
అర్చన (ఫైల్)
హైదరాబాద్: ఫీజు వేధింపులకు ఓ ఇంటర్ విద్యార్థిని బలైంది. హాస్టల్ గదిలో ఉరేసుకుని విగతజీవిగా మారింది. ఈ సంఘటన హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రానికి చెందిన ధరణి సాయిలు, మంజుల దంపతులకు ముగ్గురు సంతానం. సాయిలు ఆర్టీసీ కండక్టర్. పెద్ద కూతురు అర్చన(15) చైతన్యపురిలోని శ్రీచైతన్య రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో బైపీసీ ఫస్టియర్ చదువుతోంది. రూ.లక్ష ఫీజుకుగాను సాయిలు రెండు నెలల క్రితం రు.50 వేలు చెల్లించారు. మిగతా ఫీజు చెల్లించాలని అర్చనపై యాజమాన్యం కొన్నిరోజులుగా ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలోనే రాఖీ పండుగ సందర్భంగా శనివారం అర్చన ఇంటికి వెళ్లి తిరిగి మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చింది.
ఆమె నేరుగా హాస్టల్‌లోని తన గదికి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.భోజన విరామ సమయంలో గదికి వచ్చిన సహ విద్యార్థినులు గమనించి వార్డెన్‌కు సమాచారమందించారు. వెంటనే వార్డెన్ వచ్చి సమీపంలోని ఓమ్నీ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అర్చన అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాలేజీ నిర్వాహకులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసి కళాశాలను మూసేసి పారిపోయారు. పోలీసులు అర్చన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్య విషయం చెప్పారు. వెంటనే వారు కాలేజీకి వచ్చి బోరున విలపించారు. ‘యాజమాన్యం ఫీజుల వేధింపులతోనే మా కూతురు మృతి చెం దింది, వారంరోజుల్లో ఫీజు మొత్తం చెల్లించాలని అనుకున్నాం, ఫీజు చెల్లించే వరకు మా బిడ్డను కాలే జీకి పంపక పోయినా బాగుండేది’అని రోదించారు. దీంతో కళాశాల పరిసరాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి అర్చన తల్లిదండ్రులతో కలసి కాలేజీ ముందు ఆందోళనకు దిగారు.
కళాశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి: విద్యార్థి సంఘాలు
అర్చన ఆత్మహత్యకు కారణమైన కళాశాల నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్‌ఎఫ్, టీఆర్‌ఎస్‌వీ, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ తదితర సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కళాశాల నిర్వాహకులు లక్షలాది రూపాయల ఫీజును ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఫీజుల పేరిట విద్యార్థులను వేధిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment