అక్కలాగే తమ్ముడూనూ...
11 ఏళ్లకే ఇంటర్ ఫైనల్ రాసిన ఆగస్త్య జైస్వాల్
హైదరాబాద్: అతిచిన్న వయసులోనే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసి చరిత్ర సృష్టించాడు కాచిగూడ ప్రాంతానికి చెందిన ఆగస్త్య జైస్వాల్. గురువారం నుంచి ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 11 ఏళ్ల ఆగస్త్య హాజరై పరీక్షలు రాశాడు. 2015లో పదవ తరగతి పరీక్షలు రాసి అతిచిన్న వయసులో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర చరిత్రలోనే తొలి విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. గత సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.
ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని శ్రీ చైతన్య కాలేజీ సెంటర్‌లో ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్నాడు ఆగస్త్య జైస్వాల్. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని సెయింట్‌మేరీ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ సీఇసీ గ్రూపు చదువుతున్నాడు. ఆగస్త్య అక్క నైనా జైస్వాల్ 15 ఏళ్లకే పీజీ పరీక్షలు రాసి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ఎన్నో అవార్డులను నైనా సొంతం చేసుకుంది. తండ్రి అశ్విన్‌కుమార్, తల్లి భాగ్యలక్ష్మి ప్రోత్సాహం ఎంతో ఉండడంతో ఆ ఇంట్లో అక్కాతమ్ములు అన్ని రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఇతర విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.