
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
రైల్వేకోడూరు రూరల్: కారును మినీలారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే.. బద్వేలుకు చెందిన లక్ష్మీనరసయ్య గుప్త కుమార్తె పావనితోపాటు బంధువుల పిల్లలు సాయి మనీష, సారిక తిరుపతిలోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్నారు. వారిని దీపావళి పండుగకు స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు బుధవారం ఉదయం బద్వేలుకు చెందిన ఏపీ13 ఏఈ 9501 అనే నెంబరు గల మహీంద్రా వెరిటో కారును బాడుగకు మాట్లాడుకున్నారు.
డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లితో కలసి తిరుపతిలో ఉన్న విద్యార్థులను తీసుకుని బద్వేలుకు బయలు దేరారు. మార్గమధ్యలో కోడూరు మండలం శెట్టిగుంట పంచాయితీ జ్యోతి కాలనీ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి డీటీడీసీ కొరియర్ లోడ్‌తో తిరుపతికి వెళుతున్న ఏపీ 16 టీబీ 0980 నెంబరు గల మినీలారీ ముందుగా వెళుతున్న లారీలను ఓవర్‌టేక్ చేయబోరుు ఎదురుగా వస్తున్న కారుపైకి ఎక్కింది. ఆ కారులో ముందు సీట్లో కూర్చున్న లక్ష్మీనారాయణ గుప్త(45) అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ మస్తాన్‌వల్లి తలకు తీవ్రగాయాలయ్యాయి.
కారులో వెనుక సీట్లో కూర్చున్న పావని, సాయి మనీష, సారికలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు కారులో ఇరుక్కుపోయిన విద్యార్థులను, డ్రైవర్‌ను బయటికి తీశారు. ఐచర్ వాహనం ముందు చక్రాలు విరిగి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఐచర్ డ్రైవర్ రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని తిరుపతి 108 సిబ్బంది వచ్చి ప్రధమ చికిత్స చేసి అనంతరం 108లో తిరుపతి రుయాకు తరలించారు.