తిరుపతి గాంధీ రోడ్డులో ఉన్న నగరపాలక సంస్థకు చెందిన భవనం
తిరుపతి నగర పాలక సంస్థకు చెందిన భవనం శ్రీచైతన్య విద్యాసంస్థల కంబంధ హస్తాల్లో చిక్కుకుంది. సాంకేతిక సమస్యలను అడ్డుపెట్టుకుని ఆ సంస్థ ఏళ్ల తరబడి నామమాత్రపు అద్దె చెల్లిస్తోంది. కార్పొరేషన్ కాంప్లెక్స్‌ను చట్టపరంగా స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు ఉత్తర్వులిచ్చినా సదరు యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఖజానాకు లక్షల రూపాయల నష్టం వాటిల్లుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
సాక్షి, తిరుపతి : తిరుపతి నడిబొడ్డున ఉన్న గాంధీరోడ్డు ప్రధాన వ్యాపార కేంద్రం. 1995కు ముందు 30 సెంట్లు (360 అంకణాలు) పైగా స్థలంలో మున్సిపల్ మార్కెట్‌ను నిర్వహించేవారు. నగరం విస్తరించడం, గాంధీరోడ్డు రద్దీ కావడంతో మార్కెట్‌ను తుడా ఆఫీస్ ఎదురుగా మార్చారు. 1999లో గాంధీరోడ్డులోని పాత మార్కెట్ స్థలంలో 5800 చ.అ విస్తీర్ణంలో కాంప్లెక్స్‌ను నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 9 కమర్షియల్ గదులు, మొదటి, రెండు అంతస్తులను హాళ్లుగా నిర్మించారు. 1999 ఏప్రిల్‌లో ఈ కాంప్లెక్స్‌కు టెండర్ నిర్వహించారు. ఇందులో మొదటి, రెండో అంతస్తులను పూర్తిగా శ్రీచైతన్య విద్యాసంస్థ దక్కించుకుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని 3, 7 గదులు మినహా మిగిలిన గదులను ఆ సంస్థ దక్కించుకుంది. 2004 వరకు నెలకు రూ.75వేల అద్దెను చెల్లించేది. ఐదేళ్ల వరకు ఇదే అద్దెను చెల్లిస్తూ వచ్చింది.
ఆపై ప్రభుత్వ నిబంధనల మేరకు మూడేళ్లకు ఒకసారి 33.33 శాతం అద్దెను చెల్లించాలి. ఆ విధంగా 2007లో 33.33శాతం పెంచి అద్దెను చెల్లించింది. 2008లో తిరుపతి టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశమై నిబంధనలకు విరుద్ధంగా రద్దీ ప్రాంతంలో కళాశాలను నడిపేందుకు కేటాయించారని, కళాశాల గాంధీ రోడ్డులో ఉండడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని గుర్తించి లీజ్‌ను రద్దుచేయాలని నిర్ణయించింది. అధికారులు కళాశాలకు నోటీసులు జారీ చేశారు. దీనిపై కళాశాల యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. 33.33శాతం అద్దెను పెంచి చెల్లించాలని 2007లో అప్పటి అధికారులు చైతన్య కళాశాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను ఆధారంగా చూపిస్తూ 2010 వరకు నిబంధనలు వర్తిస్తాయని కళాశాల యాజమాన్యం వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది.
అప్పటి నుంచి కోర్టులో దీనిపై వాదనలు జరుగుతూ వచ్చాయి. 2016లో అప్పటి కమిషనర్ వినయ్‌చంద్ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలు జారీ బచేయాలని, కోర్టులో పూర్తిస్థాయిలో చార్జ్ ఫైల్ చేయాలని ఆదేశించారు. ఆ ఫైల్‌ను వేగంగా నడిపించారు. దీంతో 2017లో కళాశాలకు పర్మినెంట్ ఇంజెక్షన్ ఇస్తూ కార్పొరేషన్ చట్టప్రకారం భవనాన్ని స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పటి నుంచి అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. గత కమిషనర్ విజయ్‌రామరాజుకు సంబంధిత ఫైల్‌ను రెండుసార్లు పంపినా ఆయన పెద్దగా స్పందించలేదు. అప్పటి ప్రభుత్వం ఒత్తిడి వల్ల అధికారులు కళాశాలకు అనుకూలంగా వ్యవహరించారు.
కార్పొరేషన్‌కు లక్షల్లో నష్టం
గడిచిన 20 ఏళ్లుగా మున్సిపల్ కాంప్లెక్స్‌కు టెండర్ నిర్వహించకపోవడంతో కార్పొరేషన్‌కు లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. మూడేళ్లకు ఒకసారి 33.33శాతం అద్దెను పెంచి నామమాత్రంగా చెల్లిస్తున్నారు. మూడేళ్లకు ఒకసారి రీటెండర్ నిర్వహించి ఉంటే అద్దె మరింతగా పెరిగి కార్పొరేషన్‌కు ఆదాయం చేకూరేది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రధానమైన వ్యాపార కేంద్రం కావడంతో గాంధీరోడ్డులో ప్రైవేట్ భవనాల్లో అద్దె ఆకాశాన్ని అంటుతోంది. 2,800 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ భవనానికి రెండంతస్తులు, గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఏడు గదులకు కలిపి 2019 మార్చి నుంచి నెలకు రూ.2లక్షల 58వేలు చెల్లిస్తున్నారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం శ్రీచైతన్య విద్యాసంస్థలు నడుపుతున్న భవనానికి రూ.నాలుగు లక్షలకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పటికైనా స్పందిస్తారా?
గత ప్రభుత్వ ఒత్తిడి కారణంగా శ్రీచైతన్య విద్యాసంస్థలు నడుపుతున్న కార్పొరేషన్ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సాహసించలేదు. గడిచిన ఐదేళ్లుగా కోర్టుకు సరైన పత్రాలు సమర్పించలేకపోయారు. తీరా చట్టం ప్రకారం స్వాధీనం చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నా ఆదిశగా చర్యలు చేపట్టలేకపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్పొరేషన్‌కు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కేంద్రంలోని రద్దీ ప్రాంతంలో నడుపుతున్న భవనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో ఆందోళన చేయాల్సి వస్తుందని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధమని తెలిసినా..
మున్సిపాలిటీ టెండర్ ప్రకారం శ్రీచైతన్య విద్యాసంస్థ గాంధీరోడ్డులోని కాంప్లెక్స్‌ను దక్కించుకుంది. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఆకాంప్లెక్స్‌లో విద్యా సంస్థలను నడపడం చట్టవిరుద్ధం. 20 ఏళ్ల పాటు అదే భవనంలో కళాశాలను నడుపుతున్నారు. తిరుపతి నడిబొడ్డున ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్న గాంధీరోడ్డులో ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు నిత్యం రద్దీగా ఉంటుంది. కళాశాలకు విద్యార్థులు వచ్చి వెళ్లే సమయాల్లో విపరీతమైన రద్దీ సమస్య నగర వాసుల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. గాంధీరోడ్డు, తీర్థకట్టవీధి, గోవిందరాజ తేరు వీధి, తిలక్‌రోడ్డు వరకు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. విద్యాశాఖ, కార్పొరేషన్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజా అవసరాల దృష్ట్య ఈ భవనాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నా అధికారులు ఆదిశగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment