లేదని రక్తం వచ్చేలా కొట్టారు
గతంలో సరిగా చదవడం లేదం టూ నన్ను ముక్కుమీద గుద్దితే రక్తం వచ్చింది. కనికరం కూడా లేకుండా నాతోనే రక్తాన్ని కడిగించారు. షాద్‌నగర్ నుంచి వచ్చి చదువుకుంటున్న మా ఐదుగురు ఫ్రెండ్స్‌ను గాలి బ్యాచ్ అని హేళన చేసేవారు. కాలేజీ గేటు వద్ద వాచ్‌మన్లుగా కూడా పనికిరా రంటూ అవమానపర్చేవారు.
– ప్రదీప్, తోటి విద్యార్థి
వేధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు
కాలేజీలో విద్యార్థులను ఉపాధ్యాయులు వేధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. దీనికి కారణమైన ముగ్గురు సిబ్బంది పోలీసుల అదుపులో ఉన్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తాం. విద్యాసంస్థల్లో వేధింపులు, అసౌకర్యాలపై విచారణ చేస్తాం.
– స్వామి, చైతన్య కళాశాల ఏజీఎం
నిందితులను అదుపులోకి తీసుకున్నాం
విద్యార్థి మృతికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జగన్‌లను అదుపులోకి తీసుకున్నాం. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.
– జీవీ రమణగౌడ్, ఏసీపీ, నార్సింగి
Comments
Please login to add a commentAdd a comment