సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి సాత్విక్ క్లాస్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాత్విక్ మృతిపై ఇంటర్ బోర్డ్ కమిటీ వేసి విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదికను కూడా వెల్లడించింది.
ఇక, సాత్విక్ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్టు ప్రకారం.. కాలేజీ వేధింపుల వల్లే సాత్విక్ మృతిచెందాడు. సాత్విక్‌ను బూతులు తిట్టడం వల్లే మనస్తాపం చెందాడు. విద్యార్థుల ముందు కొట్టడం వల్ల హర్ట్ అయ్యాడు. ఆచార్యతో పాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచూ తిట్టడంతో మనస్తాపనికి గురయ్యాడు. చనిపోయిన రోజు స్టడీ అవర్‌లో ఆచార్య, కృష్ణారెడ్డి.. సాత్విక్‌కు చితకబాదారు. హాస్టల్‌లో సాత్విక్‌ను వార్డెన్ వేధించాడు అని స్పష్టం చేశారు.
అంతకుముందు.. ఇంటర్ బోర్డు అధికారులు సాత్విక్ ఆత్మహ్యతపై ప్రభుత్వానికి నివేదికను అందించారు. నివేదికలో భాగంగా కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment